ప్రధాని సదస్సుకు నలుగురు మహిళా సర్పంచులు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లాకు చెందిన నలుగురు సర్పంచులు పాల్గొంటున్నారు. తమ గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో వీరు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న సదస్సుకు ఎంపికయ్యారు. జిల్లాలో మొత్తం 83 గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఐదుగురు సర్పంచులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు హాజరయ్యేందుకు అవకాశం కలిగింది. అయితే ఒకరు వ్యక్తిగత కారణాలతో హాజరయ్యేందుకు విముఖత చూపగా, నలుగురు సర్పంచులను అధికారికంగా గుజరాత్‌కు పంపుతున్నారు.
గాంధీనగర్‌కు వెళ్తున్నది వీరే
నందికొట్కూరు మండలం బొల్లవరం, బిజినెవేముల గ్రామాల సర్పంచులు అనురాధ, తెలుగు లక్ష్మమ్మ, మద్దికెర మండలం ఎడవలి గ్రామ సర్పంచు నెట్టెకంఠమ్మ, దేవనకొండ మండలం నల్లచెలిమిల గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జరుగుతున్న సదస్సుకు బయలుదేరుతున్నారు. వీరిని విజయవాడకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఏసీ రైల్లో గాంధీనగర్‌కు పంపుతున్నారు. ఆ సదస్సులో వీరు ప్రధాని చేతుల మీదుగా సన్మానం, ప్రశంసాపత్రాలను అందుకోనున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని జిల్లాలోని 50 మంది మహిళా సర్పంచులు వినే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మహిళా సర్పంచులకు సమాచారాన్ని చేరవేశారు. వీరందరిని ఒకచోటికి చేర్చి ప్రధాని ప్రసంగాన్ని వినిపించనున్నారు.