అధికారుల వేధింపులతో ఆర్థిక ఇబ్బందులు
ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపణ
రాజమండ్రి, న్యూస్‌లైన్ : అధికారుల వేధింపుల కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధాపడి జీవిస్తున్న 20వేల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట రమణ (గెడ్డం రమణ) మాట్లాడుతూ, పాలెం సంఘటన తర్వాత ప్రైవేటు బస్సుల డ్రైవర్లను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
యాజమాన్యాలు చేసిన తప్పులకు డ్రైవర్లను ఇరికించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ వచ్చేదని, ఇప్పుడైతే మూడు నెలల వరకూ బెయిలు ఇవ్వడం లేదన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందిస్తున్నారని, అలాకాకుండా మొదటినుంచీ ఒకేలా వ్యవహరిస్తే యాజమాన్యాలు, వర్కర్లు దానికనుగుణంగా నడుచుకునేవారన్నారు. అధికారుల వేధింపులకు నిరసనగా ఆర్డీవో, ఆర్టీఏ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. పాలెం బస్సు దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.