స్లమ్ డ్యాన్స్ మిల్లియనీర్
ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలని ఊళ్లకు ఊళ్లు నిద్రమానేసి ప్రార్థించడం చూశాం. ఒక సినిమా నటుడో నటో వస్తుంటే జనం బారులు తీరి నిలబడడం చూశాం. కాని ఒక లోకల్ డ్యాన్సర్ కోసం ఇలాంటివన్నీ జరగడం ఎప్పుడైనా చూశామా? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆ కుర్రాడి గెలుపు కోసం ఓటేయడం, ఎకరాల భూమిని నజరానాగా అందించడం చూశామా? తన నృత్య ప్రావీణ్యాన్నే స్టేట్ మొత్తాన్నీ తన అభిమానులుగా మార్చుకునేందుకు ‘స్టెప్పింగ్’ స్టోన్‌గా మార్చుకున్న ఒడిశా యంగ్‌స్టార్ కృష్ణమోహన్‌రెడ్డి (30) తనలాంటి మరికొందరు బస్తీ కుర్రాళ్లను జత చేసుకుని స్థాపించిన ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్.. ఇప్పుడు దేశంలోని టాప్ డ్యాన్స్ టీమ్‌లలో ఒకటి.
ఇంతా చేసింది ఈ మన తెలుగోడే కావడం విశేషం. ఇటీవల హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్లో ఉర్రూతలూగించిన కృష్ణమోహన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. ‘మా తాతల కాలం నాడు పలాస దగ్గరలోని నౌపడాలో ఉండేవాళ్లు. మా నాన్న ఎలక్ట్రికల్ లైన్‌మన్. అమ్మ గృహిణి. నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కాచెల్లెళ్లున్న పెద్ద కుటుంబం మాది. ఎలా అబ్బిందో గాని నాకు డ్యాన్స్ తప్ప మరేమీ వచ్చేది కాదు. టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. 2005లో స్కూల్ చదువు పూర్తి చేశాక ఇంటి ఖర్చులు, డ్యాన్స్ క్లాసెస్ ఫీజుల కోసం ఏ పని దొరికితే అది చేశాను.
అప్పుడే నాలాంటి ఏడుగురు యువకులతో ఓ బృందాన్ని తయారు చేశాను. కార్ఖానా నుంచి క్యాంటీన్ దాకా పని చేసేవాళ్లకు పాటలే కదా ఊపు. అలా ఊపులో స్టెప్స్ వేస్తూ పని చేసేవాళ్లను చూశాక.. వీళ్లు మంచి డ్యాన్సర్లు అవుతారన్న నమ్మక ం కలిగింది. కుర్రాళ్లకు క్యాచీగా ఉంటుందని.. ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్ పేరు పెట్టాను. ఏడాదిలో మా బృందంలో డ్యాన్సర్స్ సంఖ్య 16కు చేరింది. స్థానికంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చాం. 2006లో ఒడిశా నుంచి బూగీ వూగీ (సోనీ)లో పార్టిసిపేట్ చేశాం. రన్నర్స్‌గా నిలిచి రూ.75 వేలు గెలుపొందాం. మా టీమ్‌కు మలి బ్రేక్ ఇండియా గాట్ టాలెంట్.
ఇంటర్నేషనల్ స్థాయికి చేరాలని..
మాలో పాతిక మంది బృందం కలర్స్ టెలివిజన్ ఇండియాస్ గాట్ టాలెంట్ అడ్వర్టయిజ్మెంట్ చూసి అప్లయ్ చే శాం. మైథలాజికల్ బేస్డ్ కాన్సెప్ట్ తీసుకుని పెర్ఫార్మెన్స్ ఇచ్చాం. దీనిలో పాల్గొనడం కోసం అప్పు కూడా చేశాం. గెలిచాం. రూ.50 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. మా సీఎం నవీన్ పట్నాయక్ మాకు 4 ఎకరాల భూమిని, గోపాల్‌పూర్‌లో భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు. తర్వాత దేశ విదేశాల్లో వెయ్యికి పైగానే షోస్ ఇచ్చాం.
కామన్వెల్త్గేమ్స్లో ఒడిశా తరఫున ఓపెనింగ్ సెర్మనీకి రిప్రజెంట్ చేసింది మా గ్రూప్, ప్రస్తుతం 50 మంది ఉన్న మా బృందంలో ఎవరికీ ఆర్థిక ఇబ్బందుల్లేవు. అంతర్జాతీయ స్థాయి డ్యాన్స్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయడమే తదుపరి లక్ష్యం. అమెరికా, లండన్లలో జరిగే పోటీల్లో మేం పాల్గొనేందుకు ప్రభుత్వం మమ్మల్ని స్పాన్సర్ చేయనుంది’ అంటూ వివరించాడు కృష్ణమోహన్. హైదరాబాద్‌కు తరచూ వస్తుంటానని, తన అన్నయ్య, డ్యాన్స్‌లో తనకు గురుతుల్యుడు హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని చెప్పాడు.
ఊరికిచ్చిన కారు..
ఇండియా గాట్ టాలెంట్‌లో వీరి గెలుపు కోసం రాష్ట్రం మొత్తం తపించడం, తమ ఊర్లోనైతే అర్ధరాత్రి దాకా టీవీలకు అతుక్కుపోవడాన్ని గురించి చెబుతున్నప్పుడు కృష్ణమోహన్ కళ్లలో తన రాష్ట్రప్రజల పట్ల అంతులేని కృతజ్ఞతాభావం కనిపిస్తుంది. తనకు బహుమతిగా వచ్చిన మారుతి రిట్జ్ కారును ఊరి ప్రజలకు ఎమర్జన్సీలో ఫ్రీ సర్వీస్‌గా అంకితమిచ్చాడు. వ్యక్తిగత ప్రతిభకు తోటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గుణం కూడా తోడైతే.. స్లమ్ బాయ్ కూడా సూపర్ ఫేమ్ సాధించగలడని నిరూపించిన మన తెలుగు తేజానికి జేజేలు.
బడి దాటని చదువులు..
ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్ ఉన్న సభ్యుల్లో అత్యధికులు 5 నుంచి 10 వతరగతిలోపు మాత్రమే చదువుకున్నవారు. గ్రూప్ ప్రారంభించిన కృష్ణమోహన్‌రెడ్డి అతి కష్టమ్మీద ప్లస్ టూ దాకా వస్తే, పూర్ణదాస్, అర్జున్‌కుమార్ సాహు, శిబదాస్లు 5వ తరగతి సింహాద్రి దాస్, శ్రీకాంత్‌దాస్ 3వ తరగతి, సంతోష్‌దాస్ 2వతరగతి, ఇలా ప్రైమరీ స్కూల్ దాటనివారే అధికం. ఇక పోలియోతో ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అయి, కర్రల సాయంతో పాల్గొన్నపద్మనాభసాహు, తులు త రిణిలు 7వ తరగతి వరకూ
చదివి వీరితో పదం కదపడం విశేషం.