ప్రైవేటు అప్పు బాధ్యత సర్కార్‌దికాదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతులు తీసుకునే ప్రైవేటు అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిం చడం అసాధ్యమని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. రైతులు, కౌలుదారులు అప్పుల ఊబి నుంచిబయటపడాలంటే వ్యవసాయ విధానంలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో బుధవారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కరువు మండలాలు తగ్గడంపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపై ఆమె ఏమన్నారంటే..
నెలకు రూ. 2,500 పెన్షన్
సన్నకారు రైతు కంటే కౌలు రైతు రెండింతలు నష్టపోతున్నాడు. ఈ విధానంలో విప్లవాత్మకరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి తరపున నేను నవంబర్ ఒకటి నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున పెన్షన్‌ను అందజేస్తా.
కేంద్రంతో బాగానే ఉన్నాం కానీ...
కేంద్రంతో రాష్ర్ట ప్రభుత్వ సంబంధాలు బాగా నే ఉన్నాయి. కానీ, రాజకీయ లబ్ధి కోసం కేం ద్రంలోని కొందరు పెద్దలు కరువుపై తమకు తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపలేదని, ఇతరత్రా సాయం కోరలేదంటూ దుష్ర్పచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ, బీజేపీ నేతలు ఆ విధం గా వ్యవహరిస్తున్నారు. ై మూడేళ్ల గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈసారి తక్కువ మండలాలు కరువు జాబితాలో చేరాయి. వచ్చే ఏడాది కరువు మండలాల సంఖ్య పెరిగే అవకాశముంది.
ఆశ వర్కర్లకు చేయగలిగిందేమీ లేదు
ఎక్కడికి వెళ్లినా ఆశ వర్కర్లు తమ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఆశ వర్కర్లు జీతం రూ.2,500 మించలేదు. దీనిపై కేంద్రం స్పం దించడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న ఎన్ఆర్హెచ్ఎం పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. స్పష్టత లేకుండా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎంత ఇవ్వగలుగుతుందో ఎట్లా చెప్పగలం? తొందరపడి కమిట్మెంట్ ఇస్తే ఇబ్బంది ఎదురవుతుంది.
‘సన్నబియ్యం’పై ఆరా తీస్తున్నాం..
ఆరు నూరైనా హాస్టల్ విద్యార్థులందరికీ సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలన్నది సీఎం కేసీఆర్ అభిమతం. ఈ విషయంపై విపక్షాల ఆరోపణల్లో నిజానిజాలపై ఆరా తీస్తున్నాం. సన్నబియ్యం శాంపిల్స్‌ను సేకరిస్తున్నా. ఏమాత్రం తేడాలున్నా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.