ఉపాధిపై ప్రైవేటు
- పరిశ్రమల ప్రైవేటీకరణతో వీధిన పడుతున్న కార్మికుల కుటుంబాలు
- అసంఘటిత కార్మిక సమాఖ్య మహాసభలో {పొఫెసర్ కోదండరామ్
కేయూ క్యాంపస్ : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం వల్లే వివిధ పరిశ్రమలు మూతపడి అసంఘటిత కార్మికుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. వీరికి ఉపాధిపై ప్రై‘వేటు’కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదన్నారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో సోమవారం నిర్వహించిన అసంఘటిత కార్మిక సమాఖ్య రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్‌లోని అజంజాహిమిల్, హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ వంటి సంస్థలు కూడా మూతపడ్డాయని, ఆల్విన్ కంపెనీని ప్రైవేటుపరం చేశారని చెప్పారు. సింగరేణిలోనూ కొన్ని పనులను ప్రైవేటు వారికి అప్పగించారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపర్చి ప్రైవేటీకరించడంతో అసంఘటిత కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు వారి ఉపాధిపై ప్రభావం పడుతోందన్నారు. విద్యుత్‌శాఖలో కాంట్రా క్ట్ పద్ధతిన పనిచేస్తున్న 27 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయూం లోనే పలు ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించారని అన్నా రు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు కూడా ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తున్నాయని, ఇలా హైదరాబాద్‌లో వందల ఎకరాల భూమి దక్కించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆ భూములతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీ కోసమని ప్రభుత్వమే రైతుల నుంచి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి.. కొంతకాలం తర్వాత పరిశ్రమలు పెట్టకుండా రూ.45 లక్షలకు ఎకరం చొప్పున ఇతరులకు కట్టబెట్టిందని వివరించారు. తెలంగాణలోని అసంఘటిత కార్మికులతో పాటు రైతులు, బీడీ, చేనేత కార్మికులు, చిరు వ్యాపారులు, స్వర్ణకారుల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయన్నారు.
పాలకవర్గాల విధానాల వల్లే..
పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లే అసంఘటిత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. పలు పోరాటాలతో కార్మిక సంక్షేమ చట్టాలు వచ్చినా, అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కార్మికులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని విమర్శిం చారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైం, ఔట్ సోర్సింగ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. అసంఘటిత కార్మికులకు కూడా గౌరవప్రదమైన జీవనం కావాలని ఆకాంక్షించారు. ప్రజాపోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నామని, అది ఏ ఒక్క పార్టీ ఘనత కాదని చెప్పారు. మహాసభలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటి శ్రీనివాస్, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బాధ్యులు నర్సాగౌడ్ మాట్లాడారు.