Princess Kate
-
ప్రిన్స్ దంపతులకు ప్రధాని విందు
న్యూఢిల్లీ: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ మిడిల్టన్లకు ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్ హౌస్‌లో మధ్యాహ్న విందు ఇచ్చారు. ఇండియా గేట్ పక్కనేవున్న ఈ భవంతిలో విలియం జంటకు మోదీ స్వాగతం పలికారు. భారత శాకాహార, మాంసాహార వంటకాల్ని వడ్డించారు. సంతూర్ వాద్యకారుడు రాహుల్ శర్మ ఈ విందులో వీనులవిందైన సంగీతం వినిపించారు. బీటిల్స్ గీతం ‘లెట్ ఇట్ బీ’ ఆకర్షణగా నిలిచింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. కాగా, విలియం జంట ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం అస్సాం చేరుకుంది. తేజ్‌పూర్‌లో సీఎం తరుణ్ గొగోయ్ ఘనస్వాగతం పలికారు. అస్సాం పర్యటనలో ఈ జంట ఒంటి కొమ్ము రైనోలకు ప్రసిద్ధి చెందిన కజిరంగ జాతీయ పార్కును సందర్శిస్తుంది. -
ప్రిన్స్ జంటకు ఢిల్లీ స్వాగతం
ముంబై: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన సతీమణి కేట్ మిడి ల్టన్‌ల రెండో రోజు భారత పర్యటన ఉత్సాహంగా సాగింది. సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న వీరు మహాత్మాగాంధీ స్మృతి వనంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న మ్యూజియంను సందర్శించారు. గాంధీ వాడిన చరఖా గురించి తెలుసుకున్నారు. 30 మంది స్కూలు విద్యార్థులతో విలియం దంపతులు ముచ్చటించారు. 45 నిమిషాలు గాంధీ స్మృతివనంలో వారిద్దరూ గడిపారు. క్రీమ్ రంగు దుస్తుల్లో మిడిల్టన్ మెరిసిపోయారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 90వ జన్మదినం సందర్భంగా రాత్రి బ్రిటిష్ హైకమిషనర్ ఇచ్చిన విందుకు విలియం జంట హాజరైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చట అంతకుముందు ఉదయం ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముంబై లో నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ప్రపంచంలోని ఆరో వంతు జనాభా కల్గిన భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పాత్ర చాలా కీలకమని విలియం అన్నారు. విలియం దంపతులు టెక్ రాకెట్‌షిప్ అవార్డుల్ని అందచేశారు. మహింద్రా గ్రూపు రూ పొందించిన సిమ్యులేటింగ్ ఫార్ములా కారునుయువరాజు నడిపారు. దోసె మిషన్‌పై దోసె వేసి రుచి చూశారు. మంగళవారం ఈ జంటకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. -
వీరులకు విరుల నివాళి...
బ్రిటన్ యువరాజు విలియమ్, హ్యారీ, యువరాణి కేట్లు విహరిస్తున్నది పూల తోటే.. అయితే.. ఇవి మామూలు పూలు కావు. పింగాణీతో చేసిన పుష్పాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లవుతున్న సందర్భంగా లండన్ టవర్ వద్ద ‘బ్లడ్ స్వెప్ట్ ల్యాండ్స్ అండ్ సీస్ ఆఫ్ రెడ్’ పేరిట ఏర్పాటు చేసిన పింగాణీ పూల స్మారకాన్ని మంగళవారం వీరు అధికారికంగా ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 8,88,246 మంది బ్రిటిష్, కామన్వెల్త్ సైనికులకు (ఇందులో మన భారతీయులు 74 వేల మంది ఉన్నారు) గుర్తుగా.. ఇక్కడ 8,88,246 పింగాణీ పూలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకూ 1,20,000 పింగాణీ పూలను నాటారు. నవంబర్ 11న (మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు-1918, నవంబర్ 11) చివరి పింగాణీ పూల మొక్కను నాటుతారు.