ఎగసి పడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండోసారి సెన్సెక్స్ 25,000 పాయింట్లను అధిగమించింది. ఇందులో విశేషమేవిటంటే... సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు(మే 16)నాటి ట్రేడింగ్‌ను పోలి మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూడటం! దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తొలుత లాభాలతో మొదలయ్యాయి. కొనుగోళ్లు పుంజుకోవడంతో ఉదయం 12కల్లా సెన్సెక్స్ 25,175ను తాకింది.
ఇది దాదాపు 500 పాయింట్ల లాభం! అయితే చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలను కోల్పోవడమేకాకుండా 24,434 పాయింట్ల కనిష్టస్థాయికి జారింది. 250 పాయింట్లకుపైగా నష్టమిది!చివరికి స్క్వేరప్ లావాదేవీల కారణంగా 23 పాయింట్ల లాభంతో 24,717 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా ఒక దశలో 130 పాయింట్లు ఎగసినప్పటికీ చివరికి 8 పాయింట్ల నష్టంతో 7,359 వద్ద స్థిరపడింది. బీజేపీకి మెజారిటీ లభించిందన్న వార్తలతో మే 16న కూడా సెన్సెక్స్ తొలుత 1,500 పాయింట్లు ఎగసినప్పటికీ తుదకు 215 పాయింట్ల లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.
భెల్ డౌన్, ఎంఅండ్ఎం అప్
బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ 5%పైగా పతనంకాగా, పవర్ 3% క్షీణించింది. రియల్టీ షేర్లు డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, ఫీనిక్స్ 10-5% మధ్య దిగజారాయి. ఈ బాటలో పవర్ షేర్లు జేపీ, అదానీ, ఎన్‌హెచ్‌పీసీ, పీటీసీ, టొరంట్, టాటా పవర్ 8-4% మధ్య తిరోగమించాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 5% నీరసించగా, గెయిల్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ 4-2% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు ఎంఅండ్ఎం 6.2% జంప్‌చేయగా, సెసాస్టెరిలైట్, విప్రో, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 4-2% మధ్య పుంజుకున్నాయి.
చిన్న షేర్లు డీలా
మార్కెట్లలో ఏర్పడ్డ ఒడిదుడుకుల కారణంగా చిన్న షేర్లు డీలాపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2%పైగా క్షీణించగా, ట్రేడైన షేర్లలో 1,660 నష్టపోయాయి. 1,362 మాత్రమే లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఉషా మార్టిన్, చెన్నై పెట్రో, కేఎస్కే ఎనర్జీ, స్పైస్ జెట్, జిందాల్ స్టెయిన్లెస్, ఐవీఆర్సీఎల్, ల్యాంకో ఇన్ఫ్రా, గీజాంజలి, జీవీకే, రెయిన్, ఆర్కిడ్, హెచ్‌సీసీ, నాల్కో, బీజీఆర్, బాంబే డయింగ్, ఎస్సార్ పోర్ట్స్, శ్రేఈ ఇన్ఫ్రా, బజాజ్ హిందుస్తాన్, డెల్టా కార్ప్, మ్యాగ్మా ఫిన్, ఈరోస్ 12-8% మధ్య పతనమయ్యాయి.
28 వేల పాయింట్లకు సెన్సెక్స్ డాయిష్ బ్యాంక్ అంచనా
వచ్చే డిసెంబరుకు సెన్సెక్స్ 28,000 పాయింట్లను చేరుతుందని డాయిష్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దేశీయ మార్కెట్ల రేటింగ్‌ను గత వారంలో ‘న్యూట్రల్’ స్థాయికి సంస్థ తగ్గించింది. కేంద్రంలో ఏక పార్టీ పాలన రావడం, ఆర్థిక అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉండడం, దేశ ప్రజానీకం మార్పును కోరుతుండడంతో ఇన్వెస్టర్లలో సందేహాలు తొలగిపోతాయని విశ్వసిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.