వెనక్కి తగ్గిన రజనీకాంత్
తమిళసంఘాల ఆగ్రహంతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. తాను ముందుగా తలపెట్టిన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా వారి కోరికను మన్నిస్తూ పర్యటనను రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. విడుదతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) తదిర సంఘాల నాయకులు వెళ్లి రజనీకాంత్‌ను శ్రీలంక పర్యటనకు వెళ్లొద్దని కోరారు. వాస్తవానికి శ్రీలంక రాజధాని జాఫ్నాలో జరిగే కార్యక్రమానికి ఏప్రిల్ 9వ తేదీన రజనీ వెళ్లాల్సి ఉంది.
తిరుమావలవన్, వైగో తదితరులు చెప్పిన కారణాలతో తాను విభేదిస్తున్నా, తాను మాత్రం వెళ్లడం లేదని రజనీ అన్నారు. వాస్తవానికి తాను అక్కడ తమిళులు నివసించిన ప్రాంతాలు చూసేందుకే శ్రీలంక వెళ్దామనుకున్నానని, అక్కడ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి మత్స్యకారుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నట్లు తెలిపారు. తాను రాజకీయ నాయకుడిని కానని, కేవలం ఒక నటుడినేనని రజనీ అన్నారు. గత కొన్నేళ్లుగా ఈలం సమస్య తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.