నగరంలో మారిషస్ ప్రధానికి శస్త్రచికిత్స
హైదరాబాద్: మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ గురువారం సోమాజిగూడలోని మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్స్ కో చైర్మన్, చీఫ్ సర్జన్ డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి ఆయనకు పరీక్షలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ తన కంటి చికిత్స కోసం హైదరాబాద్‌ను అందులోనూ మాక్స్ విజన్‌ను వైద్యానికి ఎంచుకోవడం గర్వకారణంగా ఉందని, బారతదేశంలో ఉన్న మెడికల్ టెక్నాలజీ, సదుపాయాలపై ఆయనకు మంచి అభిప్రాయం ఉందని పేర్కొన్నారు. అనిరుధ్ జగన్నాథ్ (84) రెండు నేత్రాల్లో గ్లకోమా, కాటరాక్ట్‌లు ఉండటం వల్ల ఆపరేషన్ క్లిష్టంగా మారిందని, అయినా ఒక్కో నేత్రానికి విడిగా శస్త్ర చికిత్స చేసి విజయవంతం చేశామన్నారు. అనిరుధ్ జగన్నాథ్‌కు భారతీయ వైద్యం గురించి మంచి అవగాహన ఉందని, భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరిచేలా ఆయన కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.