ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
- రాష్ర్టంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అమలు
- 20న విశాఖలో లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- రాష్ట్రానికి లక్షా 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల(బీపీఎల్) వారికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు కానున్నాయి. ‘ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనుంది. రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 20న విశాఖపట్నంలో ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంఛనంగా ప్రారంభించనున్నారని చమురు కంపెనీలు తెలిపాయి. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 90 వేల కనెక్షన్లను మంజూరు చేయనున్నారు. తెలంగాణలోనూ లక్ష కనెక్షన్లు మంజూరైనట్టు సమాచారం. వీటిని బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల పేరిట అందజేస్తారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన కొద్దిమందికి కేంద్రమంత్రితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేయనున్నట్టు చమురు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే పేరుకు ఉచితమే అయినప్పటికీ.. గ్యాస్ సిలిండర్‌పై వచ్చే సబ్సిడీ మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి తీసేసుకుంటారని ఈ వర్గాలు వెల్లడించాయి.
సబ్సిడీని ఇలా...
ఈ పథకం కింద ఇచ్చే ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.3,200 మేరకు వ్యయమవుతుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ కనెక్షన్ కింద మహిళా లబ్ధిదారులకు ఒక సిలిండర్, రెగ్యులేటర్, గ్యాస్ స్టవ్ ఇస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి బొమ్మ ముద్రించిన ఉజ్వల్ పుస్తకాన్ని అందజేస్తారు. ఇందులో రూ.1,600ను కేంద్రం సబ్సిడీగా అందిస్తుంది.మిగిలిన రూ.1,600 ను వినియోగదారుడు ముందుగా చెల్లించే పనిలేకుండా రుణంగా ఇస్తారు. దీన్ని గ్యాస్ సిలిండర్‌పై వచ్చే సబ్సిడీగా వసూలు చేస్తారు.
ఘనత కేంద్రానికే దక్కేలా ప్రణాళిక
ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం ఘనత అంతా తమకే దక్కేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఎక్కడా రాష్ట్రప్రభుత్వ ఆనవాలు లేకుండా దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎంపీల ద్వారా ప్రతీ జిల్లా కేంద్రంలో పథకాన్ని ప్రారంభిస్తారు. అదేసమయంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఉజ్వల్ మేళా’లను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మతో ఈ మేళాలను నిర్వహించనుండడం విశేషం. తద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల మంజూరు ఘనతను పూర్తిగా తానే తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.