సినీ పరిపూర్ణుడు | Veteran Telugu Producer K Raghava Dies | Sakshi
Sakshi News home page

సినీ పరిపూర్ణుడు

Published Wed, Aug 1 2018 2:12 AM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM

Veteran Telugu Producer K Raghava Dies - Sakshi

కోటిపల్లి రాఘవ

దాదాపుగా నూరేళ్ల కిందట ప్రాణం పోసుకున్న ఒక పసివాడు చిన్న కారణంగా ఇంట్లోంచి పారిపోయాడు. అన్నం కోసం అలమటించాడు. దొరికిన పనిచేశాడు. ఆకలి మాత్రమే అతడి ఆసక్తి. అదే అతణ్ని ఆఫీస్‌ బాయ్‌ని చేసింది, ఫైటర్‌ని చేసింది, డూపును చేసింది, ఫైట్‌మాస్టర్‌ని చేసింది, ప్రొడక్షన్‌ మేనేజర్‌ను చేసింది, నిర్మాతను చేసింది. మూకీల నుంచి చిత్రసీమ పరిణామ క్రమానికి ఒక విలువైన సాక్షిగా నిలబెట్టింది. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలాంటి శతాధిక చిత్రదర్శకులను సినీరంగానికి పరిచయం చేసిన ‘ప్రతాప్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌’ కె.రాఘవ సినిమా రంగానికి సంబంధించి ఒక పరిపూర్ణుడు. పరిపూర్ణమైన సినీ జీవితాన్ని అనుభవించి ఆయన వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన ‘సాక్షి’తో పంచుకున్న స్వగతం.......

‘‘కాకినాడ దగ్గరి కోటిపల్లి మా ఊరు. అదే మా ఇంటిపేరు కూడా. సాధారణ రైతు కుటుంబం. నాకు చదువు అబ్బలేదు. బడిలో చెప్పే పాఠం ఏమీ అర్థమయ్యేది కాదు. దాంతో దెబ్బలు పడేవి. కోపమొచ్చేసి, ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లుంటాయి. స్టేషన్లో కనబడిన రైలు ఎక్కేశాను. అది ఎటు పోతుందో తెలియదు. తీరా అది కలకత్తాలో ఆగింది. వీధులెంబడి పిచ్చివాడిలా తిరిగాను. భాష తెలియదు, మనుషులు తెలియదు, పైగా ఆకలి! నడుస్తూ నడుస్తూ ఒక ఎల్తైన బిల్డింగు గేటు దగ్గర ఆగాను. అది మోతీలాల్‌ చమేరియా స్టూడియో! ఆ రోజుల్లో మూకీ సినిమా తీయాలంటే డెబ్రీ కెమెరా వాడేవారు. దాన్ని తిప్పడానికి  ‘ట్రాలీ పుల్లర్‌’ కావాలి. ఆ పనికి కుదిరాను. షూటింగుల సమయంలో భోజనం అక్కడే చేసేవాణ్ని. అలా రెండు మూడేళ్లు గడిచాయి.

టాకీలు రానే వచ్చాయి
మూకీల కాలం పోయి, టాకీలు వస్తాయని ప్రచారం జరుగుతుండేది. దీంతో అక్కడ పనిచేసేవాళ్లు తమ పనిపోతుందేమో అని భయపడేవారు. నేనూ అలాగే అనుకొని, మళ్లీ రైలెక్కేశాను మద్రాస్‌ వెళ్లిపోదాం, అక్కడైతే పని బాగా దొరుకుతుందని. కానీ టికెట్‌ లేని కారణంగా, మధ్యలోనే కొట్టి దించేశారు. చూస్తే బెజవాడ! ఇక్కడ పనేం దొరుకుతుంది? మారుతి థియేటర్‌ కనబడితే వెళ్లి చేరాను. కస్తూరి శివరావు నటుడు కాకమునుపు మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పని చేసేవారు. ఆయనకు నేను అసిస్టెంట్‌ని. హాల్లో మధ్యలో టేబులుంటుంది. పైన ఆయన, కింద నేను. దృశ్యాన్ని బట్టి ఆయన చెబుతుంటే, నేను అవసరమైనప్పుడల్లా గొంతు కలపాలి. ‘తందానతాన’ లాగ! ఏడాదికంతా ఒకే సినిమా ఆడేది. షోకు ఆయనకు పది రూపాయలిస్తే, అందులోంచి నాకు రెండో మూడో ఇచ్చేవారు. పరిచయం పెరిగాక, ‘రారా భోంచేద్దాం’ అనేవారు. కాలం గిర్రున తిరిగింది. టాకీలు రానే వచ్చాయి. బెజవాడలోనే రాజకుమారి ‘టాకీస్‌’ కొత్తగా ప్రారంభమైంది. మారుతి కూడా టాకీస్‌ అయ్యింది. దాంతో అనౌన్సరు అక్కర్లేకుండా పోయాడు. ఇక, అసిస్టెంటు ఏం చేస్తాడు? ఛలో మద్రాస్‌!

తిప్పినవాళ్లంతా గొప్పవాళ్లయ్యారు
కొన్నాళ్లు రఘుపతి వెంకయ్య నాయుడు ఆఫీసులో బాయ్‌గా పనిచేశాను. మరి కొన్నాళ్లు టంగుటూరి ప్రకాశం పంతులు కారు తుడిచాను. బతుకుదెరువులో భాగంగా ‘స్టంట్‌’ సోము, ‘స్టంట్‌’ స్వామినాథన్‌ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. కత్తి తిప్పడాలు సాధన చేశాను. కొన్ని సినిమాల్లో ఫైటర్స్‌లో ఒకడిగా ఉన్నాను. తర్వాత ఫైట్‌ మాస్టర్‌ అయ్యాను. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహిస్తున్న ‘పల్నాటి యుద్ధం’(1947) చిత్రానికి స్టంట్‌ మాస్టర్‌గా చేస్తున్నప్పుడు, షూటింగ్‌ ఇంకా కొంచెం ఉందనగానే రామబ్రహ్మం గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎల్వీ ప్రసాద్‌ పనిచేస్తున్నారు. ఆయనైతేనే మిగతా భాగానికి న్యాయం చేయగలరని అందరం అనుకున్నాం.

అలా ఆయన దాన్ని పూర్తిచేశారు. ఈ దశలోనే మీర్జాపురం రాజా ‘మనదేశం’(1949) చిత్రాన్ని నిర్మించ తలపెట్టినప్పుడు దర్శకుడిగా ఎవరిని తీసుకుందాం అనే చర్చ వస్తే, ఎల్వీ ప్రసాద్‌ పేరు సూచించాను. ఆయనకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. ఇందులోనే ఒక చిన్న కానిస్టేబుల్‌ పాత్రకు ఒక యువకుడిని అనుకున్నారు. ‘రాఘవా! ఒక మనిషొస్తాడు, ఆయనకు మెడ్రాస్‌ తెలీదు, స్టేషన్‌కెళ్లి తీసుకురా,’ అన్నారు.  అలా ఎన్టీ రామారావును సులభంగా గుర్తుపట్టి, సెంట్రల్‌ నుంచి ఆళ్వారుపేటకు 4వ నెంబరు బస్సులో తీసుకొచ్చాను.  ఐద్రూపాయల అద్దెతో ఒక గుడిసె లాంటి గది చూసిపెట్టాను. అదీ చెల్లించడం కష్టమే అంటే టీవీ రాజు (అప్పటికి ఇంకా సంగీత దర్శకుడు కాలేదు)ను జతచేసి, చెరో రెండున్నర ఇచ్చుకునేట్టుగా ఏర్పాటుచేశాను.

‘పాతాళ భైరవి’(1951) సహా కేవీ రెడ్డి అన్ని చిత్రాలకు స్టంట్స్‌ సమకూర్చాను. దర్శకుడు పి.పుల్లయ్య కూడా స్టంట్‌మాస్టర్‌గా ఎంతో ప్రోత్సహించారు. చిన రాఘవ అని ఇంకొకాయన ఉండటంతో, ‘పోరాటాలు: పెద రాఘవ’ అని టైటిల్స్‌లో పడేది. ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లకు డూప్‌గా నటించాను. పద్మినీ పిక్చర్స్‌కు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశాను. వాళ్ల తరఫున శివాజీ గణేషన్‌ నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్‌’, ‘భలే పాండ్య’ తమిళ చిత్రాలతో పాటు హిందీలో షమ్మీ కపూర్‌ నటించిన ‘దిల్‌ తేరా దీవానా’ లాంటి సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించాను. ‘లవకుశ’కు రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించాను. పంపిణీదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పని! ఈ దశలోనే పాండిచ్చేరికి చెందిన (నిర్మాత ఎం.కె.రాధ చెల్లెలు) హంసారాణితో నా పెళ్లి జరిగింది.

బాలచందర్‌ ప్రవేశం
‘రాఘవ చెప్తే శివాజీ గణేషన్‌ వింటాడు,’ అన్న నమ్మకంతో ఓసారి కె.బాలచందర్‌ నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన డ్రామా (మేజర్‌ చంద్రకాంత్‌) ఆ రాత్రి వేస్తున్నారు. అది శివాజీ చూడాలి. ఈయన ఒప్పుకున్నారు. వెళ్లాం. చూశాం. బ్రహ్మాండంగా ఉంది. ‘రాఘవా, దీని హక్కులు తీసుకో బాగా ఆడుతుంది’ అన్నారు శివాజీ. ఎంతివ్వొచ్చు? ఒక పదివేలు. అంత డబ్బు నా దగ్గర లేదు. వాళ్ల తమ్ముడు షణ్ముగంతో ఆయనే డబ్బిప్పించారు. ఈ మొత్తం తీసుకెళ్లి బాలచందర్‌ చేతిలో పెడితే ఆయనకు మతిపోయింది. అన్ని భాషల రైట్స్‌ నాకే ఇచ్చేశారు. ఇదే డ్రామాను మరో రోజు హిందీ నటుడు అశోక్‌కుమార్‌ చూశారు.  హిందీలో తీయాలని నన్ను కలిశారు. శివాజీకి విషయం చెప్పాను. డబ్బు వాళ్లిచ్చిందే కదా! హిందీ వరకే నలభై వేలకు అమ్మేశాం. ఇప్పుడు అసలు సమస్యొచ్చింది.

ఇంతలో ఏవీఎం వారు దాన్ని సినిమాగా తీయడానికి ముందుకొచ్చారు. ప్రధానమైన అంధుడి పాత్ర తనకిస్తే హక్కులు ఇచ్చేద్దామన్నారు శివాజీ. ఆయన్ని తీసుకోవడం ఎందుకో ఏవీఎం చెట్టియార్‌కు ఇష్టం లేదు. మంచి అవకాశం. బాలచందర్‌ టెన్షన్‌. ఆ పాత్ర ఆయనకే ఇస్తున్నట్టు శివాజీతో నమ్మబలికాం. తమిళం హక్కులు ఇచ్చేశాం. మేజర్‌ సుందరరాజన్‌ ఆ పాత్ర పోషించారు. సినిమా హిట్టయ్యింది. శివాజీకి విషయం తెలిశాక కోపం, తిట్లు మామూలే.ఆ సినిమానే ఎన్‌.ఎన్‌.భట్, ఏకామ్రేశ్వర్రావు తెలుగులో నిర్మిద్దామనుకుని, హక్కులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్నూ ఒక భాగస్వామిగా కలుపుకున్నారు. ‘ఎన్‌.ఎన్‌.భట్‌ ఫిలింస్‌’ పతాకంపై తెలుగులో సుఖ దుఃఖాలు(1967)గా వచ్చిన ఆ చిత్రమే నిర్మాతగా నా తొలి అడుగు. ఎస్వీయార్‌ ప్రధాన పాత్ర పోషించారు. చిన్న పాత్రలు వేస్తున్న వాణిశ్రీకి దీంతోనే బ్రేక్‌ వచ్చింది (‘ఇది మల్లెల వేళయనీ’).

జగత్‌ హీరోలు
ఎంజీఎం వారి ‘టార్జాన్‌ గోస్‌ టు ఇండియా’ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు నేను చూశాను. అందులో భాగంగా రోమ్‌ వెళ్లినప్పుడు, ‘డాక్టర్‌ నో’, ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’, ‘షుగర్‌ కోల్ట్‌’ లాంటి సినిమాలు చూశాను. వాటి స్ఫూర్తితో ఒక సినిమా తీద్దామనుకున్నాను. ఏకామ్రేశ్వర్రావు కూడా జత కలిశాడు. అలా ఫల్గుణా మూవీస్‌ బ్యానర్‌పై ‘జగత్‌ కిలాడీలు’(69) ప్రారంభించాం. ఐఎస్‌ మూర్తి దర్శకుడు. ఎస్వీయార్, వాణిశ్రీ, కృష్ణ నటించారు.  తర్వాత శోభన్‌బాబుతో ‘జగజ్జెట్టీలు’ మొదలెట్టాం. దర్శకుడు నందన్‌రావు. ఈయన దగ్గర అసిస్టెంట్‌గా దాసరి నారాయణరావు ఉండేవాడు. 15 రోజుల్లో డైలాగ్స్‌ రాశాడు. అలా అతడు నా దృష్టిలో పడిపోయాడు. సినిమా కూడా హిట్టయ్యింది. తర్వాత, శోభన్‌బాబుతోనే ‘జగజ్జంత్రీలు’ (దర్శకుడు లక్ష్మీదీపక్‌) నిర్మించాం. వద్దంటే డబ్బు వచ్చి పడింది. నా కుమారుడి పేరు మీదుగా సొంతంగా ప్రతాప్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ ప్రారంభించి దాసరికి అవకాశం ఇచ్చాను.

తాత–మనవడు, రామయ్య కృష్ణయ్య
ఎస్వీయార్, రాజబాబు ‘తాత–మనవడు’ తీశాం (1972). బాగా ఆడింది. తర్వాత దాసరే దర్శకుడిగా ‘సంసారం సాగరం’, ‘తూర్పు పడమర’ నిర్మించాను. నెమ్మదిగా దాసరి బిజీ అయిపోయాడు. ‘తూర్పు పడమర’ సినిమాకు కోడి రామకృష్ణ అప్రెంటిస్‌గా చేరాడు. అతనికి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(82) సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. 500 రోజులు ఆడుతూనే ఉంది. చిరంజీవి టాప్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత ‘తరంగిణి’ తీశా. కొత్తవాడు సుమన్‌ను తీసుకున్నాం. సినిమా ఏడాది ఆడింది. తర్వాత, సూర్యచంద్రులు, చదువు సంస్కారం, అంతులేని వింత కథ, త్రివేణి సంగమం, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం లాంటి చిత్రాలు నిర్మించాను. రాజశ్రీ, గుహనాథన్, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావు లాంటి దర్శకులను పరిచయం చేశాను. నెమ్మదిగా కె.రాఘవ అంటే ప్రతాప్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ అయ్యింది.

ఎక్కడి నుంచి ఎక్కడికో...
నేను ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. జీవితం ఎటు తోస్తే అటు వెళ్లాను. డబ్బు వచ్చినా, నా బుద్ధి ఎటువైపూ మారలేదు. మద్యం, పొగ, కనీసం టీ కాఫీల జోలికి కూడా పోలేదు. వందేళ్ల వయసుకు వచ్చాను. ఫిలింనగర్‌ హౌజింగ్‌ సొసైటీలో మొదటి గృహప్రవేశం నేను చేశాను. మూకీల నుంచి సినిమా ప్రయాణాన్ని దగ్గరినుంచి చూశాను. రఘుపతి వెంకయ్య దగ్గర బాయ్‌గా పనిచేసినవాణ్ని ఆయన పేరు మీదుగా ఉన్న ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను తీసుకున్నాను.
సంభాషణ: రాజిరెడ్డి

రాఘవగారు ఓ డిక్షనరీ

– కోడి రామకృష్ణ
రాఘవగారంటే నాకెంతో అభిమానం. మా గురువుగారిని (దాసరి నారాయణరావు)  దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత–మనవడు’ సినిమా తీశారాయన. ఆయన బ్యానర్లో ఓ సినిమా అయినా చేయాలన్నది నా డ్రీమ్‌. ‘తూర్పు– పడమర’ సినిమాకి రాఘవగారు నిర్మాత. ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా. ఆ షూటింగ్‌లో ఆయనతో చనువు ఏర్పడింది. నా డ్రీమ్‌ చేరుకోవాలన్న ప్రయత్నంలో సమయం కుదిరినప్పుడల్లా ఆయనకు కథలు చెబుతుండేవాణ్ని. ఓ రోజు నటులు నగేశ్‌గారికి డబ్బింగ్‌ చెప్పించాల్సి వచ్చింది. విమానం లేట్‌ కావడంతో నగేశ్‌గారు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లంతా వెళ్లిపోయారు. నేను డబ్బింగ్‌ చెప్పిస్తానని రాఘవగారికి చెప్పా. ‘సీనియర్లు లేకుండా నగేశ్‌గారితో డబ్బింగ్‌ చెప్పించడం కష్టం’ అన్నారు. నేను చెప్పిస్తానని నమ్మకంగా చెప్పా. 400 అడుగుల లూప్‌ డైలాగ్‌ని అనుకున్న టైమ్‌ కంటే గంట ముందే చెప్పించేశా. ‘నిన్ను డైరెక్టర్‌ని చేస్తానయ్యా’ అన్నారు రాఘవగారు. ఓ రోజు  ఆఫీసుకి తీసుకెళ్లారు. ‘డైరెక్టర్‌ రూం’ అని బోర్డు ఉన్న గదిలోకి తీసుకెళ్లి, ‘ఇక్కడే.. దాసరిగారు కూర్చొని ‘తాత–మనవడు’ తీసి హిట్‌ కొట్టారు. నీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తున్నా. సిల్వర్‌ జూబ్లీ సినిమా తీయాలి’ అన్నారు. ఏడాదిన్నరపాటు కథతో, ఆయనతో ట్రావెల్‌ చేసి, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీసి హిట్‌ కొట్టా. ఆ చిత్రం సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌లో రాఘవగారు ‘ఇండస్ట్రీకి ఇంత మంచి డైరెక్టర్‌ని ఇచ్చిన దాసరిగారికి రుణపడి ఉన్నా’ అన్నారు. రాఘవగారంటే యూనివర్శిటీ.. డిక్షనరీ. ఆయన పని చేస్తూ, చేయించే వారు. షూటింగ్‌లో ఏనాడూ రెస్ట్‌ తీసుకోలేదు.


ఒక అనాథలా చెన్నై వచ్చారు కె.రాఘవగారు. లైట్‌ బోయ్‌ నుంచి కష్టపడి చాలా విభాగాల్లో  పనిచేసి ఆఖరికి నిర్మాత అయ్యారు. వన్నాఫ్‌ ది లెజెండ్స్‌గా నిలిచిన దాసరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన గొప్ప నిర్మాత ఆయన.

– కైకాల సత్యనారాయణ

రాఘవగారి నిర్మాణంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో నటించాను. ఆయనతో నాకు విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనం రాఘవగారు.

– మోహన్‌బాబు

మూకీ, టాకీ, డిజిటల్‌ యుగం.. ఇలా సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులనూ చూసిన మహానుభావుడు. తల్లిదండ్రుల అండ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పైకి వచ్చిన వ్యక్తి. జీవితంలో అద్భుత విజయాలు సాధించారు.

– ఆర్‌. నారాయణమూర్తి

రాఘవగారు నిర్మించిన ‘తరంగణి’ ద్వారా నేను హీరోగా పరిచయం అయ్యాను. ఆయన నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, తమ్మారెడ్డి భరద్వాజగారిలాంటి వారి వల్లే నా జీవితం మంచి మలుపు తిరిగింది. సినిమా రంగం హైదరాబాద్‌ రావడంలో రాఘవగారి కృషి చాలా ఉంది.

– సుమన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement