పాతపల్లిలో సాంఘిక బహిష్కరణ
* ఇళ్లను శ్మశానంగా మార్చారు
* అంబేద్కర్ మనవడు, ప్రొ.ఆనంద్ తేల్ తుంబ్డే
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో రెండు నెలలుగా 45 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారని, ఇళ్లను శ్మశానంగా మార్చడమే కాక మరో కారంచేడుగా మారుస్తామని హెచ్చరించారని కుల నిర్మూలన పోరాట సమితి(కేఎన్పీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డేతో కలసి పాతపల్లి గ్రామ మాదిగల సంఘీభావ కమిటీగా కేఎన్పీఎస్ ఆ గ్రామాన్ని సందర్శించింది. అక్కడి విషయాలను సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫ్రొఫెసర్ తుంబ్డే మాట్లాడుతూ అనేక పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణలో దళితులపై దాడులు జరగడం, తెలంగాణ ఆవిర్భవించిన 11 నెలలకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈ పరిస్థితులను చూస్తే తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని, ఇక్కడి పెత్తందార్లు మరో కారంచేడును చూడాలనుకుంటున్నారని విమర్శించారు. కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మయ్య మాట్లాడుతూ మే 1న పాతపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రఘురాం అనే మాదిగ యువకుడు పెళ్లి చేసుకుని, స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి సమక్షంలో దేవాలయ ప్రవేశం చేసి కొబ్బరికాయ కొట్టినందుకు మాదిగలపై అనేక దాడులు చేసి, సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. గ్రామంలో బోయలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఉన్నా.. మాదిగల గుడిసెల్లో చనిపోయిన బోయలను పాతిపెట్టి వారి నివాసాలను శ్మశానాలుగా మార్చారని దుయ్యబట్టారు.