అవకాశం వస్తే చిరంజీవి సినిమాకి ప్రొడక్షన్ బాయ్‌నవుతా!
మావయ్య 150వ సినిమాలో పాత్ర చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా
‘సాక్షి’తో సాయిధరమ్‌తేజ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :చిరంజీవి సినిమాలో చివరికి ప్రొడక్షన్ బాయ్‌గా అవకాశం వచ్చినా పని చేస్తానని వర్ధమాన హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ అన్నారు. ‘సుప్రీమ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో శనివారం ముచ్చటించారు.
సాక్షి : మీ సినిమాలపై చిరంజీవి ప్రభావం ఉంటుందా?
జవాబు : కచ్చితంగా. ఆయన నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉంది.
సాక్షి : చిరంజీవి బిరుదు ‘సుప్రీమ్’ పేరుతో సినిమా తీశారు. ఈ విషయంలో తీసుకున్న జాగ్రత్తలేమిటి?
జవాబు : సినిమా కథ విన్నా. తర్వాత పేరు చెప్పారు ‘సుప్రీమ్’ అని. అంతే ఒక్కసారిగా కంగారు వచ్చింది. వెంటనే విషయాన్ని మావయ్య చిరంజీవితో చెప్పా. ఆయన ‘ఏం భయంలేదు.. మేమున్నాం’ అన్నారు. దీంతో ఆ భయం పోయింది.
సాక్షి : చిరంజీవి అంటే మీకు ఎంత ఇష్టం?
జవాబు : ఆయనంటే నాకు ఇష్టం కాదు ప్రాణం. ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇది నిజం. నేను ఆయన తొలి అభిమానిని.
సాక్షి : ఆయన 150వ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేశారా?
జవాబు : చేయడం కాదు. అందరికంటే ముందే ఆ సినిమాలో నటించాలనే కోరికతో దర్శకుడు వీవీ వినాయక్‌కు, మావయ్యకు దరఖాస్తు చేసుకున్నా. ఆయన సినిమాలో ఎటువంటి అవకాశం వచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధం.
సాక్షి : ఫలానా పాత్ర చేయాలనే కోరిక ఏమైనా ఉందా?
జవాబు : అటువంటిదేమీ లేదు. ప్రేక్షకులందరికీ నచ్చే పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లాలనేదే తప్ప నాకంటూ ప్రత్యేక పాత్రలంటూ ఏమీ లేవు.
సాక్షి : ప్రస్తుత సినిమాలు ఏం చేస్తున్నారు?
జవాబు : ‘సుప్రీమ్’ తర్వాత తిక్క, గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకు సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.
సాక్షి : మీ ఫ్యామిలీ ముచ్చట్లు?
జవాబు : చాలా సరదాగా ఉంటా. బన్నీ, చరణ్, వరుణ్‌తేజ్ మేమందరం కలిశామంటే అల్లరే. జంగారెడ్డిగూడెంలో అభిమానులకు ‘సుప్రీమ్’ సినిమాలో ఒక పాట ప్రదర్శించి చూపుతున్నాం. అక్కడికెళ్లాలి. మళ్లీ సక్సెస్ మీట్‌తో కలుస్తా. బై..
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల్లో ‘సుప్రీమ్’ తనకు చాలా ప్రత్యేకమని ఆ చిత్ర హీరో సాయిధరమ్‌తేజ్ అన్నారు. ‘సుప్రీమ్’ ఈ నెల 5న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్ శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. ఆనంద్ రీజెన్సీ హోటల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకూ యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీల్లో నటించగా, ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా నటించానన్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఆంజనేయుడి లింక్‌తో సాగిందని, అదే రీతిలో ‘సుప్రీమ్’ సినిమా ప్రారంభంలోను, ఇంటర్వెల్ తర్వాత ఆంజనేయుడితో ఉండే సన్నివేశాలు కథకు కీలకమవుతాయని వివరించారు. సాయిధరమ్‌తేజ్‌తో వెంకటేశ్వర క్రియేషన్‌లో ఏటా ఒక సినిమా తీస్తున్నామని, అలా ఇప్పటివరకూ తీశామని, ఇది మూడోదని అన్నారు. కార్యక్రమంలో కమెడియన్ రాజేష్, వింటేజ్ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, అనుశ్రీ సినిమాస్ సత్యనారాయణ, గీతా మేనేజర్ సీఎస్‌ఆర్ రామశాస్త్రి, సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ రత్తయ్యచౌదరి పాల్గొన్నారు.