మొండి బకాయిల భారం మరింత తీవ్రం!
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల (ఎన్పీఏ) భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సీ. రంగరాజన్ విశ్లేషించారు. ఆర్థిక మందగమన పరిస్థితులు దీనికి కారణమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులు-ఆర్థిక సంస్థల ప్రధాన నిఘా(సీవీఓ), సీబీఐ అధికారుల 5వ వార్షిక సదస్సును ఉద్దేశించి రంగరాజన్ ప్రసంగించారు. మొండి బకాయిల విషయంలో బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఆర్థిక పరిణామాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు అంచనావేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు పోవాలని పేర్కొన్నారు. 2010లో రూ.59,924 కోట్లుగా ఉన్న బ్యాంకుల మొండిబకాయిలు 2012లో రూ. 1,17,262 కోట్లకు పెరిగిపోయాయని సిన్హా పేర్కొన్నారు.
బ్యాంక్ మొండి బకాయిలపై సీబీఐ దర్యాప్తు
ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో రుణాలను ఎగవేసిన వారిపై దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా బుధవారం చెప్పారు. భారీగా రుణ ఎగవేతలకు సంబంధించి 30 అకౌంట్లను గుర్తించామని, ఈ 30 అకౌంట్ల కారణంగా బ్యాంకుల మొండి బకాయిలు వేల కోట్లకు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ అకౌంట్ల వివరాలను వెల్లడిస్తే దర్యాప్తు దారితప్పే అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల ఐదవ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసాలు, మొండి బకాయిలను గుర్తించడంలో బ్యాంకులు చేస్తున్న జాప్యం కారణంగా వాటిని ట్రాక్ చేయడం, రుణాలను రికవరీ చేయడం తదితర అంశాలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ల వృద్ధిలతో పాటే బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు.