సర్కారీ వైద్యానికి కార్పొ‘రేట్’ సూది!
పట్టణ ఆరోగ్యం ప్రైవేట్‌కు
♦ 193 ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహణకు టెండర్లు
♦ వైద్య సేవల నుంచి సర్కారు తప్పించుకునే ఎత్తుగడ
♦ అత్యాధునిక సేవల పేరుతో ప్రైవేట్‌కు ఏటా రూ.కోట్లలో చెల్లింపు
♦ ఆ డబ్బుతో సర్కారీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేరా?.. యంత్రాలు, పరికరాలు కొనలేరా?
♦ సర్కారు చర్యలపై కోర్టును ఆశ్రయించిన ఎన్జీవోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ఒకటొకటిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సర్కారు సిద్ధమైంది. గతంలో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించిన సర్కారు ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, ఇతర సేవలకు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది.
తాజాగా రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచింది. ఇప్పటివరకూ వివిధ ప్రభుత్వేతర సంస్థలు(ఎన్జీవో) నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను ఇకపై ఇ-యూపీహెచ్సీ (ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్) పేరిట ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇందుకోసం ఏడాదికి రూ.81 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది వైద్య సేవలనుంచి సర్కారు తప్పించుకునే ప్రయత్నాల్లో భాగమేనన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రైవేటు సంస్థలకిస్తున్న రూ.81 కోట్లతో రాష్ట్రంలోని 1072 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 32 ఏరియా ఆస్పత్రులు, ఎనిమిది జిల్లా ఆస్పత్రులు, 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు దీర్ఘకాలం సేవలు అందిస్తాయని సూచిస్తున్నారు. అయితే ఈ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పజెబితే అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. పట్టణాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు మురికివాడల్లోని పేద ప్రజలు వస్తారని, వారికి వైఫై, ఇంటర్నెట్... తదితర సేవలు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మూడు జోన్లుగా విభజించి...
రాష్ట్రంలోని 193 పట్టణ ఆరోగ్య కేంద్రాలను వివిధ ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పది కేంద్రాలను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం మొదట టెండర్లు పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం నేరుగా సీఎంతో మంతనాలు జరిపింది. ఫలితంగా ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దుచేసి మొత్తం 193 పట్టణ ఆరోగ్య కేంద్రాల అప్పగింతకు రెండు నెలల కిందట టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌కు ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. జోన్-1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి.
జోన్-2లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, జోన్-3లో నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలున్నాయి. ప్రస్తుతం ఎన్జీవోలకు ఒక్కో యూపీహెచ్సీకి నెలకు రూ.1.40 లక్షల వరకూ ఇస్తుండగా, ప్రైవేటు సంస్థలు వేసిన ఎల్1 రేట్ల ప్రకారం రూ.3.5 లక్షల వరకూ ఉంటుందని అధికారుల అంచనా.
ఈ లెక్కన ఏడాదికి నిర్వహణ పేరిట రూ.81 కోట్లను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించనుంది. ఆర్థిక బిడ్లు కూడా ఓపెన్ చేశామని, టెండరు దక్కించుకున్న సంస్థల వివరాలు వెల్లడిస్తామని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ చెప్పారు. అయితే రాష్ట్రంలోని మొత్తం 193 పట్టణ ఆరోగ్య కేంద్రాలనూ ఒక ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వివిధ మార్గదర్శకాలను రూపొందించిందనే అభిప్రాయాలు వైద్యవర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. గతంలో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కూడా ఇదే విధంగా 33 సంవత్సరాలు అపోలో యాజమాన్యానికి లీజుకు ఇచ్చి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సహకరించడంద్వారా దాదాపు రూ.300 కోట్లు లబ్ధి చేకూర్చారని వారు గుర్తుచేస్తున్నారు.
ప్రైవేటుకు దోచిపెట్టే యత్నాలే...
ఆధునిక సేవల పేరిట ఆర్బన్ హెల్త్ సెంటర్లను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఎన్జీవోలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. సెంటర్లకు ప్రభుత్వమే నిర్వహించాలని లేదా తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. టెలీ మెడిసిన్ పేరిట పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే యత్నాలను వైద్య నిపుణులు సైతం విమర్శిస్తున్నారు. ఏజెన్సీలు లేదా మారుమూల ప్రాంతాల్లో టెలీ మెడిసిన్ అవసరం ఉంటుందే తప్ప అర్బన్ ప్రాంతాల్లో దాని అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దఫదఫలుగా వైద్య సేవలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే రక్తపరీక్షల నుంచి వైద్య పరికరాల నిర్వహణ వరకూ పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పింది. అందుకోసం ఆయా సంస్థలకు కోట్లది రూపాయలు కట్టబెడుతోంది. ఆ సంస్థలు లాభాపేక్షతోనే పనిచేస్తున్నాయే తప్ప రోగులకు సేవలందించడంలో శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలున్నాయి. అదే మొత్తాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ లాంటి యంత్రాలకు వెచ్చిస్తే శాశ్వతంగా ఉంటాయి. పది కాలాలపాటు ప్రజలకు సేవలందిస్తాయి.
ప్రైవేటు సంస్థలకు ఇచ్చే డబ్బుతో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టులను నియమిస్తే ప్రజలకు విస్తృతంగా మెరుగైన వైద్య సేవలందుతాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైన మేరకు నిధులివ్వకుండా, నిపుణులను నియమించకుండా, ఆధునిక పరికరాలను సమకూర్చకుండా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, వాటిపై ప్రజలకు వ్యతిరేకత వచ్చేలా చేసి, ఆ తర్వాత ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పాలన్న ప్రభుత్వ పెద్దల వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు.