ఖమ్మం జెడ్పీసెంటర్: పేద ఎస్సీ కుటుంబాలకు భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (సంక్షేమం) ఎ.రామలక్ష్మణ్ కోరారు. భూమి కొనుగోలు పథకం ప్రగతిపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తదితర అధికారులతో ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో శుక్రవారం సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూమి కొనుగోలు పథకం అమలు బాగుందన్నారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరముందన్నారు. ఈ భూముల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం 50కోట్ల కేటాయించనున్నట్టు చెప్పారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని పేద దళిత కుటుంబాలకు పంపిణీ చేసిన 942 ఎకరాల భూమిని రీ సర్వే చేసి, వాటి సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు.
తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జించేలా సాగు పద్ధతులపై రైతులను చైతన్యపరచాలని కోరారు. ఈ పథకం ప్రగతిని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి వివరించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 17 ఎస్సీ కుటుంబాలకు 22 ఎకరాల భూమి పంపిణీ చేసినట్టు చెప్పారు. మరో 50 ఎకరాల భూమి పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు.
మరో 100 ఎకరాలకు సంబంధించిన సర్వే పూర్తయిందన్నారు. భూ యాజమానులతో మాట్లాడి ధర నిర్ణయించాల్సుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటనర్సయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి, జేడీఏ భాస్కర్‌రావు, జేడీఏహెచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గిరిజనాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
భద్రాచలం: గిరిజనాభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్‌లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శుక్రవారం ఇక్కడ ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయనకు పీవో దివ్య వివరించారు.
రామలక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏజెన్సీలోని గిరిజనులు ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి శాతం 65.35 ఉంటే, ట్రైబల్ సబ్ ప్లాన్ పరిధిలో మాత్రం 39.80 శాతం ఉండటంపై ఆలోచించాలన్నారు. గిరిజనుల విద్యార్థులు ఉన్నత విద్యనందుకునేలా అధికారులు అన్ని రకాలుగా అండగా నిలువాలన్నారు.
ఆరోగ్య సేవలను మరింతగా విస్తరించాలన్నారు.అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హులైన గిరిజనుకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అదే సమయంలో అడవులను సంరక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఆర్‌డీవో ఆర్.అంజయ్య, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి, అదనపు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఏజెన్సీ డీఈవో నాంపల్లి రాజేష్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, జిల్లా మలే రియా అధికారి డాక్టర్ రాంబాబు, ఏటీవో రామారావు తదితరులు పాల్గొన్నారు.
భూమి కొనుగోలును వేగవంతం చేయండి
Published Sat, Nov 8 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement