Private equity companies
-
భారత కంపెనీల్లో తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు (పీఈ, వీసీ) ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో 23 శాతం మేర తగ్గి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) 27.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలోని పెట్టుబడులు 20.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడులు 35.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను పరిశ్రమ మండలి అయిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఏవీసీఏ), కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడుల లావాదేవీలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు సంఖ్యా పరంగా 44 శాతం తగ్గాయి. మొత్తం 427 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంమీద పీఈ, వీసీ పెట్టుబడుల ధోరణి సానుకూలంగానే ఉందని, ముఖ్యంగా స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. పీఈ, వీసీ సంస్థలు ఈ ఏడాది ఆరు నెలల్లో 10.2 బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఇది రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని ఈ నివేదిక తెలిపింది. నెలవారీగా చూస్తే పీఈ, వీసీ పెట్టుబడుల విలువ జూన్‌లో 3.1 బిలియన్ డాలర్లుగా ఉందని, మే నెలతో పోలిస్తే 9 శాతం తక్కువని పేర్కొంది. -
ఆల్‌టైమ్ రికార్డ్, గతేడాది రూ.4.95లక్షల కోట్లకు చేరిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్!
ముంబై: ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ (పీఈలు) 2021లో పెద్ద ఎత్తున స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశాయి. 35 బిలియన్ డాలర్లను (రూ.2.62లక్షల కోట్లు) కుమ్మరించాయి. ఇతర సంస్థల్లోనూ కలిపి చూస్తే 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి 66.1 బిలియన్ డాలర్లు (రూ.4.95 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. మొత్తం మీద 2021లో 2,064 లావాదేవీలు జరిగాయి. 114.9 బిలియన్ డాలర్లు (రూ.8.62 లక్షల కోట్లు) వచ్చాయి. విలువ పరంగా 2020తో పోల్చి చూస్తే 40 శాతం ఎక్కువ. పీడబ్ల్యూసీ ఇండియా ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. లావాదేవీల వివరాలు.. ► 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 66.1 బిలియన్ డాలర్లతో 1,258 లావాదేవీలు జరిగాయి. 2020లో నమోదైన లావాదేవీలతో పోలిస్తే 32 శాతం అధికం. ► 43 స్టార్టప్‌లు యూనికార్న్‌లు మారాయి. ► స్టార్టప్‌లు 1,000కు పైగా విడతల్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాయి. ► విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు (ఎంఅండ్ఏ) రెట్టింపయ్యాయి. 2020తో పోలిస్తే విలువ పరంగా 28 శాతం వృద్ధి నమోదైంది. ► టెక్నాలజీ కంపెనీలు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 823 లావాదేవీలు నమోదయ్యాయి. ► 2022లో పెట్టుబడుల జోరు కొనసాగుతుందని పీడబ్ల్యూసీ అంచనా. -
పీఈ, వీసీ ఇన్వెస్టర్లతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఆచరణాత్మక సిఫార్సులను ప్రశంసించిన ప్రధాని .. వారు లేవనెత్తిన సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. సమావేశం సందర్భంగా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు .. దేశీయంగా వ్యవస్థాపక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, భారత స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని పీఈ, వీసీ ఫండ్ల ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. భారత్‌లో పెట్టుబడుల వాతావరణం మరింత సానుకూలంగా మారిందని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి మునీష్ వర్మ చెప్పారు. దేశంలోకి పెట్టుబడులు పుష్కలంగా వస్తుండటం, ఎదుగుతున్న ఎంట్రప్రెన్యూర్లు, స్టాక్ ఎక్సే్చంజీల్లో కంపెనీలు పెద్ద సంఖ్యలో లిస్టవుతుండటం తదితర అంశాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు ఇటువంటి సమావేశాలు స్ఫూర్తినిస్తాయని జనరల్ అట్లాంటిక్ ప్రతినిధి సందీప్ నాయక్ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వచ్చే పదేళ్లలో 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన వివరించారు. అంకుర సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ మోదీని ’స్టార్టప్ ప్రధానమంత్రి’ అంటూ 3వన్4 ప్రతినిధి సిద్ధార్థ్ పాయ్ అభివర్ణించారు. -
గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!
ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి గ్లోబల్ పీఈ సంస్థలు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీఐ, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియాను కొనుగోలు చేసేందుకు పీఈ దిగ్గజాలు ప్రాథమిక ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పీఈ దిగ్గజాలూ నాన్‌బైండింగ్ బిడ్స్‌ను దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీలో మెజారిటీ వాటా విక్రయం కోసం గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలు చూద్దాం.. షేరు జూమ్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా కౌంటర్‌కు తాజాగా డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.4 శాతం దూసుకెళ్లి రూ. 395ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 375 వద్ద ట్రేడవుతోంది. కాగా.. పారాసెట్మల్ ఔషధ తయారీలో ప్రపంచస్థాయి కంపెనీగా గ్రాన్యూల్స్ నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది క్యూ1లో కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు మెట్ఫార్మిన్, పారాసెట్మల్, ఇబుప్రోఫిన్ వంటి ఔషధాలకు ఏర్పడిన డిమాండ్ కారణమైనట్లు పేర్కొన్నారు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 42.13 శాతం వాటాను కలిగి ఉన్నారు. గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ దిగ్గజాల మధ్య పోటీ నెలకొనే వీలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే గ్రాన్యూల్స్ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై స్పందిస్తూ.. మార్కెట్ అంచనాలపై మాట్లాడబోమన్నారు. అవసరమైనప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారాన్ని అందించగలమని స్పష్టం చేశారు. పీఈ హవా ముంబై ఫార్మా కంపెనీ జేబీ కెమికల్స్‌లో 54 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు 2020 జులైలో పీఈ దిగ్గజం కేకేఆర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 3,100 కోట్లను వెచ్చించనుంది. ఐపీవో యోచనను వాయిదా వేసిన పుణే కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాలో గతంలోనే బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క దేశీయంగా రియల్టీ రంగంలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ పలు వాణిజ్య ప్రాజెక్టులను కలిగి ఉంది. వెరసి పీఈ కంపెనీలు దేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
యాక్ట్‌లో ఐవీఎఫ్‌ఏ, టీఏ అసోసియేట్స్ పెట్టుబడులు
నెల్లూరు(సెంట్రల్) : అట్రియా కన్వర్టెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్) విలువను ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఐవీఎఫ్‌ఏ, టీఏ అసోసియేట్స్ రూ.3000 కోట్లుగా లెక్కగట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో 7 లక్షల కంటే అధిక వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తూ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించడంలో ఏసీటీ(యాక్ట్) మార్గదర్శిగా ఉందని ఐవీఎఫ్ఏకు చెందిన ప్రమోద్కాబ్రా అన్నారు. యాక్ట్ పెట్టుబడుల విషయమై బెంగళూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ. 3,000 కోట్ల విలువ ప్రకారం తాము ఆ సంస్థలో పెట్టుబడి చేసినట్లు వెల్లడించారు. యాక్ట్ సీఈఓ బాలా మల్లాడి మాట్లాడుతూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వృద్ధిపథంలో కొనసాగుతామన్నారు. తమ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలలో 500పై చిలుకు ఎస్డీ, హెచ్డీ చానల్స్, డీఏఎస్ ప్రాంతాల్లో అత్యాధునిక సేవలు అందిస్తున్నామన్నారు. యాక్ట్ గ్రూపు ఎండీ సుందరరాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సంస్థ టీఏ అసోసియేట్స్ చెప్పుకోదగిన చిన్న వాటాని యాక్ట్ సంస్థలో కొనుగోలు చేయడం ద్వారా రూ.1200 కోట్ల పెట్టుబడిని ప్రకటించిందని పేర్కొన్నారు.