పుష్కరాలకు 106 స్నానఘట్టాలు
- పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి
ఏలూరు : జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 106 స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. స్నానఘట్టాల వద్దే దుస్తులు మార్చుకునే గదులను కూడా ఏర్పాటు చేయూలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు.
జిల్లాలో పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వస్తారన్నారు. వారి రాకను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్నానఘట్టాల ఆధునికీకరణతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో భక్తుల కోసం వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా షవర్ బాత్ ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు.
పుష్కరాల సందర్భంగా ఎప్పటికప్పుడే చెత్తను తొలగించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల న్నారు. జిల్లాలో మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించాలన్నారు. ఇందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయో ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఒక ప్రణాళికను సమర్పించాలని డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డిని ఆదేశించారు.
డైనమిక్ కలెక్టర్ భాస్కర్
కలెక్టరు కాటంనేని భాస్కర్ ఎంతో డైనమిక్‌గా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన కలెక్టర్ సమక్షంలో గోదావరి పుష్కరాలకు పటిష్టమైన ఏర్పాట్లు జరగడం ప్రజల అదృష్టమని జవహ ర్‌రెడ్డి అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నిరంతరం అవసరమైన ప్రతి పాదనలను సమర్పిస్తూ జిల్లాలో భక్తుల కోసం పటిష్టమైన చర్యలు చేపట్టడంలో భాస్కర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పారు.
కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 2వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండూ చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందుకు రూ.8 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం రూ. 2.59 కోట్లు నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో పుష్కరాల పనులు ఏ మేరకు జరుగుతున్నాయో ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేంలో జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు పాల్గొన్నారు.