ఆడదానివై ఉండి.. ఈ సినిమా ఎలా తీశావ్!
నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలి షాకింగ్ కామెంట్స్
'నువ్వు ఒక మహిళవై ఉండి.. ఇలాంటి సినిమాను ఎలా తీశావు?' ఇది కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) నుంచి నిర్మాత కిరణ్ ష్రఫ్కు ఎదురైన ప్రశ్న. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా కిరణ్ ష్రఫ్ 'బాబుమోషాయ్ బందూక్బాజ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఏకంగా 48 కత్తెర్లు వేసిన పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సీబీఎఫ్సీ.. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు తనను కూడా దుర్భాషలు ఆడిందని నిర్మాత కిరణ్ ష్రఫ్ తెలిపారు.
'సినిమాను చూసిన తర్వాత సీబీఎఫ్సీ సభ్యులు దాదాపు గంటసేపు తమలో తాము చర్చించుకున్నారు. మొదట మా సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అనంతరం సినిమాలో 48 కట్లు ఉంటాయని చెప్పారు. సినిమా పెద్దల కోసమే అయినప్పుడు అన్ని కట్లు ఎందుకు అని మేం వాదించాం. వాళ్లు అది ఏమీ పట్టించుకోలేదు. తాము ఎందుకు కట్ చేస్తున్నామో వివరించుకుంటూ పోయారు' అని నిర్మాత కిరణ్ ష్రఫ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. 'ఈ దశలో సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు నావైపు తిరిగి.. 'మీరు ఆడవారై ఉండి ఇలాంటి సినిమాను ఎలా తీశారు?' అని ప్రశ్నించింది. దీనికి మరో సభ్యుడు కలుగజేసుకుంటూ.. 'చూడండి ప్యాంటు, షర్ట్ వేసుకుంది. మహిళ ఎలా అవుతుంది' అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో నాకు దిమ్మతిరిగిపోయింది. ఇది తిరోగమన ఆలోచన. నిర్మాతలు ఈ తరహా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. ధరించే దుస్తుల ఆధారంగా మహిళలను జడ్జ్ చేసే వ్యక్తులు.. నా సినిమాకు ఎంతమేరకు సర్టిఫికేట్ ఇవ్వగలరో గ్రహించవచ్చు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాకు పెద్ద ఎత్తున కత్తెర్లు వేయడంపై దర్శకుడు కుషాన్ నందీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో తిట్లు అన్ని ఎత్తివేయాలని, 80శాతం రొమాంటిక్ సీన్లను కట్ చేయాలని సీబీఎఫ్సీ ఆదేశించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.