ఆరేళ్లుగా ఆంగ్ల మాధ్యమంలో..
మోర్తాడ్ : రామన్నపేట్ ప్రాథమిక పాఠశాలకు ఆరేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయుడిగా జంగం అశోక్ వచ్చారు. అప్పటికి పాఠశాలలో 40 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆయన కృషి చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండడంతో పిల్లలను అక్కడికే పంపిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాల మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఉపాధ్యాయ బృందంతో చర్చించారు. గ్రామస్తుల సహకారంతో అదే ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను దాతల సహకారంతో సేకరించి అందిస్తున్నారు. అంతేకాక విద్యార్థులకు టై, బెల్టు, ఇతర్ర సామగ్రినీ ఇస్తున్నారు. దీంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగసాగింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులున్నారు.
అందరి సహకారంతో..
రామన్నపేట్ పాఠశాలలో ఆరేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమించారు. శ్రమిస్తూనే ఉన్నారు. దాతలూ సహకరిస్తుండడంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీని సమకూర్చగలుగుతున్నాం.
– జంగం అశోక్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు, రామన్నపేట్