విజయవాడ : గన్నవరం విమానాశ్రయానికి ఏడేళ్ల క్రితం పట్టిన భూగ్రహణం ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడంలేదు. విమానాశ్రయ విస్తరణ కోసం గతంలో భూములు ఇస్తామని రైతులు ముందుకొచ్చినా, బడ్జెట్ లేక అధికారులు వెనకడుగు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చినా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో రైతులు తమ భూములు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో భూ సేకరణ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
గతంలో అంగీకరించి..
గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి అభివృద్ధి చేసేందుకు మరో 465 ఎకరాల భూమి అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ పేర్కొంది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఇచ్చినా మరో 420 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు భూసేకరణ కోసం గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో సర్వే నిర్వహించి అవసరమైన భూముల వద్ద హద్దులు నిర్ణయించింది. నిర్వాసిత రైతులను గుర్తించింది.
నిర్వాసితులతో నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధర్‌బాబు పలుమార్లు చర్చలు జరిపారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం కేసరపల్లిలో ఎకరానికి రూ.75లక్షలు, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల పరిధిలో రూ.48లక్షలు, అజ్జంపూడిలో రూ.36లక్షల చొప్పున చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పడంతో తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. అప్పట్లో రైతులు చెల్లించేందుకు బడ్జెట్ లేకపోవడం, ఎన్నికలు రావడంతో భూసేకరణ నిలిచిపోయింది.
రాజధాని ప్రకటన తర్వాత సీన్ రివర్స్
ప్రభుత్వం విజయవాడను రాజధానిగా ప్రకటించడంతో భూముల విలువ భారీగా పెరిగింది. తమ గ్రామాల్లో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు చేరిందని నిర్వాసితులు చెబుతున్నారు. పాత ధర ప్రకారం భూములు ఇస్తే తాము నష్టపోతామని, ప్రస్తుత మార్కెట్ రేటును చెల్లించాలని, లేదా భూమికి సమానంగా మరో ప్రాంతంలో భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఈ విధానంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు మరుగున పడిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు.
భూసేకరణ బాధ్యత మంత్రి ఉమాకు..
ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన భూసేకరణ బాధ్యతను జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడి ఒప్పించాలని మంత్రి ఉమా గన్నవరంలో నివాసముంటున్న టీడీపీ సీనియర్ నేత కడియాల రాఘవరావుకు చెప్పినట్లు సమాచారం. అందువల్లే కడియాల సోమవారం నిర్వాసితులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 60:40 పద్ధతిలో భూమిని ఇవ్వాలని ఆయన ప్రతి పాదించగా, రైతులు వ్యతిరేకించారు. రైతులు సహకరిస్తేనే విమానాశ్రయ విస్తరణ సుగమమవుతుందని, లేకపోతే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కల్పించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భూగ్రహణం
Published Wed, Sep 10 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement