ప్రైవేటు సర్వేయర్లతో భూముల సర్వే
- భూసేకరణ వేగవంతానికి
- ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవం తం చేసేందుకు ప్రైవేటు సర్వేయర్ల సేవలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ పరిధిలో సర్వేయర్ల కొరత కారణంగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి సింది. ప్రాజెక్టుల పరిధిలో పనులు నిర్వర్తిస్తు న్న ఏజెన్సీలు ప్రైవేటుగా చేయించిన సర్వే నివేదికను అధికారులు నిర్ధారించుకున్నాకే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.
సత్వర నిర్మాణానికి బాటలు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో భూసేకరణ, పునరావాసానికి తొలి ప్రాధాన్యమిచ్చి, సత్వ రం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీవో 123ను తీసుకొచ్చి భూ కొనుగోలుకు అంకురార్పణ చేసింది. రాష్ట్రంలో భూసేకరణ అవసరమైన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా.. ఇప్పటివరకు 7 ప్రాజెక్టుల కు మాత్రమే భూసేకరణ పూర్తయింది. మొత్తం 36 ప్రాజెక్టులను కలిపి 3,15,323.51 ఎకరాల భూమి కావాలని గుర్తించగా... ఇప్పటివరకు 2,21,358.37 ఎకరాల సేకరణ పూర్తి చేశారు. మరో 1,44,686.66 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిని వేగవంతం చేసేం దుకు ప్రతి 50వేల ఎకరాల సేకరణకు స్పెషల్ కలెక్టర్, 10వేల ఎకరాలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను పలుచోట్ల నియమించింది.
కానీ సర్వేయర్ల కొరతతో గత మూడు నెలల్లో 7 వేల ఎకరాల భూసేకరణే జరిగింది. దీనిపై ప్రభుత్వం రెండ్రోజుల కిందట అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహిం చింది. అధికారులంతా సర్వేయర్ల కొరతని చెప్పిన మీదట ప్రైవేటు సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలో నైపుణ్యమున్న సర్వేయర్లను వినియోగించుకోవాలని, ఆ సర్వేకు స్పెషల్ కలెక్టర్ స్థాయి లో ఆమోదముద్ర వేయాలని సూచించింది.