Prime Minister Suraksha Yojana
-
కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు
ఐటీడీఏ పీవో కర్ణన్ అర్జుని కొలాంగూడలో కొలాం గిరిజనుల ప్రత్యేక సమావేశం నార్నూర్ : కొలాం గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ తెలిపారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు చేయడం అలవర్చుకుంటే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని అర్జుని కొలాంగూడ గ్రామంలో కొలాం గిరిజన సంఘాల అధ్వర్యంలో కొలాంల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీవో ముఖ్య అతిథిగా హాజరై గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కొలాం గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ చేయడానికి భూమి ఉన్నా ఎండ్లు లేవు. నీళ్లు, క రెంటు మోటారు, ఆరుులింజన్లు లేవు. కొలాం గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు అందడం లేదని కొలాం గిరిజనుడు కన్నా పీవో దృష్టికి తెచ్చారు. పీవో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు తీసుకొని చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నారు. చిన్న చిన్న రుణాల కోసం ఐటీడీఏ, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఐకేపీ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవన్‌జ్యోతి బీమా యోజన పథకం కింద కొలాం గిరిజనులకు ఐటీడీఏ ద్వారా బీమా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 1000 రైల్వే పోలీసు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందని, గ్రామంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఈ నెల మార్చి 3వరకు స్థానిక ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రూపావంతిజ్ఞానోబాపుస్కర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, కొలాం అభివృద్ధి అధికారి భాస్కర్, సర్పంచ్ జంగుబాయి కన్నా, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, మాజీ ఎంపీటీసీ భీంరావ్, గ్రామ పటేల్ జంగు, తహశీల్దార్ దేవానందం, ఎంపీడీవో సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, పశువైద్యాధికారి రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా విమోచన దినోత్సవం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పదాధికారుల సమావేశం డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా సంపర్క అభియాన్లను వినియోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల్లో కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూనే... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసేలా వ్యూహం రూపొందించారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. సమావేశం అనంతరం పార్టీనేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో యాదాద్రిలో రాష్ట్రస్థాయి కిసాన్ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షపార్టీగా పోరాటం చేస్తామన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి తెస్తామన్నారు. రాఖీబంధన్ సందర్భంగా 11 వేల మందితో ప్రధానమంత్రి సురక్షా యోజనను చేపడుతామని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.రామచందర్‌రావు, నామాజీ, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.