రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి..
హైదరాబాద్: దాదాపు దశాబ్దకాలంపాటు (1970-1980) తెలుగు చిత్రసీమపై ఏడిద నాగేశ్వరరావు ప్రభావం అమోఘం. పూర్తిగా కళాభిరుచి ఉన్న సాంప్రదాయబద్ధమైన చిత్రాలను నిర్మించి విమర్శకులు ప్రశంసలను నాగేశ్వరరావు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషివంటి చిత్రాలు ఆయనకే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకే గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. పలు చిత్రాలు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతోపాటు నంది అవార్డులను కూడా సాధించాయి.
అంతర్జాతీయ వేదికలపై ఆయన నిర్మించిన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. కొన్ని చిత్రాలు రష్యా భాషలోకి కూడా అనువాదం అయ్యాయి. రంగస్థల నటుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన చిత్ర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం సాగించి చివరకు సినిమా నిర్మాతగా మారారు. నిర్మాణ రంగం నుంచి వైదొలగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నంది అవార్డుల కమిటీ చైర్మన్గా, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.