మోదీజీ మా కష్టాలను తీర్చండి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి వార్తల్లో నిలిచాడు. కాన్పూర్‌లోని ఉన్నావ్‌కు చెందిన నయన్ సింగ్ పాఠశాలకు వెళుతున్న క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను తెలుపుతూ ఈ లేఖ రాశాడు. ఈ లేఖకు సంబంధిత అధికార వర్గాల నుంచి స్పందన రావడంతో ఒక్కసారిగా ఈ 11 ఏళ్ల బాలుడు సెలబ్రిటీగా మారిపోయాడు.
వివరాల్లోకి వెళితే చంద్రశేఖర్ ఆజాద్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదవుకునే నయన్ తమ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ దగ్గర క్రాసింగ్ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను ఏకరువు పెడుతూ ప్రధానికి లేఖ రాశాడు. తన తోటి విద్యార్థులు, సహా తాను చాలా కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపాడు. చాలా దూరం నడిచి సుమారు రెండు కిలో మీటర్ల మేర చుట్టు తిరిగి స్కూలు కు వెళ్లాల్సి వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీనివల్ల చాలాసార్లు బడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలు వెళ్లాల్సి వస్తోందని, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మోదీకి మొరపెట్టుకున్నాడు.
గత ఏడాది సెప్టెంబర్‌లో నయన్ రాసిన ఈ లేఖకు రెండు రోజుల క్రితం రైల్వే శాఖ డివిజనల్ ఇంజనీర్ నుండి స్పందన వచ్చింది. అయితే రైల్వే క్రాసింగ్ దగ్గర బ్రిడ్జి నిర్మించే అధికారం తమ పరిధిలో లేదని ఆయన వివరించారు. నిబంధనల ప్రకారం రైల్వే మంత్రిత్వశాఖ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. మరోవైపు రైల్వే అధికారుల నుంచి లేఖ రావడంతో ఆశ్చర్యపోవడం నయన్ కుటుంబ సభ్యులు వంతు అయ్యింది.
తమ కొడుకు చూపిన చొరవ గురించి తెలుసుకొని తండ్రి అశుతోష్ సంతోషం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపడితే పిల్లలకే కాకుండా, వృద్ధులకు, మిగిలిన ప్రజలకు కూడా ఉపయోపగపడుతుందన్నారు. తాను ప్రధానికి ఉత్తరం రాసిన చాలా రోజులైందని నయన్ తెలిపాడు. అసలు ఆ ఉత్తరం గురించి తాను ఎప్పుడో మర్చిపోయానన్నాడు. అధికారుల నుంచి స్పందన అయితే వచ్చింది గానీ, ఇంతవరకు ఆ ఏరియాను ఏ అధికారి సందర్శించలేదని తెలిపాడు. మరి ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొ రుకుందా వేచి చూడాల్సిందే.