Kotipalli raghava
-
అమ్మ పోయాక నాన్న కుంగిపోయారు
‘‘నాన్న జీవితం ఎంతో ఆదర్శం. కష్టడినవాళ్లకు ప్రతిఫలం దక్కుతుందనడానికి ఆయన ఓ ఉదాహరణ’’ అన్నారు రాఘవ కుమార్తె ప్రశాంతి. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారామె. ► రాఘవగారు ఇంత సడన్ గా దూరమవుతారని ఎవరూ ఊహించలేదు? నాన్న శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ అమ్మ చనిపోయాక మానసికంగా కుంగిపోయారు. మొన్న మార్చి 23న అమ్మ చనిపోయారు. అమ్మానాన్నలది 60 ఏళ్ల అనుబంధం. ‘హంసా’ (రాఘవ సతీమణి) అని పిలిచేవారు. ‘నా హంసాకి ఏమీ జరగదు. నేనున్నంత వరకూ నాతోనే ఉంటుంది’ అనే ఫీలింగ్‌తో ఉండేవారు. ► జీవితంలో చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి రాఘ వగారు. భార్యాపిల్లలను బాగా చూసుకునేవారా? నన్ను, అన్నయ్యను బాగా పెంచారు. నా వయసిప్పుడు 43. నా లైఫ్‌లో మా అమ్మ రెండు సార్లు మాత్రమే ఏడవడం చూశాను. మమ్మల్ని నాన్న అంత బాగా చూసుకున్నారు. ► 105ఏళ్ల రాఘవగారి ఆరోగ్య రహస్యం ఏంటి? అమ్మ వంటే కారణం. ► చివరి రోజుల్లో మీ నాన్నగారు ఎలా ఉండేవారు? అమ్మ పిలుస్తున్నట్లు నాన్నకు అనిపించిందని నా ఫీలింగ్. ఆయన బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేసినా మేం వదల్లేదు. కాపలా కాసేవాళ్లం. అయితే మొన్నా మధ్య తెల్లవారుజాము 4.30 గంటలకు బయటకు వెళ్లారు. కింద పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చేర్చాం. ఆ గాయంకన్నా కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ కాలేదు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. నాన్న లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. -
జగత్’ నిర్మాత రాఘవ కన్నుమూత
ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ (105) ఇక లేరు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 1913 డిసెంబర్ 9న జన్మించిన రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రాఘవకు ఆరుగురు తోడబుట్టినవాళ్లు. రాఘవకు చదువు అబ్బలేదు. ఇంటి నుంచి కోల్‌కతా పారిపోయారు. అక్కణ్ణుంచి మద్రాస్, హైదరాబాద్.. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు. మూకీ చిత్రాల నుంచి టాకీ వరకూ రాఘవ అన్ని మార్పులనూ చూశారు. ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, స్టంట్ అసిస్టెంట్‌గా, స్టంట్ మాస్టర్‌గా చేశారు. చివరికి నిర్మాతగా మారారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావు గోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమ¯Œ , భానుచందర్‌లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ది. ఆయన నిర్మించినవాటిలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జంత్రీలు’, ‘జగత్ జెట్టీలు’ సినిమాలున్నాయి. అందుకే ఆయన్ను ‘జగత్ నిర్మాత’ అనేవాళ్లు. రాఘవ పరిచయం చేసిన దాసరి, కోడి రామకృష్ణ శతాధిక చిత్రాల దర్శకులు కావడం విశేషం. నిర్మాతగా మాత్రమే కాకుండా సినిమా రంగంలో వివిధ బాధ్యతలు చేపట్టారాయన. 1975 నుంచి 1982 వరకూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫౌండర్ మెంబర్‌గానూ, కోశాధికారిగానూ వ్యవహరించారు. 1991 నుంచి 2001 వరకూ కార్యనిర్వాహక సభ్యుడిగా చేశారు. సోలో నిర్మాతగా మారి, రాఘవ నిర్మించిన ‘తాత–మనవడు’కి నంది అవార్డు లభించింది. అలాగే, ‘సంసారం–సాగరం’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు దక్కింది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు దగ్గర ఆఫీస్ బాయ్‌గా చేసిన రాఘవ తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు దక్కించుకోవడం విశేషం. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. రాఘవ భార్య హంసారాణి ఈ ఏడాది మార్చి 23న మరణించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ప్రతాప్, కుమార్తె ప్రశాంతి ఉన్నారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో బుధవారం రాఘవ అంత్యక్రియలు జరగనున్నాయి. రాఘవ మరణం పట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు రాఘవ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
సినీ పరిపూర్ణుడు
దాదాపుగా నూరేళ్ల కిందట ప్రాణం పోసుకున్న ఒక పసివాడు చిన్న కారణంగా ఇంట్లోంచి పారిపోయాడు. అన్నం కోసం అలమటించాడు. దొరికిన పనిచేశాడు. ఆకలి మాత్రమే అతడి ఆసక్తి. అదే అతణ్ని ఆఫీస్ బాయ్‌ని చేసింది, ఫైటర్ని చేసింది, డూపును చేసింది, ఫైట్మాస్టర్ని చేసింది, ప్రొడక్షన్ మేనేజర్‌ను చేసింది, నిర్మాతను చేసింది. మూకీల నుంచి చిత్రసీమ పరిణామ క్రమానికి ఒక విలువైన సాక్షిగా నిలబెట్టింది. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలాంటి శతాధిక చిత్రదర్శకులను సినీరంగానికి పరిచయం చేసిన ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ కె.రాఘవ సినిమా రంగానికి సంబంధించి ఒక పరిపూర్ణుడు. పరిపూర్ణమైన సినీ జీవితాన్ని అనుభవించి ఆయన వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన ‘సాక్షి’తో పంచుకున్న స్వగతం....... ‘‘కాకినాడ దగ్గరి కోటిపల్లి మా ఊరు. అదే మా ఇంటిపేరు కూడా. సాధారణ రైతు కుటుంబం. నాకు చదువు అబ్బలేదు. బడిలో చెప్పే పాఠం ఏమీ అర్థమయ్యేది కాదు. దాంతో దెబ్బలు పడేవి. కోపమొచ్చేసి, ఇంట్లోంచి పారిపోదామనుకున్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లుంటాయి. స్టేషన్లో కనబడిన రైలు ఎక్కేశాను. అది ఎటు పోతుందో తెలియదు. తీరా అది కలకత్తాలో ఆగింది. వీధులెంబడి పిచ్చివాడిలా తిరిగాను. భాష తెలియదు, మనుషులు తెలియదు, పైగా ఆకలి! నడుస్తూ నడుస్తూ ఒక ఎల్తైన బిల్డింగు గేటు దగ్గర ఆగాను. అది మోతీలాల్ చమేరియా స్టూడియో! ఆ రోజుల్లో మూకీ సినిమా తీయాలంటే డెబ్రీ కెమెరా వాడేవారు. దాన్ని తిప్పడానికి ‘ట్రాలీ పుల్లర్’ కావాలి. ఆ పనికి కుదిరాను. షూటింగుల సమయంలో భోజనం అక్కడే చేసేవాణ్ని. అలా రెండు మూడేళ్లు గడిచాయి. టాకీలు రానే వచ్చాయి మూకీల కాలం పోయి, టాకీలు వస్తాయని ప్రచారం జరుగుతుండేది. దీంతో అక్కడ పనిచేసేవాళ్లు తమ పనిపోతుందేమో అని భయపడేవారు. నేనూ అలాగే అనుకొని, మళ్లీ రైలెక్కేశాను మద్రాస్ వెళ్లిపోదాం, అక్కడైతే పని బాగా దొరుకుతుందని. కానీ టికెట్ లేని కారణంగా, మధ్యలోనే కొట్టి దించేశారు. చూస్తే బెజవాడ! ఇక్కడ పనేం దొరుకుతుంది? మారుతి థియేటర్ కనబడితే వెళ్లి చేరాను. కస్తూరి శివరావు నటుడు కాకమునుపు మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పని చేసేవారు. ఆయనకు నేను అసిస్టెంట్‌ని. హాల్లో మధ్యలో టేబులుంటుంది. పైన ఆయన, కింద నేను. దృశ్యాన్ని బట్టి ఆయన చెబుతుంటే, నేను అవసరమైనప్పుడల్లా గొంతు కలపాలి. ‘తందానతాన’ లాగ! ఏడాదికంతా ఒకే సినిమా ఆడేది. షోకు ఆయనకు పది రూపాయలిస్తే, అందులోంచి నాకు రెండో మూడో ఇచ్చేవారు. పరిచయం పెరిగాక, ‘రారా భోంచేద్దాం’ అనేవారు. కాలం గిర్రున తిరిగింది. టాకీలు రానే వచ్చాయి. బెజవాడలోనే రాజకుమారి ‘టాకీస్’ కొత్తగా ప్రారంభమైంది. మారుతి కూడా టాకీస్ అయ్యింది. దాంతో అనౌన్సరు అక్కర్లేకుండా పోయాడు. ఇక, అసిస్టెంటు ఏం చేస్తాడు? ఛలో మద్రాస్! తిప్పినవాళ్లంతా గొప్పవాళ్లయ్యారు కొన్నాళ్లు రఘుపతి వెంకయ్య నాయుడు ఆఫీసులో బాయ్‌గా పనిచేశాను. మరి కొన్నాళ్లు టంగుటూరి ప్రకాశం పంతులు కారు తుడిచాను. బతుకుదెరువులో భాగంగా ‘స్టంట్’ సోము, ‘స్టంట్’ స్వామినాథన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. కత్తి తిప్పడాలు సాధన చేశాను. కొన్ని సినిమాల్లో ఫైటర్స్‌లో ఒకడిగా ఉన్నాను. తర్వాత ఫైట్ మాస్టర్ అయ్యాను. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహిస్తున్న ‘పల్నాటి యుద్ధం’(1947) చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నప్పుడు, షూటింగ్ ఇంకా కొంచెం ఉందనగానే రామబ్రహ్మం గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎల్వీ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఆయనైతేనే మిగతా భాగానికి న్యాయం చేయగలరని అందరం అనుకున్నాం. అలా ఆయన దాన్ని పూర్తిచేశారు. ఈ దశలోనే మీర్జాపురం రాజా ‘మనదేశం’(1949) చిత్రాన్ని నిర్మించ తలపెట్టినప్పుడు దర్శకుడిగా ఎవరిని తీసుకుందాం అనే చర్చ వస్తే, ఎల్వీ ప్రసాద్ పేరు సూచించాను. ఆయనకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. ఇందులోనే ఒక చిన్న కానిస్టేబుల్ పాత్రకు ఒక యువకుడిని అనుకున్నారు. ‘రాఘవా! ఒక మనిషొస్తాడు, ఆయనకు మెడ్రాస్ తెలీదు, స్టేషన్‌కెళ్లి తీసుకురా,’ అన్నారు. అలా ఎన్టీ రామారావును సులభంగా గుర్తుపట్టి, సెంట్రల్ నుంచి ఆళ్వారుపేటకు 4వ నెంబరు బస్సులో తీసుకొచ్చాను. ఐద్రూపాయల అద్దెతో ఒక గుడిసె లాంటి గది చూసిపెట్టాను. అదీ చెల్లించడం కష్టమే అంటే టీవీ రాజు (అప్పటికి ఇంకా సంగీత దర్శకుడు కాలేదు)ను జతచేసి, చెరో రెండున్నర ఇచ్చుకునేట్టుగా ఏర్పాటుచేశాను. ‘పాతాళ భైరవి’(1951) సహా కేవీ రెడ్డి అన్ని చిత్రాలకు స్టంట్స్ సమకూర్చాను. దర్శకుడు పి.పుల్లయ్య కూడా స్టంట్‌మాస్టర్‌గా ఎంతో ప్రోత్సహించారు. చిన రాఘవ అని ఇంకొకాయన ఉండటంతో, ‘పోరాటాలు: పెద రాఘవ’ అని టైటిల్స్‌లో పడేది. ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు డూప్‌గా నటించాను. పద్మినీ పిక్చర్స్‌కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. వాళ్ల తరఫున శివాజీ గణేషన్ నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్’, ‘భలే పాండ్య’ తమిళ చిత్రాలతో పాటు హిందీలో షమ్మీ కపూర్ నటించిన ‘దిల్ తేరా దీవానా’ లాంటి సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించాను. ‘లవకుశ’కు రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించాను. పంపిణీదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పని! ఈ దశలోనే పాండిచ్చేరికి చెందిన (నిర్మాత ఎం.కె.రాధ చెల్లెలు) హంసారాణితో నా పెళ్లి జరిగింది. బాలచందర్ ప్రవేశం ‘రాఘవ చెప్తే శివాజీ గణేషన్ వింటాడు,’ అన్న నమ్మకంతో ఓసారి కె.బాలచందర్ నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన డ్రామా (మేజర్ చంద్రకాంత్) ఆ రాత్రి వేస్తున్నారు. అది శివాజీ చూడాలి. ఈయన ఒప్పుకున్నారు. వెళ్లాం. చూశాం. బ్రహ్మాండంగా ఉంది. ‘రాఘవా, దీని హక్కులు తీసుకో బాగా ఆడుతుంది’ అన్నారు శివాజీ. ఎంతివ్వొచ్చు? ఒక పదివేలు. అంత డబ్బు నా దగ్గర లేదు. వాళ్ల తమ్ముడు షణ్ముగంతో ఆయనే డబ్బిప్పించారు. ఈ మొత్తం తీసుకెళ్లి బాలచందర్ చేతిలో పెడితే ఆయనకు మతిపోయింది. అన్ని భాషల రైట్స్ నాకే ఇచ్చేశారు. ఇదే డ్రామాను మరో రోజు హిందీ నటుడు అశోక్‌కుమార్ చూశారు. హిందీలో తీయాలని నన్ను కలిశారు. శివాజీకి విషయం చెప్పాను. డబ్బు వాళ్లిచ్చిందే కదా! హిందీ వరకే నలభై వేలకు అమ్మేశాం. ఇప్పుడు అసలు సమస్యొచ్చింది. ఇంతలో ఏవీఎం వారు దాన్ని సినిమాగా తీయడానికి ముందుకొచ్చారు. ప్రధానమైన అంధుడి పాత్ర తనకిస్తే హక్కులు ఇచ్చేద్దామన్నారు శివాజీ. ఆయన్ని తీసుకోవడం ఎందుకో ఏవీఎం చెట్టియార్‌కు ఇష్టం లేదు. మంచి అవకాశం. బాలచందర్ టెన్షన్. ఆ పాత్ర ఆయనకే ఇస్తున్నట్టు శివాజీతో నమ్మబలికాం. తమిళం హక్కులు ఇచ్చేశాం. మేజర్ సుందరరాజన్ ఆ పాత్ర పోషించారు. సినిమా హిట్టయ్యింది. శివాజీకి విషయం తెలిశాక కోపం, తిట్లు మామూలే.ఆ సినిమానే ఎన్.ఎన్.భట్, ఏకామ్రేశ్వర్రావు తెలుగులో నిర్మిద్దామనుకుని, హక్కులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్నూ ఒక భాగస్వామిగా కలుపుకున్నారు. ‘ఎన్.ఎన్.భట్ ఫిలింస్’ పతాకంపై తెలుగులో సుఖ దుఃఖాలు(1967)గా వచ్చిన ఆ చిత్రమే నిర్మాతగా నా తొలి అడుగు. ఎస్వీయార్ ప్రధాన పాత్ర పోషించారు. చిన్న పాత్రలు వేస్తున్న వాణిశ్రీకి దీంతోనే బ్రేక్ వచ్చింది (‘ఇది మల్లెల వేళయనీ’). జగత్ హీరోలు ఎంజీఎం వారి ‘టార్జాన్ గోస్ టు ఇండియా’ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు నేను చూశాను. అందులో భాగంగా రోమ్ వెళ్లినప్పుడు, ‘డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘షుగర్ కోల్ట్’ లాంటి సినిమాలు చూశాను. వాటి స్ఫూర్తితో ఒక సినిమా తీద్దామనుకున్నాను. ఏకామ్రేశ్వర్రావు కూడా జత కలిశాడు. అలా ఫల్గుణా మూవీస్ బ్యానర్‌పై ‘జగత్ కిలాడీలు’(69) ప్రారంభించాం. ఐఎస్ మూర్తి దర్శకుడు. ఎస్వీయార్, వాణిశ్రీ, కృష్ణ నటించారు. తర్వాత శోభన్‌బాబుతో ‘జగజ్జెట్టీలు’ మొదలెట్టాం. దర్శకుడు నందన్‌రావు. ఈయన దగ్గర అసిస్టెంట్‌గా దాసరి నారాయణరావు ఉండేవాడు. 15 రోజుల్లో డైలాగ్స్ రాశాడు. అలా అతడు నా దృష్టిలో పడిపోయాడు. సినిమా కూడా హిట్టయ్యింది. తర్వాత, శోభన్‌బాబుతోనే ‘జగజ్జంత్రీలు’ (దర్శకుడు లక్ష్మీదీపక్) నిర్మించాం. వద్దంటే డబ్బు వచ్చి పడింది. నా కుమారుడి పేరు మీదుగా సొంతంగా ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించి దాసరికి అవకాశం ఇచ్చాను. తాత–మనవడు, రామయ్య కృష్ణయ్య ఎస్వీయార్, రాజబాబు ‘తాత–మనవడు’ తీశాం (1972). బాగా ఆడింది. తర్వాత దాసరే దర్శకుడిగా ‘సంసారం సాగరం’, ‘తూర్పు పడమర’ నిర్మించాను. నెమ్మదిగా దాసరి బిజీ అయిపోయాడు. ‘తూర్పు పడమర’ సినిమాకు కోడి రామకృష్ణ అప్రెంటిస్‌గా చేరాడు. అతనికి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(82) సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. 500 రోజులు ఆడుతూనే ఉంది. చిరంజీవి టాప్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత ‘తరంగిణి’ తీశా. కొత్తవాడు సుమన్‌ను తీసుకున్నాం. సినిమా ఏడాది ఆడింది. తర్వాత, సూర్యచంద్రులు, చదువు సంస్కారం, అంతులేని వింత కథ, త్రివేణి సంగమం, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం లాంటి చిత్రాలు నిర్మించాను. రాజశ్రీ, గుహనాథన్, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావు లాంటి దర్శకులను పరిచయం చేశాను. నెమ్మదిగా కె.రాఘవ అంటే ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికో... నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. జీవితం ఎటు తోస్తే అటు వెళ్లాను. డబ్బు వచ్చినా, నా బుద్ధి ఎటువైపూ మారలేదు. మద్యం, పొగ, కనీసం టీ కాఫీల జోలికి కూడా పోలేదు. వందేళ్ల వయసుకు వచ్చాను. ఫిలింనగర్ హౌజింగ్ సొసైటీలో మొదటి గృహప్రవేశం నేను చేశాను. మూకీల నుంచి సినిమా ప్రయాణాన్ని దగ్గరినుంచి చూశాను. రఘుపతి వెంకయ్య దగ్గర బాయ్‌గా పనిచేసినవాణ్ని ఆయన పేరు మీదుగా ఉన్న ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను తీసుకున్నాను. సంభాషణ: రాజిరెడ్డి రాఘవగారు ఓ డిక్షనరీ – కోడి రామకృష్ణ రాఘవగారంటే నాకెంతో అభిమానం. మా గురువుగారిని (దాసరి నారాయణరావు) దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత–మనవడు’ సినిమా తీశారాయన. ఆయన బ్యానర్లో ఓ సినిమా అయినా చేయాలన్నది నా డ్రీమ్. ‘తూర్పు– పడమర’ సినిమాకి రాఘవగారు నిర్మాత. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ షూటింగ్లో ఆయనతో చనువు ఏర్పడింది. నా డ్రీమ్ చేరుకోవాలన్న ప్రయత్నంలో సమయం కుదిరినప్పుడల్లా ఆయనకు కథలు చెబుతుండేవాణ్ని. ఓ రోజు నటులు నగేశ్గారికి డబ్బింగ్ చెప్పించాల్సి వచ్చింది. విమానం లేట్ కావడంతో నగేశ్గారు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లంతా వెళ్లిపోయారు. నేను డబ్బింగ్ చెప్పిస్తానని రాఘవగారికి చెప్పా. ‘సీనియర్లు లేకుండా నగేశ్గారితో డబ్బింగ్ చెప్పించడం కష్టం’ అన్నారు. నేను చెప్పిస్తానని నమ్మకంగా చెప్పా. 400 అడుగుల లూప్ డైలాగ్‌ని అనుకున్న టైమ్ కంటే గంట ముందే చెప్పించేశా. ‘నిన్ను డైరెక్టర్ని చేస్తానయ్యా’ అన్నారు రాఘవగారు. ఓ రోజు ఆఫీసుకి తీసుకెళ్లారు. ‘డైరెక్టర్ రూం’ అని బోర్డు ఉన్న గదిలోకి తీసుకెళ్లి, ‘ఇక్కడే.. దాసరిగారు కూర్చొని ‘తాత–మనవడు’ తీసి హిట్ కొట్టారు. నీకు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తున్నా. సిల్వర్ జూబ్లీ సినిమా తీయాలి’ అన్నారు. ఏడాదిన్నరపాటు కథతో, ఆయనతో ట్రావెల్ చేసి, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీసి హిట్ కొట్టా. ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో రాఘవగారు ‘ఇండస్ట్రీకి ఇంత మంచి డైరెక్టర్ని ఇచ్చిన దాసరిగారికి రుణపడి ఉన్నా’ అన్నారు. రాఘవగారంటే యూనివర్శిటీ.. డిక్షనరీ. ఆయన పని చేస్తూ, చేయించే వారు. షూటింగ్లో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు. ఒక అనాథలా చెన్నై వచ్చారు కె.రాఘవగారు. లైట్ బోయ్ నుంచి కష్టపడి చాలా విభాగాల్లో పనిచేసి ఆఖరికి నిర్మాత అయ్యారు. వన్నాఫ్ ది లెజెండ్స్‌గా నిలిచిన దాసరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన గొప్ప నిర్మాత ఆయన. – కైకాల సత్యనారాయణ రాఘవగారి నిర్మాణంలో వచ్చిన ‘తూర్పు పడమర’లో నటించాను. ఆయనతో నాకు విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనం రాఘవగారు. – మోహన్‌బాబు మూకీ, టాకీ, డిజిటల్ యుగం.. ఇలా సినిమా రంగంలో వచ్చిన అన్ని మార్పులనూ చూసిన మహానుభావుడు. తల్లిదండ్రుల అండ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పైకి వచ్చిన వ్యక్తి. జీవితంలో అద్భుత విజయాలు సాధించారు. – ఆర్. నారాయణమూర్తి రాఘవగారు నిర్మించిన ‘తరంగణి’ ద్వారా నేను హీరోగా పరిచయం అయ్యాను. ఆయన నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, తమ్మారెడ్డి భరద్వాజగారిలాంటి వారి వల్లే నా జీవితం మంచి మలుపు తిరిగింది. సినిమా రంగం హైదరాబాద్ రావడంలో రాఘవగారి కృషి చాలా ఉంది. – సుమన్ -
‘నన్ను ఆదుకొని, అన్నం పెట్టింది రాఘవ గారే’
సాక్షి, హైదరాబాద్ : ఈ రోజు ఉదయం మృతి చెందిన నిర్మాత రాఘవ భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి, రాఘవతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా బతుకు ప్లాట్ ఫాం మీద పడ్డప్పుడు నన్ను ఆదుకొని అన్నం పెట్టింది రాఘవ గారే. తల్లిదండ్రులు అండ లేకుండానే సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. మూకీ సినిమా నుంచి డిజిటల్ యుగం వరకు సినీ రంగంలోని అన్ని మార్పులు చూసిన మహానుభావుడు. చిత్ర పరిశ్రమ రాఘవగారిని సముచితంగా గౌరవించి అంత్యక్రియలు జరపాల’ని కోరారు. ‘మహా మనిషి కే రాఘవ గారు సామాజిక మార్పు కోసం ఎన్నో చిత్రాలు అందించారు. ఆయన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. వందేళ్ల వయస్సులోనూ కేబీఆర్ పార్క్‌లో మాతో పాటు వాకింగ్ చేసేవారు’ అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నిర్మాత ఆదిశేషగిరి రావు, నటుడు సుమన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతిలు ఉన్నారు. మరిన్ని కథనాలు.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత నన్ను కొడుకులా చూసుకున్నారు : సుమన్ -
ఆయనలేని లోటు పూడ్చలేనిది
-
నన్ను కొడుకులా చూసుకున్నారు : సుమన్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినీ రంగంలో భీష్ముడిగా పేరు తెచ్చుకున్న లెజెండరీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఈ రోజు ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని రాఘవ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లక్ష్మీపార్వతి, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, సుమన్‌లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ.. ‘రాఘవగారి నిర్మాణంలో తెరకెక్కిన తరంగిణి సినిమా వెయ్యి రోజుల పాటు ఆడింది. ఆయన నన్ను కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, భరద్వాజగారి లాంటి వారి సహకారం వల్లే నా జీవితం మలుపు తిరిగింది. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో రాఘవగారు కృషి ఎంతో ఉంది. ఆయనలేని లోటు పూడ్చలేనిది’ అన్నారు. అందరు అభిమానించే రాఘవగారు జీవితం ఆదర్శవంతమని, ఆయన అలవాట్లే 105 సంవత్సరాలు బతికించాయని లక్ష్మీపార్వతి అన్నారు. వాకింగ్‌లో రాఘవగారు కలుస్తుండేవారని, ఆయన అనుభవాలను తమతో పంచుకునేవారని తెలిపారు. ప్రముఖ సినీ నిర్మాత కే రాఘవ కన్నుమూత -
ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ కన్నుమూత
-
ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఇకలేరు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన వయసు 105 సంవత్సరాలు. 1913 డిసెంబర్ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. తొలి తెలుగు సినిమా 1931లో నిర్మాణం జరుపుకోగా అంతకు ముందే ఆయన సినీరంగంలో అడుగుపెట్టారు. కొల్కతాలో సినిమా షూటింగ్లలో ట్రాలీ పుల్లర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవ ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా ఎదిగారు. సినిమా రంగంలో చోటు చేసుకున్న అన్ని మార్పులను ఆయన దగ్గరుండి చూశారు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో గొడవ పడి కొల్కతా వెళ్లిపోయిన రాఘవ, సైలెంట్ పిక్చర్స్‌లో ట్రాలీపుల్లర్గా చేరారు. తరువాత విజయవాడలోని మారుతి టాకీస్‌లో కొంత కాలం పనిచేశారు. తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య ఆఫీస్‌లో బాయ్‌గానూ కొంతకాలం పనిచేశారు. మిర్జాపురం రాజా వారు సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయనకు సహాయకుడిగా చేరారు. రాజా వారి నిర్మాణంలో తెరకెక్కిన పల్నాటి యుద్ధం సినిమా క్లైమాక్స్ దశలో చిత్ర దర్శకుడు మరణించటంతో ఎల్వీ ప్రసాద్‌కు తొలిసారిగా దర్శకుడిగా అవకావం ఇప్పించారు. పాతాలభైరవి సినిమాలోని పోరాట సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. తరువాత కొంత కాలం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన రాఘవ నిర్మాతగా మారారు. సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్, భానుచందర్‌లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
సినీ ‘మహాప్రస్థానం’
ఎటు వెళ్తున్నాడో.. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కాకినాడ నుంచి కలకత్తాకు చేరాడు. కడుపు నింపుకునేందుకు పనికోసం తిరిగాడు. చిత్రరంగంలో బాయ్‌గా కుదిరాడు. అలా మొదలైన ఆయన పయనం సినిమా నిర్మించే స్థాయికి చేరుకుంది. జగత్కిలాడీలు, తాతా మనవుడు, ఇంట్లోరామయ్య.. వీధిలో కృష్ణయ్య తదితర హిట్ చిత్రాలను అందించారు. చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ నగరానికి తరలివ చ్చినప్పుడు ఫిల్మ్‌నగర్‌లో తొలిగా ఇల్లు కట్టి నూతన చిత్ర సామ్రాజ్యానికి బాటలు వేశారు. ఆయనే కోటిపల్లి రాఘవ. నూటొక్క ఏళ్ల కుర్రాడు. ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం లెజెండ్. ఆ సినీ‘మహా’ప్రస్థానం ఆయన మాటల్లోనే.. కాకినాడ దగ్గర ఉన్న పల్లెటూరు కోటిపల్లి మాది. నాన్న నారాయణస్వామి. రైతు. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నలుగురన్నదమ్ములు. నాకు చదువు అబ్బలేదు. దీంతో రెండో తరగతిలోనే ఒక రోజు బడి ఎగ్గొట్టి కాకినాడకు వచ్చి దొంగలబండి (టిక్కెట్ లేకుండా రెలైక్కడం) ఎక్కేశాను. అది ఏ ఊరుకెళ్తుందో.. నేనెక్కడికి వెళ్లదలుచుకున్నానో తెలియదు. చివరకు అది ఓ పెద్ద స్టేషన్లో ఆగింది. రైలు దిగి ఊళ్లోకెళ్లాను. కడుపులో ఆకలి తప్ప జేబులో అణా బిళ్ల కూడా లేదు. అలా నడుస్తూ ఒక పెద్ద గేటు దగ్గరకు వెళ్లాను. పని కోసం గేటు తోస్తోంటే గూర్ఖా బెదిరించాడు. అతనితో వాదిస్తుండగానే ఎవరో ఒకాయన పిలిచాడు. లోపలికి వెళ్లాను. ‘ ఏంకావాలి’ అని అడిగాడు. ‘పని కోసం వచ్చా’నన్నాను. ‘ట్రాలీ లాగుతావా’ అని అడిగాడు. ‘లాగుతాన’న్నా. పని దొరికింది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను కలకత్తాలో రైలు దిగానని. మోతీలాల్ చమేరియా స్డూడియోలో పని చేస్తున్నాని... ఆ స్టూడియోలో ‘రాజాహరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నారని. ఆ సినిమా విడుదలైంది. మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే ‘భక్తప్రహ్లాద’, ‘భీష్మ’ వంటి మూకీ చిత్రాలు కలకత్తాలో రూపొందాయి. ఆ సమయంలో బాంబేలో టాకీ చిత్రం తెరకెక్కింది. అది ‘ఆలంఅరా’. అప్పటికి కలకత్తాకు వచ్చి చాలా రోజులే అయింది. నేను పని చేసిన స్టూడియోలోనే నెల జీతం రూ.10 తీసుకొని మరో రెలైక్కాను. విజయవాడకు చేరుకున్నాను. బాయ్‌గా పని చే శాను... ఆ రోజుల్లో విజయవాడలో మారుతీ సినిమా టాకీస్ ఒక్కటే ఉండేది. ఆ టాకీస్‌లో తెరపై కనిపించే మూకీ చిత్రాలకు కథ, కథనం అయి నడిపించే కస్తూరి శివరావు వద్ద పనికి కుదిరాను. ఆయనకు సినిమా కాపీలు అందించడం నా పని. అర్ధణా, అణా చొప్పున నా అవసరాన్ని బట్టి డబ్బులిచ్చేవారు. 1930-32లో ఇక్కడ టాకీల యుగం ప్రారంభమైంది. దాంతో విజయవాడ నుంచి మద్రాసుకు బయలుదేరాను. ఆ రోజుల్లో బలరామయ్య, మీర్జాపురం రాజా వంటి వాళ్లు నిర్మాతలుగా వెలుగొందుతున్నారు. మీర్జాపురం రాజావారు ‘గొల్లభామ’, ‘కీలుగుర్రం’ సినిమాలు తీశారు. సీహెచ్ నారాయణరావు దర్శకత్వంలో ‘భీష్మ’ టాకీ చిత్రం వచ్చింది. కృష్ణవేణి హీరోయిన్గా ‘గొల్లభామ’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలు తీస్తున్న రోజుల్లో లైట్లు మోయడం దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేశాను. బహుశా సినిమా పరిశ్రమలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికే కస్తూరి శివరావు ప్రముఖ నిర్మాత బలరామయ్య దగ్గర చేరారు. అల్వాల్ పేట్‌లోని శోభనాచల స్టూడియోలో నేను ఉండేవాన్ని. వాహిని స్టూడియో, ప్రగతి స్టూడియో, నెఫ్ట్యూన్ స్టూడియో... ఇలా ఒకటెనక ఒకటి కొత్త స్టూడియోలు ఏర్పడ్డాయి. ఏ స్టూడియోలో పని ఉంటే అక్కడికి వెళ్లి చేశాను. క్రమంగా స్టంట్ మాస్టర్నయ్యాను. ఒక్క రూపాయి కూలీతో.. అక్కినేని, కన్నాంబలు హీరో, హీరోయిన్లుగా ‘పల్నాటి యుద్ధం’ సినిమా తీస్తున్న రోజుల్లో ఆ సినిమా దర్శకుడు రామబ్రహ్మం గుండెపోటుతో చనిపోయాడు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న ఎల్వీ దర్శకత్వంలోనే మిగిలిన చిత్రం పూర్తి అయింది. ఆ సినిమా హిట్టయ్యింది. అప్పటికి ఎన్టీరామారావు నాటకాల్లో బాగా నటిస్తున్నాడు. అలా నటిస్తున్న రోజుల్లోనే ఎల్వీప్రసాద్ దృష్టిలో పడ్డాడు. ఎల్వీ ప్రసాద్ ‘మనదేశం’ సినిమా కోసం ఎన్టీరామారావును మద్రాసుకు పిలిపించాడు. ‘రామారావు అని ఓ కుర్రాడు వస్తాడు తీసుకురాపో’ అని నన్ను మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌కు తరిమారు. వెళ్లి చేతిలో ‘రామారావు’ అనే పెద్ద అక్షరాలతో ఓ బోర్డు పట్టుకొని నించున్నా. వచ్చాడు. నాలుగో నెంబర్ బస్సెక్కి ఇద్దరం ఆల్వార్పేటకు చేరుకున్నాం. ‘మన దేశం’ సినిమాలో ఎన్టీరామారావుకు కానిస్టేబుల్ పాత్ర ఇచ్చారు. నేను కూడా అదే పాత్రలో నటించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెఫ్ట్ రైట్ కొట్టే సరికి బూట్లు కరుచుకొని ఇద్దరి కాళ్లకు పుండ్లు పడ్డాయి. ఆ రోజు కూలీ ఒక్క రూపాయి తీసుకొని నాతో పాటు బీఏ సుబ్బారావు గుడిసెకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. మరుసటి రోజు ఆల్వార్పేట్లోనే ఓ గుడిసె అద్దెకు ఇప్పించాను. నెలకు రూ.5. అంత అద్దె భరించడం తన వల్ల కాదన్నాడు. మ్యూజిక్ డెరైక్టర్ టీవీ రాజును జత చేశాను. చెరి సగం భరిస్తూ ఆ గుడిసెలో ఉన్నాడు. నెహ్రూతో చర్చలు... చిత్రపరిశ్రమలో ఒక స్థానం లభించింది. ఎంజీఆర్, శివాజీగణేషన్, కెఆర్ రామస్వామి, ఎన్టీరామారావు, అక్కినేని వంటి వాళ్లందరితో కలిసి పని చేశాను. బీఆర్ పంతులు ‘వీరపాండ్య కట్టబమ్మన్’ సినిమా తీశాడు. ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరి క్రమంగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగాను. ఆ రోజుల్లోనే షమ్మీకపూర్, మలాసిన్హా నటించిన ‘దిల్ తేరా దివాన్’ తమిళ అనువాద చిత్రానికి పని చేశాను. అప్పుడు న్యూయార్క్ ఎంజీఎం స్టూడియో వాళ్లు ‘టార్జాన్ గోస్ టూ ఇండియా’ తీశారు. మైసూర్లో షూటింగ్. ఆ సినిమాకు అన్నీ నేనే అయి పూర్తి చేశాను. ఆ సంస్థే 1952లో ‘భవానీ జంక్షన్’ సినిమా కోసం నా సహాయం కోరింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో షూటింగ్. ప్రధానమంత్రి నెహ్రూ అనుమతి కావాలి. ఆ సినిమాలో నటించేందుకు అప్పటి ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అవాగాడ్కర్ సహా చిత్ర యూనిట్ అంతా మద్రాస్ వచ్చారు. నేను నెహ్రూ దగ్గరకెళ్లాను. స్క్రిప్టు అందజేశాను. అది చదివి ఆయన నిరాకరించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న ఆ సినిమా ఇండియాలో తీయడానికి వీల్లేదన్నారు. దాంతో వాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అప్పటి వరకు వాళ్లతో కలిసి పని చేసినందుకు ఎంజీఎం స్టూడియో నాకు 20 వేల డాలర్లు ఇచ్చింది. 30 సినిమాలు తీసి.. కె. బాలచందర్ రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ను తెలుగులో ఏకాంబరేశ్వర్రావును భాగస్వామిగా పెట్టుకొని ‘సుఖదుఃఖాలు’ పేరుతో తీశాను. ఎస్వీరంగారావు హీరోగా నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ, కృష్ణలతో ‘జగత్ కిలాడీలు’తీశాను. హిట్ అయింది. వరుసగా ‘జగజ్జెట్టీలు’,‘జగజ్జెంత్రీలు’ తీశాను. డబ్బులు బాగా వచ్చాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాత మనువడు’ నిర్మించాను. 400 రోజులు ఆడింది. మా యూనిట్లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన కోడి రామకృష్ణ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు పూర్తిస్థాయి దర్శకత్వం చేశాడు. ఆ సినిమా 600 రోజులు ఆడింది. నిర్మాతగా 30 సినిమాలు తీశాను. ‘అంకితం’ నా ఆఖరి సినిమా. ఫిల్మ్‌నగర్‌లో తొలి ఇల్లునాది.. ఎన్టీరామారావు, అక్కినేనిలతో మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. కానీ వాళ్లతో సినిమాలు తీయలేదు. ఎన్టీఆర్ ఎప్పుడు కాల్షీట్ అడిగినా ఇస్తానన్నారు. నా ‘సుఖదుఃఖాలు’ సినిమాకు హీరోగా నటించాలని అక్కినేనిని అడిగాను. ఆయన నా వైపు కోపంగా చూసి ‘నన్ను పెట్టి సినిమాలు తీసే స్థాయికి ఎదిగావా’ అని అన్నారు. అప్పటి నుంచి ఆయననే కాదు ఎన్టీఆర్‌ను కూడా అడిగేందుకు సాహసించలేదు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు సినిమా హైదరాబాద్‌కు తరలి వచ్చింది. అప్పుడు ఫిల్మ్‌నగర్ ఓ అడవి. ఆ అడవిలో మొట్టమొదటి ఇల్లు నాది. వ్యక్తిగత వివరాలు... పేరు : కోటిపల్లి రాఘవ పుట్టిన తేదీ : 9 డిసెంబర్, 1913 సొంత ఊరు : కోటిపల్లి, కాకినాడ అమ్మా,నాన్న : నాగమ్మ, నారాయణస్వామి భార్య : హంస కొడుకు : ప్రతాప్ కూతురు : ప్రశాంతి అవార్డులు : అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య సహా పలు అవార్డులు