Priya Pillai
-
ఎలా ఎగిరిపోనిచ్చారు?
మాల్యా పరారీపై రాజకీయ దుమారం * మోదీ ప్రభుత్వం దాటించిందన్న రాహుల్ * బ్యాంకులు ఆలస్యం చేశాయన్న జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన కేసు విచారణ మధ్యలో ఉండగానే లిక్కర్ రారాజు విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గురువారం అటు పార్లమెంటులోపలా, బయటా అధికార, విపక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. మాల్యా దేశం నుంచి పారిపోవడానికి ప్రభుత్వం సహాయం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడగా, బోఫోర్స్‌కేసులో ఖత్రోచీని కాంగ్రెస్ సర్కారు దేశం దాటించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. మాల్యా ఈనెల 2న పారిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. మాల్యా దేశం వదిలి పారిపోవడంలో ఎన్డీఏ ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ప్రభుత్వం ఆయనకెలాంటి సాయం చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ బదులిచ్చారు. పార్లమెంటు బయట రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, మాల్యాలాంటి వారిని దేశం దాటేలా చేసి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ‘తిండి లేక ఆకలితో రొట్టె దొంగిలించిన పేదవాడిని జైల్లో పెడతారు.. దేశంలో రూ.9వేల కోట్లు దొంగిలించిన వ్యాపారవేత్తను మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా దేశం దాటిస్తారు’ అంటూ ధ్వజమెత్తారు. జైట్లీ మీడియాతో మా ట్లాడుతూ, మాల్యా విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో బ్యాంకులు జాప్యం చేశాయని, త్వరగా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. మాల్యా దేశం నుంచి వెళ్లడానికి, ఖత్రోచీ భారత్ వదిలి పోవడానికి తేడా ఉందన్నారు. బోఫోర్స్ లబ్ధిదారుల్లో ఖత్రోచీ ఉన్నారని స్విట్జర్లాండ్ అధికారులు చెప్పిన తర్వాత సీబీఐ విచారణాధికారి ఖత్రోచీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని లేఖ రాసిన రెండు రోజుల్లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖత్రోచీని దేశం దాటించిందన్నారు. కాగా, మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ తమకెలాంటి సమాచారం అందలేదని విదేశాంగ శాఖ చెప్పింది. లండన్‌లో విజయ్ మాల్యా లండన్: విజయ్ మాల్యా బ్రిటన్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర లండన్‌లోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలోని తన బంగళా నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్నట్లు సమాచారం. మాల్యా గతవారం హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని సెయింట్ అల్బన్స్ సమీపంలోని టెవిన్ గ్రామంలోని తన ‘లేడీవాక్’ ఎస్టేట్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. టెవిన్‌లో ఉన్నప్పుడు పబ్‌లకు వెళ్లే మాల్యా.. ఇప్పుడు మాత్రం బయట కనిపించలేదని అంటున్నారు. -
విజయ్ మాల్యా ఎలా పారిపోయారు?
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం, ఆదివాసీల అటవీ హక్కుల కోసం పోరాడుతున్న గ్రీన్ పీస్ కార్యకర్త ప్రియా పిళ్లైని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. మధ్యప్రదేశ్‌లోని మహాన్ కోల్ బ్లాక్‌కు వ్యతిరేకంగా అటవి సంపద సంరక్షణ కోసం పోరాడుతూ, అందులో భాగంగా లండన్ బయల్దేరిన పిళ్లైని 2015, జనవరి 11న అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపేశారు. లండన్‌లో ఆమె ప్రచారం కారణంగా దేశం పరువు పోతుందని భావించిన మోదీ ప్రభుత్వం ఆమెను ‘నో ఫారిన్ ట్రావెల్’ కేటగిరీలో కూడా చేర్చారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఆమెను ఆ జాబితా నుంచి తొలగించారు. దేశ ప్రయోజనాల కోసం, ఆదివాసీల సంక్షేమం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్న ప్రియా పిళ్లైని విమానాశ్రయంలో అడ్డుకున్న మోదీ ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోతున్న లింకర్ కింగ్ విజయ్ మాల్యాను మాత్రం సాదరంగా లండన్ వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ఇది ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం కాదా ? విజయ్ మాల్యా అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు బకాయిపడ్డ విషయం తెల్సిందే. ఆయన ఎక్కువగా రుణాలు తీసుకున్నది వివిధ ప్రభుత్వ బ్యాకుల నుంచే. అదంతా పేద ప్రజలు, టాక్స్ పేయర్స్ దాచుకున్న సొమ్మే అనడంలో అతిశయోక్తి లేదు. విజయ్ మాల్యాపై సిబీఐ ‘లుకౌట్’ నోటీసు ఉన్నా అధికారుల కళ్లుగప్పి ఆయన విదేశానికి ఎలా చెక్కేస్తారు. దేశ, ప్రజల ప్రయోజనాలు పట్టని కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే మాల్యా తప్పించుకుపోయాడంటారా? ‘సమ్‌థింగ్ రాంగ్ విత్ ది మోదీ గవర్నమెంట్’. విజయ్ మాల్యా పారిపోయాక కూడా ఆయన్ని పట్టుకునేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు? పైగా ఆయన ఏ దేశం వెళ్లారో కూడా తెలియదని కేంద్రం బుకాయిస్తోంది. తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదుగదా! ఇలా దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే వారు సాధారణంగా ఇంగ్లండ్ వెళతారన్నది అందరికి తెల్సిన విషయమే. అక్కడి చట్టాల ప్రకారం ఇలాంటి వారికి అక్కడ సులభంగా శరణు దొరుకుతుంది. అక్కడ కొత్త జీవితం ప్రారంభించవచ్చు. -
ప్రియా పిళ్లై లుకౌట్ నోటీసును రద్దు చేయండి
న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హై కోర్టు మండిపడింది. ఆమెకు జారీ చేసిన ‘లుకౌట్ నోటీసు’ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతు నొక్కలేరని....అభివృద్ధి విధానాలపై భిన్నాభిప్రాయాలువ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళ్లై లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. గత జనవరి 1l న లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళ్లైను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. -
అప్రజాస్వామికం
ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయం ఇంకా సర్దుకున్నట్టులేదని ఢిల్లీ విమానాశ్రయంలో స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు వెల్లడిస్తున్నది. ఆదివారం ఉదయం లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళై్లను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపారు. ఆమెను కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకే ఆపవలసివచ్చిందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు చెబుతుంటే...హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. తీవ్ర నేరాలు చేసి, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరిగే వ్యక్తులు దేశం విడిచివెళ్లకుండా చూడటం భద్రతాసంస్థలు చేయాల్సిన పని. ప్రియా పిళై్ల కూడా ఆ తరహా వ్యక్తే అయితే అలాంటి చర్య తీసుకోవడంలో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. కానీ, గ్రీన్‌పీస్ సంస్థకుగానీ, వ్యక్తిగతంగా ప్రియాపిళై్లకుగానీ ఇలాంటి చరిత్ర లేదు. ఆ సంస్థ గత కొన్నేళ్లుగా దేశంలో పర్యావరణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. అడవులు నరికేయడం, కొండలను పిండిచేయడం, గనులను తొలిచేయటం, నదీజలాల్లోకి ప్రమాదకరమైన వ్యర్థాలనూ, రసాయనాలను వదలటం, అణు విద్యుత్ ప్రాజెక్టులను అనుమతించటంవంటివి భూతాపోన్నతికి కారణమవుతాయని... ఇలాంటి చర్యలవల్ల ప్రమాదకరమైన పర్యవసానాలు ఏర్పడతాయని ఆ సంస్థ వాదిస్తున్నది. అభివృద్ధి పేరుచెప్పి, ఉపాధి అవకాశాల సాకు చూపి ఫ్యాక్టరీలకు చిత్తం వచ్చినట్టు అనుమతులు మంజూరుచేయడం సరికాదంటున్నది. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళై్ల లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. ఎస్సార్ బ్రిటన్‌కు చెందిన సంస్థ గనుక దాన్ని గురించి అక్కడివారికి చెప్పడం అవసరమని ఆమె అంటున్నారు. బొగ్గు క్షేత్రాలు కేటాయించిన ప్రాంతంలో అడవులున్నాయని, ఈ అడవులపై ఆ చుట్టుపక్కల ఉన్న 54 గ్రామాల ఆదివాసీలు ఆధారపడి ఉన్నారని గ్రీన్‌పీస్ చెబుతున్నది. ప్రాజెక్టుకిచ్చిన అనుమతులన్నీ తప్పుడు పత్రాల ఆధారంగా ఇచ్చినవని సంస్థ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామసభ నిర్వహించి, గ్రామస్తుల సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదుచేసింది. ఆఖరికి చనిపోయినవారి సంతకాలు కూడా గ్రామ సభ తీర్మానంలో ఉన్నాయని ఎత్తిచూపింది. నిజానికి ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఆదివాసీలకు మద్దతుగా నిలబడాలి. వారికి అన్యాయం జరగకుండా కృషిచేయాలి. ఏ రాజకీయ పక్షమూ అలాంటి పనిచేసిన దాఖలా లేదు. మహాన్ బొగ్గు గనుల వ్యవహారంలో గ్రీన్‌పీస్ చేస్తున్న వాదన సరైనదేనని యూపీఏ ప్రభుత్వంలోని గిరిజనాభివృద్ధి మంత్రి కిషోర్‌చంద్ర దేవ్ అప్పట్లో అంగీకరించారు. పర్యావరణానికి హాని కలిగిస్తూ, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్సార్, హిండాల్కో సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ విషయంలో ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేకపోగా ఒక ధర్నాలో పాల్గొన్న కేసులో నిందితురాలుగా ఉన్నందుకు ప్రియా పిళై్లపై ఆంక్షలు విధించే పనికి పూనుకున్నారు. నిజానికి గ్రీన్‌పీస్ వంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు లేనట్టయితే ఆదివాసీల గొంతు ఇంత బిగ్గరగా వినబడేది కాదు. గ్రీన్‌పీస్, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాల ప్రోద్బలంతో, వారిచ్చే విరాళాల సాయంతో దేశంలో సాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆమధ్య ఐబీ నివేదిక తెలిపింది. ఇలాంటి సంస్థల వైఖరివల్ల మన జీడీపీ 2 నుంచి 3 శాతం తగ్గే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించింది. వీటి కట్టడికి చర్యలు తీసుకోనిదే ప్రాజెక్టుల పని ముందుకు సాగదని వివరించింది. పర్యావరణం, భూతాపోన్నతి, అభివృద్ధి వంటి అంశాలు సవివరంగా, పారదర్శకంగా చర్చించవలసినవి. వీటిపై పరస్పర విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. ఏదో ఒక పక్షం వాదనే సరైనదని నమ్మనవసరం లేదు. ఆయా రంగాల్లో నిపుణులైనవారు ప్రామాణికమైన, హేతుబద్ధమైన వాదనలతో అవతలిపక్షం చేస్తున్న వాదనలో పసలేదని చెప్పడంలో తప్పులేదు. అలాగే ప్రభుత్వాలు తీసుకునే చర్యల కారణంగా జీవికను కోల్పోతున్నవారికి, నిరాశ్రయులవుతున్నవారికి ఇప్పుడు చూపుతున్న ప్రత్యామ్నాయాలేమిటో...అందులోని లోపాలేమిటో చెప్పడానికి పర్యావరణ ఉద్యమకారులకు హక్కుంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండానే సుస్థిర అభివృద్ధి ఎలా సాధ్యమో కూడా వారిని చెప్పమనవచ్చు. అయితే, ఇలాంటి మంచి వాతావరణం కల్పించడానికి బదులు ప్రశ్నించినవారిని భయపెట్టడం, వారిపై ఆంక్షలు విధించాలని చూడటం అప్రజాస్వామికమవుతుంది. బ్రిటన్‌కు చెందిన సంస్థ మన దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆ దేశానికి చెందిన ఎంపీలకు వివరించడం, వారి జోక్యాన్ని కోరడం మన కేంద్ర ప్రభుత్వానికి లేదా మన దేశ ప్రయోజనాలకు ఎలా విరుద్ధమవుతుందో ఊహకందని విషయం. ఇలా ప్రవర్తించడం మన అధికారులకు ఇది తొలిసారేమీ కాదు. నిరుడు సెప్టెంబర్‌లో మన దేశానికి వచ్చిన గ్రీన్‌పీస్ సంస్థకు చెందిన బ్రిటన్ ఉద్యమకారిణి బెన్ హర్‌గ్రీవ్స్‌ను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపారు. హైదరాబాద్‌లో నిరుడు జూన్‌లో వృద్ధాప్యంపై నిర్వహించిన ప్రపంచ సదస్సుకొస్తున్న మరో బ్రిటిష్ జాతీయురాలు పెన్నీ వెరా సాన్సోను కారణం చూపకుండానే తిప్పిపంపారు. ఇలాంటి చర్యలు మన అపరిపక్వతను పట్టిచూపుతాయి. పాలకులకు రాజ్యాంగ విలువలపట్ల విశ్వాసంలేదన్న సంగతిని వెల్లడిస్తాయి. తమ నిర్ణయాల కారణంగా పౌరులు ఇబ్బందిపడుతున్నారని తెలిసినప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కృషిచే యడం ప్రభుత్వాల కర్తవ్యం. అందుకు బదులు ఉద్యమిస్తున్నవారిని నేరస్తులుగా చూడటం, వారి ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించడం తగని పని.