‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు! | Telugu producer Vadde Ramesh passes away | Sakshi
Sakshi News home page

‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు!

Published Fri, Nov 22 2013 1:07 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు! - Sakshi

‘బొబ్బిలి పులి’ నిర్మాత వడ్డే రమేష్ ఇక లేరు!

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నళిని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నవీన్ వడ్డే హీరోగా ప్రేక్షకులకు సుపరిచితుడే. సినిమాల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానం, అభిరుచి కలిగిన వడ్డే రమేష్ తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ ఖ్యాతి గడించారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవితో లంకేశ్వరుడులాంటి సంచలన చిత్రాలు తీసి తెలుగు సినిమా వాణిజ్య స్థాయి పెరగడానికి దోహదపడ్డారు.
 
 హిందీ సినిమాతో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’ చిత్రాన్ని ‘సున్హేరా సంసార్’గా హిందీలో నిర్మించారు రమేష్. ఆయన మంచి సంగీత ప్రియుడు. అందునా నౌషాద్ సంగీతమంటే చెవి కోసుకునేవారు. అందుకే తన తొలి సినిమాకు సంగీత దర్శకునిగా నౌషాద్‌నే ఎంచుకున్నారు. సినిమాకు సంగీతాన్ని చేకూర్చడంలో నౌషాద్‌ది విభిన్నశైలి అని చెప్పేవారాయన. తెలుగులో రమేష్ నిర్మించిన తొలి సినిమా ‘పాడవోయి భారతీయుడా’. విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే సంస్థలో అక్కినేనితో ‘ఆత్మీయుడు’ తీశారు.
 వడ్డే రమేష్  అనగానే... ‘బొబ్బిలి పులి’ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి అద్భుతమైన శుభారంభాన్ని పలికిన సినిమా అది. ఆ రోజుల్లో ‘బొబ్బిలి పులి’ సృష్టించిన సంచలనం మాటలతో చెప్పలేనిది. రమేష్ ఎన్ని విజయవంతమైన సినిమాలు అందించినా... ‘బొబ్బిలి పులి’ నిర్మాతగానే ప్రేక్షకులు ఆయన్ను పిలుచుకుంటుంటారు. 
 
 నిర్మాతగా వడ్డే రమేష్ కెరీర్‌లో మేలి మలుపు ‘కటకటాల రుద్రయ్య’. విజయమాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమా స్కోప్‌లో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు సంబంధించిన 24 శాఖలపై నిర్మాతకు కమాండ్ ఉండాలని, నిర్మాతకు నచ్చిందే తెరపైకి రావాలని గట్టిగా నమ్మేవారాయన. అదే అనుసరించేవారు కూడా. ‘కటకటాల రుద్రయ్య’ క్లైమాక్స్ విషయంలో దాసరితోనే ఆయన విభేదించారు. తర్వాత దాసరి మరో క్లైమాక్స్ చేశారు. దాసరి సన్నిహిత బృందంలో ఆయన కీలక సభ్యుడు. ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ అనదగ్గ సినిమాలన్నీ దాసరి దర్శకత్వం వహించినవే కావడం విశేషం.
 
  దాసరి వందవ చిత్రం ‘లంకేశ్వరుడు’కి వడ్డే రమేషే నిర్మాత. క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మకొడుకు’ చిత్రానికి కూడా నిర్మాత వడ్డేనే. ఇంకా కలహాల కాపురం, తిరుగుబాటు, దుర్గాదేవి, సుర్‌సంగం(హిందీ), ఏడుకొండలస్వామి, లవ్‌స్టోరి-99, కల్పన, క్రాంతి తదితర చిత్రాలను నిర్మించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు నిజంగా తీరని లోటే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వడ్డే రమేష్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరగనున్నాయి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement