
తల్లిదండ్రులతో ప్రశాంతి
‘‘నాన్న జీవితం ఎంతో ఆదర్శం. కష్టడినవాళ్లకు ప్రతిఫలం దక్కుతుందనడానికి ఆయన ఓ ఉదాహరణ’’ అన్నారు రాఘవ కుమార్తె ప్రశాంతి. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారామె.
► రాఘవగారు ఇంత సడన్ గా దూరమవుతారని ఎవరూ ఊహించలేదు?
నాన్న శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ అమ్మ చనిపోయాక మానసికంగా కుంగిపోయారు. మొన్న మార్చి 23న అమ్మ చనిపోయారు. అమ్మానాన్నలది 60 ఏళ్ల అనుబంధం. ‘హంసా’ (రాఘవ సతీమణి) అని పిలిచేవారు. ‘నా హంసాకి ఏమీ జరగదు. నేనున్నంత వరకూ నాతోనే ఉంటుంది’ అనే ఫీలింగ్‌తో ఉండేవారు.
► జీవితంలో చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి రాఘ వగారు. భార్యాపిల్లలను బాగా చూసుకునేవారా?
నన్ను, అన్నయ్యను బాగా పెంచారు. నా వయసిప్పుడు 43. నా లైఫ్‌లో మా అమ్మ రెండు సార్లు మాత్రమే ఏడవడం చూశాను. మమ్మల్ని నాన్న అంత బాగా చూసుకున్నారు.
► 105ఏళ్ల రాఘవగారి ఆరోగ్య రహస్యం ఏంటి?
అమ్మ వంటే కారణం.
► చివరి రోజుల్లో మీ నాన్నగారు ఎలా ఉండేవారు?
అమ్మ పిలుస్తున్నట్లు నాన్నకు అనిపించిందని నా ఫీలింగ్. ఆయన బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేసినా మేం వదల్లేదు. కాపలా కాసేవాళ్లం. అయితే మొన్నా మధ్య తెల్లవారుజాము 4.30 గంటలకు బయటకు వెళ్లారు. కింద పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చేర్చాం. ఆ గాయంకన్నా కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ కాలేదు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. నాన్న లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది.