Telugu producer
-
తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ
తెలుగులో ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. ఓ హీరోని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు.. కావాలని మరో హీరోలని ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే ఎన్టీఆర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రియ.. హిందీ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమా పేరు చెప్పలేదు గానీ ఓ తెలుగు నిర్మాత.. షూటింగ్ చివరిరోజు డబ్బులివ్వలేక హుస్సేన్ సాగర్‌లో దూకేశాడన చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!)శ్రియ ఏమందంటే?'నేను, జెనీలియా, ఎన్టీఆర్ కలిసి ఓ పెద్ద సినిమా చేశాం. దీనికి నిర్మాత చేసిన ఆయన చాలా ఫన్నీ. చాలా మంచివాడు. అయితే షూటింగ్ చివరిరోజు మిగిలిన రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన (నిర్మాత) హైదరాబాద్‌లోని చెరువులో(హుస్సేన్ సాగర్) దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడే ఉన్న ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత మరి నేను పేమెంట్స్ గురించి అడగలేదు' అని శ్రియ చెప్పింది.'నా అల్లుడు' సినిమా నిర్మాత గురించే శ్రియ చెప్పింది. చెరువులు దూకడం, ప్రాణాలతో బయటపడటం లాంటి విషయాల్ని ఈమె చెబుతూ నవ్వేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడెందుకు ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా 'నరసింహుడు' మూవీ ప్రొడ్యూసర్ కూడా గతంలో చెరువులో దూకిన విషయమై తారక్‌ని పలువురు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)🤣🤣🤣🤣pic.twitter.com/1vQOTJoVAB— OG (@Tejuholicc2) October 28, 2024 -
స్టూడెంట్ నెం.1లో మొదట ప్రభాస్‌ను అనుకున్నాం: నిర్మాత
సీతారామం సక్సెస్‌తో నిర్మాతగా మరో జన్మ ఎత్తినట్లుందని తన్మయత్వానికి లోనవుతున్నాడు అశ్వినీదత్. వైజయంతి బ్యానర్లో ఆయన తీసిన ఎన్నో సినిమాలు మరపురాని విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. తర్వాత నేను, అరవింద్‌గారు కలిసి అనిల్ కపూర్‌తో చూడాలని ఉంది మూవీ తీశాం. అప్పుడిద్దరికీ చెరో ఆరు కోట్లు పోయాయి. అప్పట్లో ఓ సినిమాకు వాణిశ్రీని ఫిక్స్ చేశాం. ఆమె రూ. 2 లక్షలు కావాలంది. ఆమె అంత అడిగిందంటే ఎన్టీఆర్ రెండున్నర అడుగుతారేమోనని యాభైవేలు ఓ పొట్లంలో పట్టుకుని వెళ్లా. దానికాయన ఇంత డబ్బుందేంటి? మనం తీసుకునేది రెండు లక్షలే అని మిగతాది తిరిగిచ్చేశాడు. మహేశ్‌బాబు- రాజకుమారుడు, రామ్‌చరణ్- చిరుత, అల్లు అర్జున్- గంగోత్రి. ఇలా ఈ హీరోల మొదటి సినిమాలన్నీ మా బ్యానర్లో వచ్చినవే. తారక్‌ది మాత్రం రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తీశాం. ఈ సినిమాకు మొదట ప్రభాస్‌ను అనుకున్నాం. ఇంతలో హరికృష్ణ ఫోన్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ తారక్‌కు వచ్చింది. ఇక నా జీవితంలో ఆఖరి చిత్రం.. జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. శక్తి సినిమా రిలీజైనప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడే నాన్న చనిపోయారు. రజనీకాంత్ నా మాట వినలేదు, నా భార్య కూడా చెప్పింది వినలేదు. అప్పుడు నాలో శక్తి నశించిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు అశ్వినీదత్. చదవండి: ఆ యాంకర్‌తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్! సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో -
భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!
ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత, భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల టీజే టిల్లు సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన కాస్తా నోటి దురుసు చూపించాడు. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడాడు. దీంతో అతడి మాటలకు ఆడియన్స్ నొచ్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల విశాఖపట్నంలో జరిగి డీజే టిల్లు సక్సెస్ మీట్‌తో నాగవంశీ ప్రేక్షకులను ‘వాడు, వీడు’ అంటూ మాట్లాడాడు. దీంతో ఆయన తీరు మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయి. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఈ విషయం తెలిసి నాగవంశీ ట్విటర్ వేదిక క్షమాపణలు కోరాడు. ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయనే వార్తలు తెలిసి బాధపడ్డాను’ అంటూ ఆయన నోట్ విడుదల చేశాడు. అలాగే సోదర భావంతోనే వారిని అలా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడానని, అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడినయ్యానన్నాడు. ‘ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. చదవండి: ఓటీటీలో ‘96’ తెలుగు వెర్షన్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 🙏 pic.twitter.com/WzjueNtDOw — Naga Vamsi (@vamsi84) February 18, 2022 -
తెలుగు సినిమా స్వర్ణయుగంలో మూలస్తంభం
మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళభైరవి, మాయాబజార్ మొదలైన సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగం అని అంటూంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనపుడు తొలుత ఆ చరిత్రలో తారసపడే పేరు మూలా నారాయణస్వామి! కె.వి.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా వచ్చిన ‘భక్త పోతన’ అఖండ విజయం సాధించింది. అయితే, సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి ‘వాహిని స్టూడియో’కు నడుం కట్టారు మూలా నారాయణస్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం ‘గుణసుందరి కథ’. ఇది కూడా కె.వి.రెడ్డి దర్శకుడిగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది. మొదట కె.వి.రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బి.ఎన్.రెడ్డి అభ్యంతరం చెప్పారు. నారాయణ స్వామి పట్టువదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు. దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో, నారాయణ స్వామి ముగింపు అంతకు మించి ఉత్కంఠ కల్గిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూలా తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం. తాడిపత్రికి చెందిన నారాయణస్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే, ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చేశాడు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్ పరిశ్రమ, సహకార బ్యాంకు, పాల సహకార సంఘం, మార్కెట్ యార్డులు, పళ్ళ క్యానింగ్ ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంకు, రాయలసీమ టెక్స్టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలక్ట్రానిక్ కంపెనీ వంటి పేర్లుండేవి. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీరా టాకీస్ మూలాగారివే. వీరికి బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలసి బర్మాకు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి కలిగినవారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలిసి హెచ్.ఎం.రెడ్డి భాగస్వామ్యంతో ‘గృహలక్ష్మి’ రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్.ఎం.రెడ్డితో సర్దుకోలేక వాహినీ సంస్థను నెలకొల్పారు. వందేమాతరం, సుమంగళి, దేవత సినిమాలను నిర్మించి వాహిని సంస్థ చరిత్ర సృష్టించింది. ఇది 1938–1942 మధ్యకాలం. బాల్యమిత్రుడైన కేవీ రెడ్డిలో వ్యాపారి నారాయణస్వామి ఏమి చూశారోగానీ తెలుగు తెరకు ఒక గొప్ప దర్శకుడిని పరిచయం చేశారు. కేవీ రెడ్డి అప్పటికి ఆ సంస్థలో కేషియర్ మాత్రమే. ఏ సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేయలేదు. అందుకే మూలా దార్శనికుడు. ‘భక్త పోతన’ నిర్మించినపుడు న్యూటోన్ స్టూడియోలో ఇబ్బందులు గమనించి రెండున్నర లక్షల వ్యయంతో వాహినీ స్టూడియో ఏర్పాటయ్యింది. ఇందులో రెండు లక్షలు నారాయణ స్వామివి కాగా మిగతా యాభై వేలు బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులవి. ఆ సంస్థకు నారాయణస్వామియే చైర్మన్. మూలాకు ‘ఆంధ్రా బిర్లా’ అనే పేరుండేది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కస్తూర్బా ఫండ్‌కు ఆ రోజుల్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు స్వామిగారి పూర్వాపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. ఆయన తోడ్పాటుతో ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు. 1938–1949 మధ్యకాలంలో గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్త పోతన – గుణసుందరి కథ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్తా ముందు ఇన్కమ్ టాక్స్ సమస్యల్లో నారాయణస్వామి ఇరుక్కోవడం సంభవించింది. ముప్ఫై లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహినీ స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయ్యింది. నారాయణస్వామికి నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కష్టాలు ముప్పిరిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 1950 ఆగస్టు 20న 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకటరంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. 1961లో దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారంటారు. ఏది ఏమైనా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూల విరాట్టు అయిన మూలా నారాయణస్వామి పరిణామగతి ఆశ్చర్యకరం! – డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత పీడీవీ ప్రసాద్ సతీమణి అంజు ప్రసాద్(53) గుండెపోటుతో మరణించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు సంతానం. కాగా అంజు ప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు నివాళులు అర్పిస్తున్నారు. కాగా పీడీవీ ప్రసాద్.. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: మన యుద్ధం మనమే చేయాలి..) -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలను నిర్మించారు. శివప్రసాద్ రెడ్డి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. కేడీ చిత్రం సమయంలో నాగార్జునతో కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి -
సినీ పరిపూర్ణుడు
దాదాపుగా నూరేళ్ల కిందట ప్రాణం పోసుకున్న ఒక పసివాడు చిన్న కారణంగా ఇంట్లోంచి పారిపోయాడు. అన్నం కోసం అలమటించాడు. దొరికిన పనిచేశాడు. ఆకలి మాత్రమే అతడి ఆసక్తి. అదే అతణ్ని ఆఫీస్ బాయ్‌ని చేసింది, ఫైటర్ని చేసింది, డూపును చేసింది, ఫైట్మాస్టర్ని చేసింది, ప్రొడక్షన్ మేనేజర్‌ను చేసింది, నిర్మాతను చేసింది. మూకీల నుంచి చిత్రసీమ పరిణామ క్రమానికి ఒక విలువైన సాక్షిగా నిలబెట్టింది. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలాంటి శతాధిక చిత్రదర్శకులను సినీరంగానికి పరిచయం చేసిన ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ కె.రాఘవ సినిమా రంగానికి సంబంధించి ఒక పరిపూర్ణుడు. పరిపూర్ణమైన సినీ జీవితాన్ని అనుభవించి ఆయన వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన ‘సాక్షి’తో పంచుకున్న స్వగతం....... ‘‘కాకినాడ దగ్గరి కోటిపల్లి మా ఊరు. అదే మా ఇంటిపేరు కూడా. సాధారణ రైతు కుటుంబం. నాకు చదువు అబ్బలేదు. బడిలో చెప్పే పాఠం ఏమీ అర్థమయ్యేది కాదు. దాంతో దెబ్బలు పడేవి. కోపమొచ్చేసి, ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లుంటాయి. స్టేషన్లో కనబడిన రైలు ఎక్కేశాను. అది ఎటు పోతుందో తెలియదు. తీరా అది కలకత్తాలో ఆగింది. వీధులెంబడి పిచ్చివాడిలా తిరిగాను. భాష తెలియదు, మనుషులు తెలియదు, పైగా ఆకలి! నడుస్తూ నడుస్తూ ఒక ఎల్తైన బిల్డింగు గేటు దగ్గర ఆగాను. అది మోతీలాల్ చమేరియా స్టూడియో! ఆ రోజుల్లో మూకీ సినిమా తీయాలంటే డెబ్రీ కెమెరా వాడేవారు. దాన్ని తిప్పడానికి ‘ట్రాలీ పుల్లర్’ కావాలి. ఆ పనికి కుదిరాను. షూటింగుల సమయంలో భోజనం అక్కడే చేసేవాణ్ని. అలా రెండు మూడేళ్లు గడిచాయి. టాకీలు రానే వచ్చాయి మూకీల కాలం పోయి, టాకీలు వస్తాయని ప్రచారం జరుగుతుండేది. దీంతో అక్కడ పనిచేసేవాళ్లు తమ పనిపోతుందేమో అని భయపడేవారు. నేనూ అలాగే అనుకొని, మళ్లీ రైలెక్కేశాను మద్రాస్ వెళ్లిపోదాం, అక్కడైతే పని బాగా దొరుకుతుందని. కానీ టికెట్ లేని కారణంగా, మధ్యలోనే కొట్టి దించేశారు. చూస్తే బెజవాడ! ఇక్కడ పనేం దొరుకుతుంది? మారుతి థియేటర్ కనబడితే వెళ్లి చేరాను. కస్తూరి శివరావు నటుడు కాకమునుపు మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పని చేసేవారు. ఆయనకు నేను అసిస్టెంట్‌ని. హాల్లో మధ్యలో టేబులుంటుంది. పైన ఆయన, కింద నేను. దృశ్యాన్ని బట్టి ఆయన చెబుతుంటే, నేను అవసరమైనప్పుడల్లా గొంతు కలపాలి. ‘తందానతాన’ లాగ! ఏడాదికంతా ఒకే సినిమా ఆడేది. షోకు ఆయనకు పది రూపాయలిస్తే, అందులోంచి నాకు రెండో మూడో ఇచ్చేవారు. పరిచయం పెరిగాక, ‘రారా భోంచేద్దాం’ అనేవారు. కాలం గిర్రున తిరిగింది. టాకీలు రానే వచ్చాయి. బెజవాడలోనే రాజకుమారి ‘టాకీస్’ కొత్తగా ప్రారంభమైంది. మారుతి కూడా టాకీస్ అయ్యింది. దాంతో అనౌన్సరు అక్కర్లేకుండా పోయాడు. ఇక, అసిస్టెంటు ఏం చేస్తాడు? ఛలో మద్రాస్! తిప్పినవాళ్లంతా గొప్పవాళ్లయ్యారు కొన్నాళ్లు రఘుపతి వెంకయ్య నాయుడు ఆఫీసులో బాయ్‌గా పనిచేశాను. మరి కొన్నాళ్లు టంగుటూరి ప్రకాశం పంతులు కారు తుడిచాను. బతుకుదెరువులో భాగంగా ‘స్టంట్’ సోము, ‘స్టంట్’ స్వామినాథన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. కత్తి తిప్పడాలు సాధన చేశాను. కొన్ని సినిమాల్లో ఫైటర్స్‌లో ఒకడిగా ఉన్నాను. తర్వాత ఫైట్ మాస్టర్ అయ్యాను. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహిస్తున్న ‘పల్నాటి యుద్ధం’(1947) చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నప్పుడు, షూటింగ్ ఇంకా కొంచెం ఉందనగానే రామబ్రహ్మం గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎల్వీ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఆయనైతేనే మిగతా భాగానికి న్యాయం చేయగలరని అందరం అనుకున్నాం. అలా ఆయన దాన్ని పూర్తిచేశారు. ఈ దశలోనే మీర్జాపురం రాజా ‘మనదేశం’(1949) చిత్రాన్ని నిర్మించ తలపెట్టినప్పుడు దర్శకుడిగా ఎవరిని తీసుకుందాం అనే చర్చ వస్తే, ఎల్వీ ప్రసాద్ పేరు సూచించాను. ఆయనకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. ఇందులోనే ఒక చిన్న కానిస్టేబుల్ పాత్రకు ఒక యువకుడిని అనుకున్నారు. ‘రాఘవా! ఒక మనిషొస్తాడు, ఆయనకు మెడ్రాస్ తెలీదు, స్టేషన్‌కెళ్లి తీసుకురా,’ అన్నారు. అలా ఎన్టీ రామారావును సులభంగా గుర్తుపట్టి, సెంట్రల్ నుంచి ఆళ్వారుపేటకు 4వ నెంబరు బస్సులో తీసుకొచ్చాను. ఐద్రూపాయల అద్దెతో ఒక గుడిసె లాంటి గది చూసిపెట్టాను. అదీ చెల్లించడం కష్టమే అంటే టీవీ రాజు (అప్పటికి ఇంకా సంగీత దర్శకుడు కాలేదు)ను జతచేసి, చెరో రెండున్నర ఇచ్చుకునేట్టుగా ఏర్పాటుచేశాను. ‘పాతాళ భైరవి’(1951) సహా కేవీ రెడ్డి అన్ని చిత్రాలకు స్టంట్స్ సమకూర్చాను. దర్శకుడు పి.పుల్లయ్య కూడా స్టంట్‌మాస్టర్‌గా ఎంతో ప్రోత్సహించారు. చిన రాఘవ అని ఇంకొకాయన ఉండటంతో, ‘పోరాటాలు: పెద రాఘవ’ అని టైటిల్స్‌లో పడేది. ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు డూప్‌గా నటించాను. పద్మినీ పిక్చర్స్‌కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. వాళ్ల తరఫున శివాజీ గణేషన్ నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్’, ‘భలే పాండ్య’ తమిళ చిత్రాలతో పాటు హిందీలో షమ్మీ కపూర్ నటించిన ‘దిల్ తేరా దీవానా’ లాంటి సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించాను. ‘లవకుశ’కు రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించాను. పంపిణీదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పని! ఈ దశలోనే పాండిచ్చేరికి చెందిన (నిర్మాత ఎం.కె.రాధ చెల్లెలు) హంసారాణితో నా పెళ్లి జరిగింది. బాలచందర్ ప్రవేశం ‘రాఘవ చెప్తే శివాజీ గణేషన్ వింటాడు,’ అన్న నమ్మకంతో ఓసారి కె.బాలచందర్ నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన డ్రామా (మేజర్ చంద్రకాంత్) ఆ రాత్రి వేస్తున్నారు. అది శివాజీ చూడాలి. ఈయన ఒప్పుకున్నారు. వెళ్లాం. చూశాం. బ్రహ్మాండంగా ఉంది. ‘రాఘవా, దీని హక్కులు తీసుకో బాగా ఆడుతుంది’ అన్నారు శివాజీ. ఎంతివ్వొచ్చు? ఒక పదివేలు. అంత డబ్బు నా దగ్గర లేదు. వాళ్ల తమ్ముడు షణ్ముగంతో ఆయనే డబ్బిప్పించారు. ఈ మొత్తం తీసుకెళ్లి బాలచందర్ చేతిలో పెడితే ఆయనకు మతిపోయింది. అన్ని భాషల రైట్స్ నాకే ఇచ్చేశారు. ఇదే డ్రామాను మరో రోజు హిందీ నటుడు అశోక్‌కుమార్ చూశారు. హిందీలో తీయాలని నన్ను కలిశారు. శివాజీకి విషయం చెప్పాను. డబ్బు వాళ్లిచ్చిందే కదా! హిందీ వరకే నలభై వేలకు అమ్మేశాం. ఇప్పుడు అసలు సమస్యొచ్చింది. ఇంతలో ఏవీఎం వారు దాన్ని సినిమాగా తీయడానికి ముందుకొచ్చారు. ప్రధానమైన అంధుడి పాత్ర తనకిస్తే హక్కులు ఇచ్చేద్దామన్నారు శివాజీ. ఆయన్ని తీసుకోవడం ఎందుకో ఏవీఎం చెట్టియార్‌కు ఇష్టం లేదు. మంచి అవకాశం. బాలచందర్ టెన్షన్. ఆ పాత్ర ఆయనకే ఇస్తున్నట్టు శివాజీతో నమ్మబలికాం. తమిళం హక్కులు ఇచ్చేశాం. మేజర్ సుందరరాజన్ ఆ పాత్ర పోషించారు. సినిమా హిట్టయ్యింది. శివాజీకి విషయం తెలిశాక కోపం, తిట్లు మామూలే.ఆ సినిమానే ఎన్.ఎన్.భట్, ఏకామ్రేశ్వర్రావు తెలుగులో నిర్మిద్దామనుకుని, హక్కులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్నూ ఒక భాగస్వామిగా కలుపుకున్నారు. ‘ఎన్.ఎన్.భట్ ఫిలింస్’ పతాకంపై తెలుగులో సుఖ దుఃఖాలు(1967)గా వచ్చిన ఆ చిత్రమే నిర్మాతగా నా తొలి అడుగు. ఎస్వీయార్ ప్రధాన పాత్ర పోషించారు. చిన్న పాత్రలు వేస్తున్న వాణిశ్రీకి దీంతోనే బ్రేక్ వచ్చింది (‘ఇది మల్లెల వేళయనీ’). జగత్ హీరోలు ఎంజీఎం వారి ‘టార్జాన్ గోస్ టు ఇండియా’ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు నేను చూశాను. అందులో భాగంగా రోమ్ వెళ్లినప్పుడు, ‘డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘షుగర్ కోల్ట్’ లాంటి సినిమాలు చూశాను. వాటి స్ఫూర్తితో ఒక సినిమా తీద్దామనుకున్నాను. ఏకామ్రేశ్వర్రావు కూడా జత కలిశాడు. అలా ఫల్గుణా మూవీస్ బ్యానర్‌పై ‘జగత్ కిలాడీలు’(69) ప్రారంభించాం. ఐఎస్ మూర్తి దర్శకుడు. ఎస్వీయార్, వాణిశ్రీ, కృష్ణ నటించారు. తర్వాత శోభన్‌బాబుతో ‘జగజ్జెట్టీలు’ మొదలెట్టాం. దర్శకుడు నందన్‌రావు. ఈయన దగ్గర అసిస్టెంట్‌గా దాసరి నారాయణరావు ఉండేవాడు. 15 రోజుల్లో డైలాగ్స్ రాశాడు. అలా అతడు నా దృష్టిలో పడిపోయాడు. సినిమా కూడా హిట్టయ్యింది. తర్వాత, శోభన్‌బాబుతోనే ‘జగజ్జంత్రీలు’ (దర్శకుడు లక్ష్మీదీపక్) నిర్మించాం. వద్దంటే డబ్బు వచ్చి పడింది. నా కుమారుడి పేరు మీదుగా సొంతంగా ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించి దాసరికి అవకాశం ఇచ్చాను. తాత–మనవడు, రామయ్య కృష్ణయ్య ఎస్వీయార్, రాజబాబు ‘తాత–మనవడు’ తీశాం (1972). బాగా ఆడింది. తర్వాత దాసరే దర్శకుడిగా ‘సంసారం సాగరం’, ‘తూర్పు పడమర’ నిర్మించాను. నెమ్మదిగా దాసరి బిజీ అయిపోయాడు. ‘తూర్పు పడమర’ సినిమాకు కోడి రామకృష్ణ అప్రెంటిస్‌గా చేరాడు. అతనికి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(82) సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. 500 రోజులు ఆడుతూనే ఉంది. చిరంజీవి టాప్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత ‘తరంగిణి’ తీశా. కొత్తవాడు సుమన్‌ను తీసుకున్నాం. సినిమా ఏడాది ఆడింది. తర్వాత, సూర్యచంద్రులు, చదువు సంస్కారం, అంతులేని వింత కథ, త్రివేణి సంగమం, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం లాంటి చిత్రాలు నిర్మించాను. రాజశ్రీ, గుహనాథన్, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావు లాంటి దర్శకులను పరిచయం చేశాను. నెమ్మదిగా కె.రాఘవ అంటే ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికో... నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. జీవితం ఎటు తోస్తే అటు వెళ్లాను. డబ్బు వచ్చినా, నా బుద్ధి ఎటువైపూ మారలేదు. మద్యం, పొగ, కనీసం టీ కాఫీల జోలికి కూడా పోలేదు. వందేళ్ల వయసుకు వచ్చాను. ఫిలింనగర్ హౌజింగ్ సొసైటీలో మొదటి గృహప్రవేశం నేను చేశాను. మూకీల నుంచి సినిమా ప్రయాణాన్ని దగ్గరినుంచి చూశాను. రఘుపతి వెంకయ్య దగ్గర బాయ్‌గా పనిచేసినవాణ్ని ఆయన పేరు మీదుగా ఉన్న ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను తీసుకున్నాను. సంభాషణ: రాజిరెడ్డి రాఘవగారు ఓ డిక్షనరీ – కోడి రామకృష్ణ రాఘవగారంటే నాకెంతో అభిమానం. మా గురువుగారిని (దాసరి నారాయణరావు) దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత–మనవడు’ సినిమా తీశారాయన. ఆయన బ్యానర్లో ఓ సినిమా అయినా చేయాలన్నది నా డ్రీమ్. ‘తూర్పు– పడమర’ సినిమాకి రాఘవగారు నిర్మాత. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ షూటింగ్లో ఆయనతో చనువు ఏర్పడింది. నా డ్రీమ్ చేరుకోవాలన్న ప్రయత్నంలో సమయం కుదిరినప్పుడల్లా ఆయనకు కథలు చెబుతుండేవాణ్ని. ఓ రోజు నటులు నగేశ్గారికి డబ్బింగ్ చెప్పించాల్సి వచ్చింది. విమానం లేట్ కావడంతో నగేశ్గారు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లంతా వెళ్లిపోయారు. నేను డబ్బింగ్ చెప్పిస్తానని రాఘవగారికి చెప్పా. ‘సీనియర్లు లేకుండా నగేశ్గారితో డబ్బింగ్ చెప్పించడం కష్టం’ అన్నారు. నేను చెప్పిస్తానని నమ్మకంగా చెప్పా. 400 అడుగుల లూప్ డైలాగ్‌ని అనుకున్న టైమ్ కంటే గంట ముందే చెప్పించేశా. ‘నిన్ను డైరెక్టర్ని చేస్తానయ్యా’ అన్నారు రాఘవగారు. ఓ రోజు ఆఫీసుకి తీసుకెళ్లారు. ‘డైరెక్టర్ రూం’ అని బోర్డు ఉన్న గదిలోకి తీసుకెళ్లి, ‘ఇక్కడే.. దాసరిగారు కూర్చొని ‘తాత–మనవడు’ తీసి హిట్ కొట్టారు. నీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తున్నా. సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలి’ అన్నారు. ఏడాదిన్నరపాటు కథతో, ఆయనతో ట్రావెల్ చేసి, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీసి హిట్ కొట్టా. ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో రాఘవగారు ‘ఇండస్ట్రీకి ఇంత మంచి డైరెక్టర్ని ఇచ్చిన దాసరిగారికి రుణపడి ఉన్నా’ అన్నారు. రాఘవగారంటే యూనివర్శిటీ.. డిక్షనరీ. ఆయన పని చేస్తూ, చేయించే వారు. షూటింగ్లో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు. ఒక అనాథలా చెన్నై వచ్చారు కె.రాఘవగారు. లైట్ బోయ్ నుంచి కష్టపడి చాలా విభాగాల్లో పనిచేసి ఆఖరికి నిర్మాత అయ్యారు. వన్నాఫ్ ది లెజెండ్స్‌గా నిలిచిన దాసరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన గొప్ప నిర్మాత ఆయన. – కైకాల సత్యనారాయణ రాఘవగారి నిర్మాణంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో నటించాను. ఆయనతో నాకు విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనం రాఘవగారు. – మోహన్‌బాబు మూకీ, టాకీ, డిజిటల్ యుగం.. ఇలా సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులనూ చూసిన మహానుభావుడు. తల్లిదండ్రుల అండ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పైకి వచ్చిన వ్యక్తి. జీవితంలో అద్భుత విజయాలు సాధించారు. – ఆర్. నారాయణమూర్తి రాఘవగారు నిర్మించిన ‘తరంగణి’ ద్వారా నేను హీరోగా పరిచయం అయ్యాను. ఆయన నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, తమ్మారెడ్డి భరద్వాజగారిలాంటి వారి వల్లే నా జీవితం మంచి మలుపు తిరిగింది. సినిమా రంగం హైదరాబాద్ రావడంలో రాఘవగారి కృషి చాలా ఉంది. – సుమన్ -
రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి..
హైదరాబాద్: దాదాపు దశాబ్దకాలంపాటు (1970-1980) తెలుగు చిత్రసీమపై ఏడిద నాగేశ్వరరావు ప్రభావం అమోఘం. పూర్తిగా కళాభిరుచి ఉన్న సాంప్రదాయబద్ధమైన చిత్రాలను నిర్మించి విమర్శకులు ప్రశంసలను నాగేశ్వరరావు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషివంటి చిత్రాలు ఆయనకే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకే గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. పలు చిత్రాలు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతోపాటు నంది అవార్డులను కూడా సాధించాయి. అంతర్జాతీయ వేదికలపై ఆయన నిర్మించిన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. కొన్ని చిత్రాలు రష్యా భాషలోకి కూడా అనువాదం అయ్యాయి. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన చిత్ర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం సాగించి చివరకు సినిమా నిర్మాతగా మారారు. నిర్మాణ రంగం నుంచి వైదొలగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నంది అవార్డుల కమిటీ చైర్మన్‌గా, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. -
నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత
-
నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. 1934లో ఏప్రిల్ 24న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్ని.. ఆపద్బాంధవుడు (1992) స్వరకల్పన (1989) స్వయంకృషి (1987) సిరివెన్నెల (1986) స్వాతిముత్యం (1985) సాగర సంగమం (1983) సితార (1983) సీతాకోకచిలుక (1981) తాయారమ్మ బంగారయ్య (1979) శంకరాభరణం (1979) సిరిసిరిమువ్వ (1978) -
నిర్మాత వడ్డే రమేష్‌కు సినీ ప్రముఖుల నివాళి
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని శుక్రవారం సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. -
‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు!
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నళిని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నవీన్ వడ్డే హీరోగా ప్రేక్షకులకు సుపరిచితుడే. సినిమాల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానం, అభిరుచి కలిగిన వడ్డే రమేష్ తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ ఖ్యాతి గడించారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవితో లంకేశ్వరుడులాంటి సంచలన చిత్రాలు తీసి తెలుగు సినిమా వాణిజ్య స్థాయి పెరగడానికి దోహదపడ్డారు. హిందీ సినిమాతో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’ చిత్రాన్ని ‘సున్హేరా సంసార్’గా హిందీలో నిర్మించారు రమేష్. ఆయన మంచి సంగీత ప్రియుడు. అందునా నౌషాద్ సంగీతమంటే చెవి కోసుకునేవారు. అందుకే తన తొలి సినిమాకు సంగీత దర్శకునిగా నౌషాద్నే ఎంచుకున్నారు. సినిమాకు సంగీతాన్ని చేకూర్చడంలో నౌషాద్‌ది విభిన్నశైలి అని చెప్పేవారాయన. తెలుగులో రమేష్ నిర్మించిన తొలి సినిమా ‘పాడవోయి భారతీయుడా’. విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే సంస్థలో అక్కినేనితో ‘ఆత్మీయుడు’ తీశారు. వడ్డే రమేష్ అనగానే... ‘బొబ్బిలి పులి’ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి అద్భుతమైన శుభారంభాన్ని పలికిన సినిమా అది. ఆ రోజుల్లో ‘బొబ్బిలి పులి’ సృష్టించిన సంచలనం మాటలతో చెప్పలేనిది. రమేష్ ఎన్ని విజయవంతమైన సినిమాలు అందించినా... ‘బొబ్బిలి పులి’ నిర్మాతగానే ప్రేక్షకులు ఆయన్ను పిలుచుకుంటుంటారు. నిర్మాతగా వడ్డే రమేష్ కెరీర్లో మేలి మలుపు ‘కటకటాల రుద్రయ్య’. విజయమాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమా స్కోప్‌లో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు సంబంధించిన 24 శాఖలపై నిర్మాతకు కమాండ్ ఉండాలని, నిర్మాతకు నచ్చిందే తెరపైకి రావాలని గట్టిగా నమ్మేవారాయన. అదే అనుసరించేవారు కూడా. ‘కటకటాల రుద్రయ్య’ క్లైమాక్స్ విషయంలో దాసరితోనే ఆయన విభేదించారు. తర్వాత దాసరి మరో క్లైమాక్స్ చేశారు. దాసరి సన్నిహిత బృందంలో ఆయన కీలక సభ్యుడు. ఆయన కెరీర్లో బ్లాక్‌బస్టర్స్ అనదగ్గ సినిమాలన్నీ దాసరి దర్శకత్వం వహించినవే కావడం విశేషం. దాసరి వందవ చిత్రం ‘లంకేశ్వరుడు’కి వడ్డే రమేషే నిర్మాత. క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మకొడుకు’ చిత్రానికి కూడా నిర్మాత వడ్డేనే. ఇంకా కలహాల కాపురం, తిరుగుబాటు, దుర్గాదేవి, సుర్‌సంగం(హిందీ), ఏడుకొండలస్వామి, లవ్‌స్టోరి-99, కల్పన, క్రాంతి తదితర చిత్రాలను నిర్మించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు నిజంగా తీరని లోటే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వడ్డే రమేష్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరగనున్నాయి.