సినీ ‘మహాప్రస్థానం’ | film producer Kotipalli raghava Maha prasthanam | Sakshi
Sakshi News home page

సినీ ‘మహాప్రస్థానం’

Published Sat, Feb 1 2014 8:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

సినీ ‘మహాప్రస్థానం’

సినీ ‘మహాప్రస్థానం’

ఎటు వెళ్తున్నాడో.. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కాకినాడ నుంచి కలకత్తాకు చేరాడు. కడుపు నింపుకునేందుకు పనికోసం తిరిగాడు.
 చిత్రరంగంలో బాయ్‌గా కుదిరాడు. అలా మొదలైన ఆయన పయనం సినిమా నిర్మించే స్థాయికి చేరుకుంది. జగత్‌కిలాడీలు, తాతా మనవుడు, ఇంట్లోరామయ్య.. వీధిలో కృష్ణయ్య తదితర హిట్ చిత్రాలను అందించారు. చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ నగరానికి తరలివ చ్చినప్పుడు ఫిల్మ్‌నగర్‌లో తొలిగా ఇల్లు కట్టి నూతన చిత్ర సామ్రాజ్యానికి బాటలు వేశారు. ఆయనే కోటిపల్లి రాఘవ. నూటొక్క ఏళ్ల కుర్రాడు. ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం లెజెండ్. ఆ సినీ‘మహా’ప్రస్థానం ఆయన మాటల్లోనే..

 
 కాకినాడ దగ్గర ఉన్న పల్లెటూరు కోటిపల్లి మాది. నాన్న నారాయణస్వామి. రైతు. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నలుగురన్నదమ్ములు. నాకు చదువు అబ్బలేదు. దీంతో రెండో తరగతిలోనే ఒక రోజు బడి ఎగ్గొట్టి కాకినాడకు వచ్చి దొంగలబండి (టిక్కెట్ లేకుండా రెలైక్కడం) ఎక్కేశాను. అది ఏ ఊరుకెళ్తుందో.. నేనెక్కడికి  వెళ్లదలుచుకున్నానో తెలియదు. చివరకు అది ఓ పెద్ద స్టేషన్‌లో ఆగింది. రైలు దిగి ఊళ్లోకెళ్లాను. కడుపులో ఆకలి తప్ప జేబులో అణా బిళ్ల కూడా లేదు. అలా నడుస్తూ ఒక పెద్ద గేటు దగ్గరకు వెళ్లాను. పని కోసం గేటు తోస్తోంటే గూర్ఖా బెదిరించాడు. అతనితో వాదిస్తుండగానే ఎవరో ఒకాయన పిలిచాడు. లోపలికి వెళ్లాను.

‘ ఏంకావాలి’ అని అడిగాడు. ‘పని కోసం వచ్చా’నన్నాను. ‘ట్రాలీ లాగుతావా’ అని అడిగాడు. ‘లాగుతాన’న్నా. పని దొరికింది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను కలకత్తాలో రైలు దిగానని. మోతీలాల్ చమేరియా స్డూడియోలో పని చేస్తున్నాని... ఆ స్టూడియోలో ‘రాజాహరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నారని. ఆ సినిమా విడుదలైంది. మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే ‘భక్తప్రహ్లాద’, ‘భీష్మ’ వంటి  మూకీ చిత్రాలు కలకత్తాలో రూపొందాయి. ఆ సమయంలో బాంబేలో టాకీ చిత్రం తెరకెక్కింది. అది ‘ఆలంఅరా’. అప్పటికి  కలకత్తాకు వచ్చి చాలా రోజులే అయింది. నేను పని చేసిన స్టూడియోలోనే నెల జీతం రూ.10 తీసుకొని మరో రెలైక్కాను. విజయవాడకు చేరుకున్నాను.
 
 బాయ్‌గా పని చే శాను...
 ఆ రోజుల్లో విజయవాడలో మారుతీ సినిమా టాకీస్ ఒక్కటే ఉండేది. ఆ టాకీస్‌లో తెరపై కనిపించే మూకీ చిత్రాలకు కథ, కథనం అయి నడిపించే కస్తూరి శివరావు వద్ద పనికి కుదిరాను. ఆయనకు సినిమా కాపీలు అందించడం నా పని. అర్ధణా, అణా చొప్పున నా అవసరాన్ని బట్టి డబ్బులిచ్చేవారు. 1930-32లో ఇక్కడ టాకీల యుగం ప్రారంభమైంది. దాంతో విజయవాడ నుంచి మద్రాసుకు బయలుదేరాను. ఆ రోజుల్లో బలరామయ్య, మీర్జాపురం రాజా వంటి వాళ్లు నిర్మాతలుగా వెలుగొందుతున్నారు.

మీర్జాపురం రాజావారు ‘గొల్లభామ’, ‘కీలుగుర్రం’ సినిమాలు తీశారు. సీహెచ్ నారాయణరావు దర్శకత్వంలో ‘భీష్మ’ టాకీ చిత్రం వచ్చింది. కృష్ణవేణి హీరోయిన్‌గా ‘గొల్లభామ’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలు తీస్తున్న రోజుల్లో లైట్లు మోయడం దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేశాను. బహుశా సినిమా పరిశ్రమలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికే కస్తూరి శివరావు ప్రముఖ నిర్మాత బలరామయ్య దగ్గర చేరారు. అల్వాల్ పేట్‌లోని శోభనాచల స్టూడియోలో నేను ఉండేవాన్ని. వాహిని స్టూడియో, ప్రగతి స్టూడియో, నెఫ్ట్యూన్ స్టూడియో... ఇలా ఒకటెనక ఒకటి కొత్త స్టూడియోలు ఏర్పడ్డాయి. ఏ స్టూడియోలో పని ఉంటే అక్కడికి వెళ్లి చేశాను. క్రమంగా స్టంట్ మాస్టర్‌నయ్యాను.
 
 ఒక్క రూపాయి కూలీతో..
 అక్కినేని, కన్నాంబలు హీరో, హీరోయిన్‌లుగా ‘పల్నాటి యుద్ధం’ సినిమా తీస్తున్న రోజుల్లో ఆ సినిమా దర్శకుడు రామబ్రహ్మం గుండెపోటుతో చనిపోయాడు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న ఎల్వీ దర్శకత్వంలోనే మిగిలిన చిత్రం పూర్తి అయింది. ఆ సినిమా హిట్టయ్యింది. అప్పటికి ఎన్టీరామారావు నాటకాల్లో బాగా నటిస్తున్నాడు. అలా నటిస్తున్న రోజుల్లోనే ఎల్వీప్రసాద్ దృష్టిలో పడ్డాడు. ఎల్వీ ప్రసాద్ ‘మనదేశం’ సినిమా కోసం ఎన్టీరామారావును మద్రాసుకు పిలిపించాడు. ‘రామారావు అని  ఓ కుర్రాడు వస్తాడు తీసుకురాపో’ అని నన్ను మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌కు తరిమారు. వెళ్లి చేతిలో ‘రామారావు’ అనే పెద్ద అక్షరాలతో ఓ బోర్డు పట్టుకొని నించున్నా. వచ్చాడు.  నాలుగో నెంబర్ బస్సెక్కి  ఇద్దరం ఆల్వార్‌పేటకు చేరుకున్నాం.

 ‘మన దేశం’ సినిమాలో ఎన్టీరామారావుకు  కానిస్టేబుల్ పాత్ర ఇచ్చారు. నేను కూడా అదే పాత్రలో నటించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెఫ్ట్ రైట్ కొట్టే సరికి బూట్లు కరుచుకొని ఇద్దరి కాళ్లకు పుండ్లు పడ్డాయి. ఆ రోజు కూలీ ఒక్క రూపాయి తీసుకొని నాతో పాటు బీఏ సుబ్బారావు గుడిసెకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. మరుసటి రోజు ఆల్వార్‌పేట్‌లోనే ఓ గుడిసె అద్దెకు ఇప్పించాను. నెలకు రూ.5. అంత అద్దె భరించడం తన వల్ల కాదన్నాడు. మ్యూజిక్ డెరైక్టర్ టీవీ రాజును జత చేశాను. చెరి సగం భరిస్తూ ఆ గుడిసెలో ఉన్నాడు.
 
 నెహ్రూతో చర్చలు...
 చిత్రపరిశ్రమలో ఒక స్థానం లభించింది. ఎంజీఆర్, శివాజీగణేషన్, కెఆర్ రామస్వామి, ఎన్టీరామారావు, అక్కినేని వంటి వాళ్లందరితో కలిసి పని చేశాను. బీఆర్ పంతులు ‘వీరపాండ్య కట్టబమ్మన్’ సినిమా తీశాడు. ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరి క్రమంగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగాను. ఆ రోజుల్లోనే షమ్మీకపూర్, మలాసిన్హా నటించిన ‘దిల్ తేరా దివాన్’ తమిళ అనువాద చిత్రానికి పని చేశాను. అప్పుడు న్యూయార్క్ ఎంజీఎం స్టూడియో వాళ్లు ‘టార్జాన్ గోస్ టూ ఇండియా’ తీశారు. మైసూర్‌లో షూటింగ్. ఆ సినిమాకు అన్నీ నేనే అయి పూర్తి చేశాను. ఆ సంస్థే 1952లో ‘భవానీ జంక్షన్’ సినిమా కోసం నా సహాయం కోరింది.

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో షూటింగ్. ప్రధానమంత్రి నెహ్రూ అనుమతి కావాలి. ఆ సినిమాలో నటించేందుకు అప్పటి ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అవాగాడ్కర్ సహా చిత్ర యూనిట్ అంతా మద్రాస్ వచ్చారు. నేను నెహ్రూ దగ్గరకెళ్లాను. స్క్రిప్టు అందజేశాను. అది చదివి ఆయన నిరాకరించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న ఆ సినిమా ఇండియాలో తీయడానికి వీల్లేదన్నారు. దాంతో వాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అప్పటి వరకు వాళ్లతో కలిసి పని చేసినందుకు ఎంజీఎం స్టూడియో నాకు 20 వేల డాలర్లు ఇచ్చింది.
 
 30 సినిమాలు తీసి..
  కె. బాలచందర్ రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ను తెలుగులో ఏకాంబరేశ్వర్‌రావును భాగస్వామిగా పెట్టుకొని ‘సుఖదుఃఖాలు’ పేరుతో తీశాను. ఎస్వీరంగారావు హీరోగా నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ, కృష్ణలతో ‘జగత్ కిలాడీలు’తీశాను. హిట్ అయింది. వరుసగా ‘జగజ్జెట్టీలు’,‘జగజ్జెంత్రీలు’ తీశాను. డబ్బులు బాగా వచ్చాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాత మనువడు’ నిర్మించాను. 400 రోజులు ఆడింది. మా యూనిట్‌లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన కోడి రామకృష్ణ  ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు పూర్తిస్థాయి దర్శకత్వం చేశాడు. ఆ సినిమా 600 రోజులు ఆడింది. నిర్మాతగా 30 సినిమాలు తీశాను. ‘అంకితం’ నా  ఆఖరి సినిమా.
 
 ఫిల్మ్‌నగర్‌లో తొలి ఇల్లునాది..
 ఎన్టీరామారావు, అక్కినేనిలతో మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. కానీ వాళ్లతో సినిమాలు తీయలేదు. ఎన్టీఆర్ ఎప్పుడు కాల్షీట్ అడిగినా ఇస్తానన్నారు.   నా ‘సుఖదుఃఖాలు’ సినిమాకు హీరోగా నటించాలని అక్కినేనిని అడిగాను. ఆయన నా వైపు కోపంగా చూసి ‘నన్ను పెట్టి సినిమాలు తీసే స్థాయికి ఎదిగావా’ అని అన్నారు. అప్పటి నుంచి ఆయననే కాదు ఎన్టీఆర్‌ను కూడా అడిగేందుకు సాహసించలేదు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక  తెలుగు సినిమా హైదరాబాద్‌కు తరలి వచ్చింది. అప్పుడు ఫిల్మ్‌నగర్ ఓ అడవి. ఆ అడవిలో మొట్టమొదటి ఇల్లు నాది.
 
 వ్యక్తిగత వివరాలు...
 పేరు :  కోటిపల్లి రాఘవ
 పుట్టిన తేదీ : 9 డిసెంబర్, 1913
 సొంత ఊరు : కోటిపల్లి, కాకినాడ
 అమ్మా,నాన్న : నాగమ్మ, నారాయణస్వామి
 భార్య : హంస
 కొడుకు : ప్రతాప్
 కూతురు : ప్రశాంతి
 అవార్డులు : అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య సహా పలు అవార్డులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement