The process of land acquisition
-
భూమి కొనుగోలును వేగవంతం చేయండి
ఖమ్మం జెడ్పీసెంటర్: పేద ఎస్సీ కుటుంబాలకు భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (సంక్షేమం) ఎ.రామలక్ష్మణ్ కోరారు. భూమి కొనుగోలు పథకం ప్రగతిపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తదితర అధికారులతో ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో శుక్రవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూమి కొనుగోలు పథకం అమలు బాగుందన్నారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరముందన్నారు. ఈ భూముల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం 50కోట్ల కేటాయించనున్నట్టు చెప్పారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని పేద దళిత కుటుంబాలకు పంపిణీ చేసిన 942 ఎకరాల భూమిని రీ సర్వే చేసి, వాటి సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జించేలా సాగు పద్ధతులపై రైతులను చైతన్యపరచాలని కోరారు. ఈ పథకం ప్రగతిని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి వివరించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 ఎస్సీ కుటుంబాలకు 22 ఎకరాల భూమి పంపిణీ చేసినట్టు చెప్పారు. మరో 50 ఎకరాల భూమి పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. మరో 100 ఎకరాలకు సంబంధించిన సర్వే పూర్తయిందన్నారు. భూ యాజమానులతో మాట్లాడి ధర నిర్ణయించాల్సుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటనర్సయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి, జేడీఏ భాస్కర్‌రావు, జేడీఏహెచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. గిరిజనాభివృద్ధిపై దృష్టి పెట్టాలి భద్రాచలం: గిరిజనాభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్‌లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శుక్రవారం ఇక్కడ ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయనకు పీవో దివ్య వివరించారు. రామలక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏజెన్సీలోని గిరిజనులు ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి శాతం 65.35 ఉంటే, ట్రైబల్ సబ్ ప్లాన్ పరిధిలో మాత్రం 39.80 శాతం ఉండటంపై ఆలోచించాలన్నారు. గిరిజనుల విద్యార్థులు ఉన్నత విద్యనందుకునేలా అధికారులు అన్ని రకాలుగా అండగా నిలువాలన్నారు. ఆరోగ్య సేవలను మరింతగా విస్తరించాలన్నారు.అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హులైన గిరిజనుకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అదే సమయంలో అడవులను సంరక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఆర్డీవో ఆర్.అంజయ్య, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి, అదనపు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఏజెన్సీ డీఈవో నాంపల్లి రాజేష్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, జిల్లా మలే రియా అధికారి డాక్టర్ రాంబాబు, ఏటీవో రామారావు తదితరులు పాల్గొన్నారు. -
భూగ్రహణం
విజయవాడ : గన్నవరం విమానాశ్రయానికి ఏడేళ్ల క్రితం పట్టిన భూగ్రహణం ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడంలేదు. విమానాశ్రయ విస్తరణ కోసం గతంలో భూములు ఇస్తామని రైతులు ముందుకొచ్చినా, బడ్జెట్ లేక అధికారులు వెనకడుగు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చినా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో రైతులు తమ భూములు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో భూ సేకరణ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గతంలో అంగీకరించి.. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి అభివృద్ధి చేసేందుకు మరో 465 ఎకరాల భూమి అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ పేర్కొంది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఇచ్చినా మరో 420 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు భూసేకరణ కోసం గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో సర్వే నిర్వహించి అవసరమైన భూముల వద్ద హద్దులు నిర్ణయించింది. నిర్వాసిత రైతులను గుర్తించింది. నిర్వాసితులతో నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధర్‌బాబు పలుమార్లు చర్చలు జరిపారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం కేసరపల్లిలో ఎకరానికి రూ.75లక్షలు, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల పరిధిలో రూ.48లక్షలు, అజ్జంపూడిలో రూ.36లక్షల చొప్పున చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పడంతో తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. అప్పట్లో రైతులు చెల్లించేందుకు బడ్జెట్ లేకపోవడం, ఎన్నికలు రావడంతో భూసేకరణ నిలిచిపోయింది. రాజధాని ప్రకటన తర్వాత సీన్ రివర్స్ ప్రభుత్వం విజయవాడను రాజధానిగా ప్రకటించడంతో భూముల విలువ భారీగా పెరిగింది. తమ గ్రామాల్లో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు చేరిందని నిర్వాసితులు చెబుతున్నారు. పాత ధర ప్రకారం భూములు ఇస్తే తాము నష్టపోతామని, ప్రస్తుత మార్కెట్ రేటును చెల్లించాలని, లేదా భూమికి సమానంగా మరో ప్రాంతంలో భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఈ విధానంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు మరుగున పడిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. భూసేకరణ బాధ్యత మంత్రి ఉమాకు.. ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన భూసేకరణ బాధ్యతను జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడి ఒప్పించాలని మంత్రి ఉమా గన్నవరంలో నివాసముంటున్న టీడీపీ సీనియర్ నేత కడియాల రాఘవరావుకు చెప్పినట్లు సమాచారం. అందువల్లే కడియాల సోమవారం నిర్వాసితులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 60:40 పద్ధతిలో భూమిని ఇవ్వాలని ఆయన ప్రతి పాదించగా, రైతులు వ్యతిరేకించారు. రైతులు సహకరిస్తేనే విమానాశ్రయ విస్తరణ సుగమమవుతుందని, లేకపోతే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కల్పించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.