ఆ ప్రధాని వద్దకు వెళితే ఇక అంతే!
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వద్దకు రాజకీయ సందర్శకులు వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారంట. ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయడం లేదట. అదేంటి ఆయన దగ్గరకు వెళితే ఏం చేస్తారు.. కొడతారా తిడతారా లేక ప్రధాని అనే భయమా లేక అతి వినయమా అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు ఈ మధ్యనే ఆయన కైయా అనే ఓ కుక్కను తెచ్చుకున్నారు. అది కాస్త హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఆయన పక్కన ఉండగానే వచ్చిన సందర్శకులపై విరుచుపడుతుందట. తొలుత ఒకరిని కరిచిన ఆ కుక్క రక్తం రుచి పంటికి తగిలిందికాబోలు ఇక ఎవ్వరినీ వదిలిపెట్టకుండా ఒక్క నెతన్యాహును తప్ప అందరిని కరిచేందుకు లగెత్తుకు వెళుతోందట.
డిప్యూటీ విదేశాంగమంత్రి భర్తను కూడా ఆ కుక్క కరిచిందంటే ప్రధాని నెతన్యాహు కోసం ఎంతటి అతి వినయంగా ప్రవర్తిస్తుందో మీరే ఊహించుకోండి. బుధవారం ఏం చక్కా ఆయన క్యాండిల్ లైట్ లో డిన్నర్ ఏర్పాటు చేయగా అందులో కూడా ఇద్దరిపై దాడి చేసి కరిచేసిందట. దీంతో ప్రధాని కుక్కపై పలువురు, మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దాని సపర్యలు చూసేవారు మాత్రం అదంతా ఉత్తదేనని, కావాలనే మీడియా దుష్పచారం చేస్తుందని అంటున్నారు. కైయా ఎంతోమంది ప్రముఖులను కూడా కలుసుకుంది. వారిలో యూఎస్ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ కూడా ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు అప్పుడు కెర్రీని కైయా ఏమీ అనలేదు.