యాభై ఏళ్ల నుంచి వాకింగ్ చేస్తున్నా!
భారతీయ సినిమాను పుట్టుక నుంచి చూస్తున్న వ్యక్తి కె.రాఘవ. ప్రొడక్షన్ బాయ్‌గా, మేనేజర్‌గా, డూప్‌గా, ఫైట్ మాస్టర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసి, చివరకి నిర్మాతగా స్థిరపడ్డారు. తెలుగు చిత్రసీమకు ఇద్దరు శతాధిక చిత్ర దర్శకులను పరిచయం చేసిన ఘనత ఆయనకే సొంతం. సినీ ‘సుఖఃదుఖాలు’ ఆసాంతం చవిచూసిన ఈ కురువృద్ధుడి వయసు ఇప్పుడు అక్షరాలా నూటొక్కటి. క్రమశిక్షణే తన ఆరోగ్యానికి కారణం అంటారాయన. వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగా కూడా పలువురికి ఆదర్శంగా నిలిచిన నిత్య కృషీవలుడు కె.రాఘవ ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు...
1913 డిసెంబర్ 19 నా పుట్టినరోజు. ఈ డిసెంబర్‌కి నూటరెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ఈ పరిపూర్ణమైన ఆయుర్దాయం... ఆ దేవుడు, నా తల్లిదండ్రులు కలిసి నాకిచ్చిన వరం. చిన్నప్పట్నుంచీ ఏ చెడ్డ అలవాటూ లేదు. కాఫీ, టీలు కూడా తాగను. పనే దైవం. ఆ క్రమశిక్షణే నాకు ఇంతటి ఆరోగ్యాన్నిచ్చింది.
నేను జాగింగులు, యోగా, కసరత్తులు... ఇలా వివిధ వ్యాయామాలు చేస్తానని చాలామంది అనుకుంటుంటారు. అందులో నిజంలేదు. నాకు ఏ వ్యాయామం తెలీదు. పనే నా వ్యాయామం. చిన్నప్పట్నుంచీ క్షణం తీరిక లేని జీవితం నాది. మొదట్నుంచీ ఏ పని దొరికితే ఆ పని చేసేవాణ్ణి. అదే నాకు పెద్ద వ్యాయామం.
51 ఏళ్ల వయసు నుంచీ వాకింగ్ మొదలుపెట్టాను. అప్పుడు కూడా పని ఉంటే నడిచేవాణ్ణి కాదు. పని లేకపోతే మాత్రం వాకింగ్‌కి వెళ్లేవాణ్ణి. ఆ లెక్క ప్రకారం చూస్తే... నా వాకింగ్ వయసు 50 ఏళ్లు!
పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట వాకింగ్ చేసేవాణ్ణి. ఇప్పుడు మాత్రం సాయంత్రం మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే... మునుపటి ఉత్సాహం ఇప్పుడు లేదు. వయసు కూడా సహకరించడం లేదు. అలాగని పొద్దున్నే లేచి ఖాళీగా మాత్రం కూర్చోను. ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంట్లోనే చిన్నిచిన్న కసరత్తులు చేస్తా.
దిన చర్య విషయానికొస్తే.. ఉదయం, సాయంత్రం చిన్న చిన్న వర్కవుట్లు మినహాయిస్తే.. మిగిలిన సమయమంతా టీవీ చూస్తూ కూర్చుంటున్నాను. పదేళ్లుగా ఇదే నా పని. నేను నిర్మించిన చివరి సినిమా ‘అంకితం’. ఆ సినిమా తర్వాత టోటల్‌గా రిలాక్స్ అయిపోయాను.
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ, ఉప్మా... ఇలా ఇంట్లో ఏది చేస్తే అది తింటా. అయితే... చాలా తక్కువ మోతాదులో తింటా. మధ్యాహ్నం కప్పు రైసు. ఇక సాయంత్రం భోజనం చేయను. ఇంట్లోనే ఉప్మానో ఏదో ఒకటి చేసి పెడతారు. అది తిని పడుకుంటా. ఇంట్లో అప్పుడప్పుడూ జావ చేసి ఇస్తారు. అది తీసుకుంటా. బయటి ఆహారం మాత్రం తీసుకోను.
సాధ్యమైనంతవరకూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటా. టెన్షన్ల జోలికి పోను. ఎదుటివారి సొమ్ము ఆశించడం వల్లే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అలాంటివాటికి నేను దూరం. అలాగని నా సొమ్ముని అనవసరంగా వదులుకోను.
ఒకప్పుడు పొద్దున్నే నాలుగున్నరకు లేచేవాణ్ణి. యూనిట్ మొత్తాన్ని అలర్ట్ చేసేవాణ్ణి. నేను ఖాళీగా ఉండను. ఎవర్నీ ఖాళీగా ఉండనీయను. నా వ్యవహారాలన్నీ ముక్కుసూటిగానే ఉండేవి. ప్రొడక్షన్ బోయ్ నుంచి హీరో దాకా ఎవరికైనా సరే... బ్రేక్‌ఫాస్ట్ కింద రెండు ఇడ్లీలు, ఒక వడ పెట్టేవాణ్ణి. దీనికి ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేయమనేవాణ్ణి. నా వయసు వారు భారతీయ చిత్రసీమలో బహుశా ఎవరూ లేరు. దాదాపుగా అందరూ గతించారు. నేనింకా ఆరోగ్యం ఉన్నానంటే అది గాడ్ గిఫ్ట్.