ప్రధానికైనా సమన్లు ఇస్తాం
పీఏసీ చైర్మన్ కేవీ థామస్
కొచ్చి: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామని, అలాగే ప్రధానికి సమన్లు జారీ చేసే అధికారం కూడా తమకుందని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ కేవీ థామస్ సోమవారం తెలిపారు. దేశంలోని టెలికాం సంస్థలు కాల్ డ్రాప్‌లతో ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఈ–లావాదేవీలు చేయాలని ఆశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ప్రధాని తన అహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రూ. రెండు వేల నోట్లను జారీ చేసి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారు’ అని థామస్ మండిపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ, బ్యాంకింగ్ శాఖ కార్యదర్శులను జనవరి 20న తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.