Pro Kabaddi League -2
-
పుణేరి పల్టన్‌కు ఊరట
పుణే : వరుస పరాజయాలతో డీలా పడిన పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2 చివరి దశలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33-28 పాయింట్ల తేడాతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పుణేరి పాయింట్ల సంఖ్య 19కు పెరిగినా, లీగ్‌లో మాత్రం చివరిదైన ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. జితేశ్ జోషి ఏడు పాయింట్లు, సంజయ్ కుమార్ ఆరు పాయింట్లు సాధించి పుణేరి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ జోరు కనబరిచినా... రెండో అర్ధభాగంలో పుణేరి జట్టు పుంజుకుంది. విరామ సమయానికి ఢిల్లీ 18-11తో ఏడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో పుణేరి ఆటగాళ్లు అద్భుత రైడింగ్‌తో ఢిల్లీ జట్టును ఆలౌట్ చేశారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్స్ కాశిలింగ్, శ్రీకాంత్ రాణించినా డిఫెన్స్‌లో లోపాల కారణంగా ఆ జట్టు చివర్లో తడబడింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39-38తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి బెంగాల్ 24-14తో పది పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో జైపూర్ జట్టు పోరాడినా ఆఖరికి పాయింట్ తేడాతో ఓడిపోయింది. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-43 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ జట్టు ఏడు విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, మరో మూడింటిని ‘డ్రా’ చేసుకొని మొత్తం 45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు నిరుటి రన్నరప్ యు ముంబా తమ జోరు కొనసాగిస్తోంది. పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 32-27తో నెగ్గి ఈ సీజన్లో 11వ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో ఢిల్లీ దబంగ్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి
యు ముంబా ‘సిక్సర్’ ప్రొ కబడ్డీ లీగ్-2 జైపూర్: రెండూ అజేయ జట్లే... పోరు కూడా అదే రీతిన సాగింది.. చివరి సెకను వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు యు ముంబా జట్టు ఒక్క పాయింట్ తేడాతో గట్టెక్కింది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో ఆదివారం తెలుగు టైటాన్స్ జట్టు తన సంచలన ఆటతీరును తుది వరకు కొనసాగించినా 26-27 తేడాతో ఓడిపోయింది. యు ముంబాకు ఇది వరుసగా ఆరో విజయం కాగా టైటాన్స్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది తొలి ఓటమి. ఇరు జట్లు రెండు సార్లు ఆలౌట్ అయ్యాయి. ముంబా 14 రైడింగ్ పాయింట్లు సాధించింది. టైటాన్స్ నుంచి సుకేశ్ హెగ్డే 7 రైడింగ్ పాయింట్లు సాధించగా, స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 సార్లు రైడింగ్ వెళ్లినా ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ముంబా నుంచి కెప్టెన్ అనూప్ కుమార్ సూపర్ షోతో 10 పాయింట్లు సాధించి జట్టు ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తొలి అర్ధ భాగం వరకు 17-11తో టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టింది. చివర్లోనూ 20-14తో జోరు మీదున్నా మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ముంబా ఆటగాళ్లు మాయ చేశారు. ముఖ్యంగా అనూప్‌ను కట్టడి చేయడంలో టైటాన్స్ విఫలమైంది. దీనికి తోడు తను రెండు సార్లు రివ్యూకు వెళ్లి సఫలం కావడంతో 27-25తో ముంబా ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి అర నిమిషంలో టైటాన్స్ పాయింట్ సాధించినా ఫలితం లేకపోయింది.జైపూర్‌కు హ్యాట్రిక్ ఓటమి: పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్ 23-29తో హ్యాట్రిక్ పరాజయాన్ని ఎదుర్కొంది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్‌తో బెంగళూరు బుల్స్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ బోణీ
దబాంగ్ ఢిల్లీపై విజయం ఠ ప్రొ కబడ్డీ లీగ్-2 ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-27 తేడాతో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తరఫున మెరాజ్ షేక్ ఎనిమిది, దీపక్ నివాస్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించారు. రాహుల్ చౌదరి ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి టైటాన్స్ ఆటగాళ్ల అద్భుత రైడింగ్‌తో ఢిల్లీకి వణుకు పుట్టించారు. ప్రారంభంలోనే 6-2తో దూసుకెళ్లిన టైటాన్స్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-8 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. నాలుగుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. రైడింగ్ ద్వారానే తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు అందుకుంది. ముంబాకి రెండో గెలుపు జోరు మీదున్న యు ముంబా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 36-23 తేడాతో సునాయాసంగా నెగ్గింది. షబీర్ బాపు పది రైడింగ్ పాయింట్లు సాధించాడు. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ప్రస్తుతం 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; పాట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.