Production boy
-
భోజనానికి కూర్చుంటే అందరి ముందు అవమానించాడు: నటి హేమ
ప్రముఖ నటి హేమ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందింది. పలు సినిమాల్లో అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. 'సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటే జనాలకి లోకువ. కెరీర్లో ఎన్నో కష్టాలు పడి తల్లి సపోర్ట్‌తో ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడంటే కారవాన్స్ వచ్చి అన్ని వసతులు ఉన్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ లొకేషన్స్‌లో బట్టలు మార్చుకోవాలంటే సరైన ప్లేస్ ఉండేది కాదు. కనీసం టాయిలెట్స్ వసతి కూడా ఉండేది కాదు. భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ నన్ను అవమానించాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ సహా యూనిట్ అందరం కలిసి భోజనం చేస్తుండగా నేను అక్కడే వాళ్లతో పాటే తింటున్నాను. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అని అవమానించాడు. ఆ మాటతో చాలా కోపం వచ్చింది. టేబుల్ ఎత్తి అతనిపై పడేద్దామనుకున్నా. కానీ తింటే వీళ్లందరితోనే కలిసి తినాలని డిసెడ్ అయి మరింత కష్టపడ్డాను. ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడు. మళ్లీ అతనే ఓ సినిమా షూటింగ్ సమయానికి వచ్చి చాలా మర్యాదగా నాకు భోజనం పెట్టాడు. కానీ కెరీర్లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేను' అంటూ చెప్పుకొచ్చింది. -
అవకాశం వస్తే చిరంజీవి సినిమాకి ప్రొడక్షన్ బాయ్నవుతా!
మావయ్య 150వ సినిమాలో పాత్ర చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా ‘సాక్షి’తో సాయిధరమ్‌తేజ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :చిరంజీవి సినిమాలో చివరికి ప్రొడక్షన్ బాయ్‌గా అవకాశం వచ్చినా పని చేస్తానని వర్ధమాన హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ అన్నారు. ‘సుప్రీమ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో శనివారం ముచ్చటించారు. సాక్షి : మీ సినిమాలపై చిరంజీవి ప్రభావం ఉంటుందా? జవాబు : కచ్చితంగా. ఆయన నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉంది. సాక్షి : చిరంజీవి బిరుదు ‘సుప్రీమ్’ పేరుతో సినిమా తీశారు. ఈ విషయంలో తీసుకున్న జాగ్రత్తలేమిటి? జవాబు : సినిమా కథ విన్నా. తర్వాత పేరు చెప్పారు ‘సుప్రీమ్’ అని. అంతే ఒక్కసారిగా కంగారు వచ్చింది. వెంటనే విషయాన్ని మావయ్య చిరంజీవితో చెప్పా. ఆయన ‘ఏం భయంలేదు.. మేమున్నాం’ అన్నారు. దీంతో ఆ భయం పోయింది. సాక్షి : చిరంజీవి అంటే మీకు ఎంత ఇష్టం? జవాబు : ఆయనంటే నాకు ఇష్టం కాదు ప్రాణం. ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇది నిజం. నేను ఆయన తొలి అభిమానిని. సాక్షి : ఆయన 150వ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేశారా? జవాబు : చేయడం కాదు. అందరికంటే ముందే ఆ సినిమాలో నటించాలనే కోరికతో దర్శకుడు వీవీ వినాయక్‌కు, మావయ్యకు దరఖాస్తు చేసుకున్నా. ఆయన సినిమాలో ఎటువంటి అవకాశం వచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం. సాక్షి : ఫలానా పాత్ర చేయాలనే కోరిక ఏమైనా ఉందా? జవాబు : అటువంటిదేమీ లేదు. ప్రేక్షకులందరికీ నచ్చే పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లాలనేదే తప్ప నాకంటూ ప్రత్యేక పాత్రలంటూ ఏమీ లేవు. సాక్షి : ప్రస్తుత సినిమాలు ఏం చేస్తున్నారు? జవాబు : ‘సుప్రీమ్’ తర్వాత తిక్క, గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకు సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. సాక్షి : మీ ఫ్యామిలీ ముచ్చట్లు? జవాబు : చాలా సరదాగా ఉంటా. బన్నీ, చరణ్, వరుణ్‌తేజ్ మేమందరం కలిశామంటే అల్లరే. జంగారెడ్డిగూడెంలో అభిమానులకు ‘సుప్రీమ్’ సినిమాలో ఒక పాట ప్రదర్శించి చూపుతున్నాం. అక్కడికెళ్లాలి. మళ్లీ సక్సెస్ మీట్‌తో కలుస్తా. బై.. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల్లో ‘సుప్రీమ్’ తనకు చాలా ప్రత్యేకమని ఆ చిత్ర హీరో సాయిధరమ్‌తేజ్ అన్నారు. ‘సుప్రీమ్’ ఈ నెల 5న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా ఆ చిత్ర యూనిట్ శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. ఆనంద్ రీజెన్సీ హోటల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకూ యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీల్లో నటించగా, ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా నటించానన్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఆంజనేయుడి లింక్‌తో సాగిందని, అదే రీతిలో ‘సుప్రీమ్’ సినిమా ప్రారంభంలోను, ఇంటర్వెల్ తర్వాత ఆంజనేయుడితో ఉండే సన్నివేశాలు కథకు కీలకమవుతాయని వివరించారు. సాయిధరమ్‌తేజ్‌తో వెంకటేశ్వర క్రియేషన్‌లో ఏటా ఒక సినిమా తీస్తున్నామని, అలా ఇప్పటివరకూ తీశామని, ఇది మూడోదని అన్నారు. కార్యక్రమంలో కమెడియన్ రాజేష్, వింటేజ్ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, అనుశ్రీ సినిమాస్ సత్యనారాయణ, గీతా మేనేజర్ సీఎస్ఆర్ రామశాస్త్రి, సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ రత్తయ్యచౌదరి పాల్గొన్నారు. -
యాభై ఏళ్ల నుంచి వాకింగ్ చేస్తున్నా!
భారతీయ సినిమాను పుట్టుక నుంచి చూస్తున్న వ్యక్తి కె.రాఘవ. ప్రొడక్షన్ బాయ్‌గా, మేనేజర్‌గా, డూప్‌గా, ఫైట్ మాస్టర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసి, చివరకి నిర్మాతగా స్థిరపడ్డారు. తెలుగు చిత్రసీమకు ఇద్దరు శతాధిక చిత్ర దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనకే సొంతం. సినీ ‘సుఖఃదుఖాలు’ ఆసాంతం చవిచూసిన ఈ కురువృద్ధుడి వయసు ఇప్పుడు అక్షరాలా నూటొక్కటి. క్రమశిక్షణే తన ఆరోగ్యానికి కారణం అంటారాయన. వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగా కూడా పలువురికి ఆదర్శంగా నిలిచిన నిత్య కృషీవలుడు కె.రాఘవ ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... 1913 డిసెంబర్ 19 నా పుట్టినరోజు. ఈ డిసెంబర్‌కి నూటరెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ఈ పరిపూర్ణమైన ఆయుర్దాయం... ఆ దేవుడు, నా తల్లిదండ్రులు కలిసి నాకిచ్చిన వరం. చిన్నప్పట్నుంచీ ఏ చెడ్డ అలవాటూ లేదు. కాఫీ, టీలు కూడా తాగను. పనే దైవం. ఆ క్రమశిక్షణే నాకు ఇంతటి ఆరోగ్యాన్నిచ్చింది. నేను జాగింగులు, యోగా, కసరత్తులు... ఇలా వివిధ వ్యాయామాలు చేస్తానని చాలామంది అనుకుంటుంటారు. అందులో నిజంలేదు. నాకు ఏ వ్యాయామం తెలీదు. పనే నా వ్యాయామం. చిన్నప్పట్నుంచీ క్షణం తీరిక లేని జీవితం నాది. మొదట్నుంచీ ఏ పని దొరికితే ఆ పని చేసేవాణ్ణి. అదే నాకు పెద్ద వ్యాయామం. 51 ఏళ్ల వయసు నుంచీ వాకింగ్ మొదలుపెట్టాను. అప్పుడు కూడా పని ఉంటే నడిచేవాణ్ణి కాదు. పని లేకపోతే మాత్రం వాకింగ్‌కి వెళ్లేవాణ్ణి. ఆ లెక్క ప్రకారం చూస్తే... నా వాకింగ్ వయసు 50 ఏళ్లు! పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట వాకింగ్ చేసేవాణ్ణి. ఇప్పుడు మాత్రం సాయంత్రం మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే... మునుపటి ఉత్సాహం ఇప్పుడు లేదు. వయసు కూడా సహకరించడం లేదు. అలాగని పొద్దున్నే లేచి ఖాళీగా మాత్రం కూర్చోను. ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంట్లోనే చిన్నిచిన్న కసరత్తులు చేస్తా. దిన చర్య విషయానికొస్తే.. ఉదయం, సాయంత్రం చిన్న చిన్న వర్కవుట్లు మినహాయిస్తే.. మిగిలిన సమయమంతా టీవీ చూస్తూ కూర్చుంటున్నాను. పదేళ్లుగా ఇదే నా పని. నేను నిర్మించిన చివరి సినిమా ‘అంకితం’. ఆ సినిమా తర్వాత టోటల్‌గా రిలాక్స్ అయిపోయాను. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ, ఉప్మా... ఇలా ఇంట్లో ఏది చేస్తే అది తింటా. అయితే... చాలా తక్కువ మోతాదులో తింటా. మధ్యాహ్నం కప్పు రైసు. ఇక సాయంత్రం భోజనం చేయను. ఇంట్లోనే ఉప్మానో ఏదో ఒకటి చేసి పెడతారు. అది తిని పడుకుంటా. ఇంట్లో అప్పుడప్పుడూ జావ చేసి ఇస్తారు. అది తీసుకుంటా. బయటి ఆహారం మాత్రం తీసుకోను. సాధ్యమైనంతవరకూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటా. టెన్షన్ల జోలికి పోను. ఎదుటివారి సొమ్ము ఆశించడం వల్లే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అలాంటివాటికి నేను దూరం. అలాగని నా సొమ్ముని అనవసరంగా వదులుకోను. ఒకప్పుడు పొద్దున్నే నాలుగున్నరకు లేచేవాణ్ణి. యూనిట్ మొత్తాన్ని అలర్ట్ చేసేవాణ్ణి. నేను ఖాళీగా ఉండను. ఎవర్నీ ఖాళీగా ఉండనీయను. నా వ్యవహారాలన్నీ ముక్కుసూటిగానే ఉండేవి. ప్రొడక్షన్ బోయ్ నుంచి హీరో దాకా ఎవరికైనా సరే... బ్రేక్‌ఫాస్ట్ కింద రెండు ఇడ్లీలు, ఒక వడ పెట్టేవాణ్ణి. దీనికి ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేయమనేవాణ్ణి. నా వయసు వారు భారతీయ చిత్రసీమలో బహుశా ఎవరూ లేరు. దాదాపుగా అందరూ గతించారు. నేనింకా ఆరోగ్యం ఉన్నానంటే అది గాడ్ గిఫ్ట్.