గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం
సాక్షి, గుంటూరు: జిల్లాలో గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం కలగనుంది. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలు మినహాయించి జిల్లాలో మిగిలిన 15 నియోజకవర్గాల పరిధిలో 171 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) ఫేజ్-2 కింద జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది.
గత మూడేళ్ల నుంచి కేంద్రం గ్రామీణ రహదారుల నిర్మాణానికి పీఎంజీఎస్వై నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రహదారులు మొత్తం పాడయ్యాయి. కొన్ని రూపు రేఖలు మారిపోయాయి. గతంలో పీఎంజీఎస్వై కింద శివారు గ్రామాలను కలిపే విధంగా 7.5 కిలోమీటర్ల వరకు లింకు రోడ్లు నిర్మించారు. ఈ దఫా పీహెచ్సీలు, స్కూల్స్, మార్కె టింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిం చారు.
జిల్లాలో 16 రోడ్లను రూ.99.58 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఇ. సి.సూర్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘సమర సాక్షి’ శీర్షికన జిల్లాలోని రహదారుల దుస్థితిపై ‘ప్రయాణానికి దారేదీ!?’ అంటూ కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ ఈ కథనాన్ని పంచాయతీ రాజ్ ఎస్.ఇ. సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన త్వరలో గ్రామీణ రహదారులకు మోక్షం కలగనున్నట్లు వివరించారు. ఇటీవల ఢిల్లీలో పీఎంజీఎస్వై నిధుల కేటాయింపుపై సాధికారత కమిటీ (ఎంపవర్డ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి హాజరయ్యారు. రాష్ట్రానికి పీఎంజీఎస్వై ఫేజ్-2 కింద నిధులు విడుదల చేయనున్నట్లు సాధికారత కమిటీ పేర్కొంది. దీనిలో భాగంగా జిల్లాకు రూ.99.58 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందని, త్వరలో జీవో విడుదల కానుందని ఎస్ఈ తెలిపారు.