కృష్ణా పుష్కరాలకు ఫ్లైఓవర్ సిద్ధం
ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు
విజయవాడ : దుర్గగుడి వద్ద రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి సమన్వయ శాఖల అధికారులు కృషి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. శ్యాంబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలనాటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. మూడు దశల్లో ఫ్లై ఓవర్ పూర్తి చేసే విధంగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. పోలీసు, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సరళీకృత విధానంలో చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఇప్పటికే క్షేత్ర స్థాయి సర్వే పరిశీలన పూర్తి చేశామన్నారు. 2,350 మీటర్ల ప్లైఓవర్ నిర్మాణం వస్తుందని ఇందుకు సంబంధించి కన్సల్టెంట్ నివేదికను సమర్పించామన్నారు.
కృష్ణాపుష్కరాల నాటికి ప్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకితీసుకురావాల్సి ఉందన్నారు. ఫ్లై ఓవర్ పనులు జరిగే సమయంలో నగరానికి వచ్చే ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై పోలీసు అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం తరలించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర సర్వీసులు విద్యాధరపురం వద్ద తాత్కాలిక బస్సు స్టేషన్ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి మినీ బస్సుద్వారా రవాణా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. చెన్నై-హైదరాబాద్ ట్రాఫిక్‌ను అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జేసీ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ సలోని, ఎన్‌హెచ్. ఇంజినీర్, ఆర్.గోపాలకృష్ణ, ఆర్.అండ్.బి. ఇ.ఎన్.సి. గంగాధర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ పాల్గొన్నారు.