అప్రజాస్వామికం | Greenpeace India campaigner prevented from travelling to the UK | Sakshi
Sakshi News home page

అప్రజాస్వామికం

Published Wed, Jan 14 2015 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

Greenpeace India campaigner prevented from travelling to the UK

ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయం ఇంకా సర్దుకున్నట్టులేదని ఢిల్లీ విమానాశ్రయంలో స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు వెల్లడిస్తున్నది. ఆదివారం ఉదయం లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళై్లను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపారు. ఆమెను కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకే ఆపవలసివచ్చిందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు చెబుతుంటే...హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు.

తీవ్ర నేరాలు చేసి, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరిగే వ్యక్తులు దేశం విడిచివెళ్లకుండా చూడటం భద్రతాసంస్థలు చేయాల్సిన పని. ప్రియా పిళై్ల కూడా ఆ తరహా వ్యక్తే అయితే అలాంటి చర్య తీసుకోవడంలో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. కానీ, గ్రీన్‌పీస్ సంస్థకుగానీ, వ్యక్తిగతంగా ప్రియాపిళై్లకుగానీ ఇలాంటి చరిత్ర లేదు. ఆ సంస్థ గత కొన్నేళ్లుగా దేశంలో పర్యావరణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. అడవులు నరికేయడం, కొండలను పిండిచేయడం, గనులను తొలిచేయటం, నదీజలాల్లోకి ప్రమాదకరమైన వ్యర్థాలనూ, రసాయనాలను వదలటం, అణు విద్యుత్ ప్రాజెక్టులను అనుమతించటంవంటివి భూతాపోన్నతికి కారణమవుతాయని... ఇలాంటి చర్యలవల్ల ప్రమాదకరమైన పర్యవసానాలు ఏర్పడతాయని ఆ సంస్థ వాదిస్తున్నది.

అభివృద్ధి పేరుచెప్పి, ఉపాధి అవకాశాల సాకు చూపి ఫ్యాక్టరీలకు చిత్తం వచ్చినట్టు అనుమతులు మంజూరుచేయడం సరికాదంటున్నది. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్‌ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళై్ల లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. ఎస్సార్ బ్రిటన్‌కు చెందిన సంస్థ గనుక దాన్ని గురించి అక్కడివారికి చెప్పడం అవసరమని ఆమె అంటున్నారు.

బొగ్గు క్షేత్రాలు కేటాయించిన ప్రాంతంలో అడవులున్నాయని, ఈ అడవులపై ఆ చుట్టుపక్కల ఉన్న 54 గ్రామాల ఆదివాసీలు ఆధారపడి ఉన్నారని గ్రీన్‌పీస్ చెబుతున్నది. ప్రాజెక్టుకిచ్చిన అనుమతులన్నీ తప్పుడు పత్రాల ఆధారంగా ఇచ్చినవని సంస్థ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామసభ నిర్వహించి, గ్రామస్తుల సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదుచేసింది. ఆఖరికి చనిపోయినవారి సంతకాలు కూడా గ్రామ సభ తీర్మానంలో ఉన్నాయని ఎత్తిచూపింది. నిజానికి ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఆదివాసీలకు మద్దతుగా నిలబడాలి. వారికి అన్యాయం జరగకుండా కృషిచేయాలి. ఏ రాజకీయ పక్షమూ అలాంటి పనిచేసిన దాఖలా లేదు.

మహాన్ బొగ్గు గనుల వ్యవహారంలో గ్రీన్‌పీస్ చేస్తున్న వాదన సరైనదేనని యూపీఏ ప్రభుత్వంలోని గిరిజనాభివృద్ధి మంత్రి కిషోర్‌చంద్ర దేవ్ అప్పట్లో అంగీకరించారు. పర్యావరణానికి హాని కలిగిస్తూ, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్సార్, హిండాల్కో సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ విషయంలో ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేకపోగా ఒక ధర్నాలో పాల్గొన్న కేసులో నిందితురాలుగా ఉన్నందుకు ప్రియా పిళై్లపై ఆంక్షలు విధించే పనికి పూనుకున్నారు. నిజానికి గ్రీన్‌పీస్ వంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు లేనట్టయితే ఆదివాసీల గొంతు ఇంత బిగ్గరగా వినబడేది కాదు.   

గ్రీన్‌పీస్, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాల ప్రోద్బలంతో, వారిచ్చే విరాళాల సాయంతో దేశంలో సాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆమధ్య ఐబీ నివేదిక తెలిపింది. ఇలాంటి సంస్థల వైఖరివల్ల మన జీడీపీ 2 నుంచి 3 శాతం తగ్గే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించింది. వీటి కట్టడికి చర్యలు తీసుకోనిదే ప్రాజెక్టుల పని ముందుకు సాగదని వివరించింది. పర్యావరణం, భూతాపోన్నతి, అభివృద్ధి వంటి అంశాలు సవివరంగా, పారదర్శకంగా చర్చించవలసినవి. వీటిపై పరస్పర విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. ఏదో ఒక పక్షం వాదనే సరైనదని నమ్మనవసరం లేదు.

ఆయా రంగాల్లో నిపుణులైనవారు ప్రామాణికమైన, హేతుబద్ధమైన వాదనలతో అవతలిపక్షం చేస్తున్న వాదనలో పసలేదని చెప్పడంలో తప్పులేదు. అలాగే ప్రభుత్వాలు తీసుకునే చర్యల కారణంగా జీవికను కోల్పోతున్నవారికి, నిరాశ్రయులవుతున్నవారికి ఇప్పుడు చూపుతున్న ప్రత్యామ్నాయాలేమిటో...అందులోని లోపాలేమిటో చెప్పడానికి పర్యావరణ ఉద్యమకారులకు హక్కుంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండానే సుస్థిర అభివృద్ధి ఎలా సాధ్యమో కూడా వారిని చెప్పమనవచ్చు. అయితే, ఇలాంటి మంచి వాతావరణం కల్పించడానికి బదులు ప్రశ్నించినవారిని భయపెట్టడం, వారిపై ఆంక్షలు విధించాలని చూడటం అప్రజాస్వామికమవుతుంది.  

బ్రిటన్‌కు చెందిన సంస్థ మన దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆ దేశానికి చెందిన ఎంపీలకు వివరించడం, వారి జోక్యాన్ని కోరడం మన కేంద్ర ప్రభుత్వానికి లేదా మన దేశ ప్రయోజనాలకు ఎలా విరుద్ధమవుతుందో ఊహకందని విషయం. ఇలా ప్రవర్తించడం మన అధికారులకు ఇది తొలిసారేమీ కాదు. నిరుడు సెప్టెంబర్‌లో మన దేశానికి వచ్చిన గ్రీన్‌పీస్ సంస్థకు చెందిన బ్రిటన్ ఉద్యమకారిణి బెన్ హర్‌గ్రీవ్స్‌ను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపారు. హైదరాబాద్‌లో నిరుడు జూన్‌లో వృద్ధాప్యంపై నిర్వహించిన ప్రపంచ సదస్సుకొస్తున్న మరో బ్రిటిష్ జాతీయురాలు పెన్నీ వెరా సాన్సోను కారణం చూపకుండానే తిప్పిపంపారు.

ఇలాంటి చర్యలు మన అపరిపక్వతను పట్టిచూపుతాయి. పాలకులకు రాజ్యాంగ విలువలపట్ల విశ్వాసంలేదన్న సంగతిని వెల్లడిస్తాయి. తమ నిర్ణయాల కారణంగా పౌరులు ఇబ్బందిపడుతున్నారని తెలిసినప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కృషిచే యడం ప్రభుత్వాల కర్తవ్యం. అందుకు బదులు ఉద్యమిస్తున్నవారిని నేరస్తులుగా చూడటం, వారి ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించడం తగని పని.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement