Prime Minister jandhan Yojana
-
ఆర్థిక సేవల చేరువలో ‘జన్‌ధన్’ విప్లవం
న్యూఢిల్లీ: జన్‌ధన్ యోజన ఆధారిత చర్యలు, డిజిటల్ పరివర్తన దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో విప్లవాత్మకంగా పనిచేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద 50 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చామని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ.2 లక్షల కోట్లను మించాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మేళన చర్యల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలు ప్రారంభించినవేనని, 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో తెరుచుకున్నవేనని వెల్లడించారు. ఈ పథకం కింద 2015 మార్చి నాటికి 14.72 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉంటే, 2023 ఆగస్ట్ 16 నాటికి 50.09 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో డిపాజిట్లు రూ.15,670 కోట్ల నుంచి రూ.2.03 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను కూడా బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ కార్డుపై రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా సైతం లభిస్తుంది. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ‘‘భాగస్వాములు, బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, ప్రభుత్వ అధికారుల సంయుక్త కృషితో పీఎంజేడీవై కీలక చొరవగా పనిచేసి, దేశంలో ఆర్థిక సేవల విస్తరణ ముఖచిత్రాన్ని మార్చేసింది’’అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ మాట్లాడుతూ.. జన్‌ధన్–ఆధార్–మొబైల్ ఆర్కిటెక్చర్‌తో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయగలుగుతున్నట్టు చెప్పారు. -
జన్‌ధన్‌లోకి 58 లక్షల పెన్షనర్ల అకౌంట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై)లోకి 58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు వెళ్లనున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సబ్సిడీలు, సంక్షేమ పథకాలన్నింటినీ ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పథకం కిందకు తీసుకు రావాలన్నది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల ఖాతాలను జన్‌ధన్‌లోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖను కేబినెట్ సెక్రటేరియట్ కోరింది. ఈ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకునేలా చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. ఆధార్ తో అనుసంధానం చేసిన జన్‌ధన్ అకౌంట్లను ప్రధాన అకౌంట్ (సింగిల్ అకౌంట్)గా ఉపయోగించుకునేలా చూడాలని కేబినెట్ సెక్రటేరియట్ కింద పనిచేసే డీబీటీ మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్)ను కోరింది. ప్రభుత్వ పరంగా లభించే ప్రయోజనాలన్నింటినీ ఈ అకౌంట్‌కు అందించేందుకు కేబినెట్ సెక్రటేరియట్ ప్రయత్నిస్తోంది. దీంతోపాటు జన్‌ధన్ యోజన లబ్ధిదారులకు రూ. లక్ష ప్రమాద బీమాగల రూపే డెబిట్ కార్డులను అందిస్తారు. ఈ అకౌంట్ల నుంచే అన్ని ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల) ప్రయోజనాలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద అందించడానికి ఇది దోహదపడుతుంది. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 22.65 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. ఇవి రూ. 40,750 కోట్ల నిల్వను కలిగి ఉన్నాయి. -
జన్‌ధన్ యోజనను ప్రారంభించిన హర్షవర్ధన్
న్యూఢిల్లీ: స్వాంతంత్య్ర దినోత్సవాల్లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం నగరంలో ప్రారంభించారు. ఢిల్లీవాసులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్ పిలుపునిచ్చారు. కోట్లాదిమందికి ప్రయోజనకరమైన ఈ పథకం దేశంలోని ఏడు కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలను తెరవనుందన్నారు. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కోటి ఖాతాలను ప్రారంభించినట్లు చెప్పారు. బ్యాంకు ఖాతాలున్నవారు.. లేనివారిని ఖాతా ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్నందున పేదలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హర్షవర్ధన్ చెప్పారు.