కోటిపల్లి రాఘవ
ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ (105) ఇక లేరు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 1913 డిసెంబర్ 9న జన్మించిన రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రాఘవకు ఆరుగురు తోడబుట్టినవాళ్లు. రాఘవకు చదువు అబ్బలేదు. ఇంటి నుంచి కోల్‌కతా పారిపోయారు. అక్కణ్ణుంచి మద్రాస్, హైదరాబాద్.. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు. మూకీ చిత్రాల నుంచి టాకీ వరకూ రాఘవ అన్ని మార్పులనూ చూశారు.
ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, స్టంట్ అసిస్టెంట్‌గా, స్టంట్ మాస్టర్‌గా చేశారు. చివరికి నిర్మాతగా మారారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావు గోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమ¯Œ , భానుచందర్‌లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రాఘవ ప్రతాప్ ఆర్ట్స్‌ది. ఆయన నిర్మించినవాటిలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జంత్రీలు’, ‘జగత్ జెట్టీలు’ సినిమాలున్నాయి. అందుకే ఆయన్ను ‘జగత్ నిర్మాత’ అనేవాళ్లు. రాఘవ పరిచయం చేసిన దాసరి, కోడి రామకృష్ణ శతాధిక చిత్రాల దర్శకులు కావడం విశేషం.
నిర్మాతగా మాత్రమే కాకుండా సినిమా రంగంలో వివిధ బాధ్యతలు చేపట్టారాయన. 1975 నుంచి 1982 వరకూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫౌండర్ మెంబర్‌గానూ, కోశాధికారిగానూ వ్యవహరించారు. 1991 నుంచి 2001 వరకూ కార్యనిర్వాహక సభ్యుడిగా చేశారు. సోలో నిర్మాతగా మారి, రాఘవ నిర్మించిన ‘తాత–మనవడు’కి నంది అవార్డు లభించింది. అలాగే, ‘సంసారం–సాగరం’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు దక్కింది.
తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు దగ్గర ఆఫీస్ బాయ్‌గా చేసిన రాఘవ తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు దక్కించుకోవడం విశేషం. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. రాఘవ భార్య హంసారాణి ఈ ఏడాది మార్చి 23న మరణించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ప్రతాప్, కుమార్తె ప్రశాంతి ఉన్నారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో బుధవారం రాఘవ అంత్యక్రియలు జరగనున్నాయి. రాఘవ మరణం పట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు రాఘవ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment