ఇంజనీరింగ్‌లో బాలురు..అగ్రి–మెడికల్‌లో బాలికల హవా
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఆర్‌ఆర్‌పేట (ఏలూరు): బీటెక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్సు టెక్నాలజీ, బి–ఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ హార్టికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్–2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కోటేశ్వరరావు, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొ. సీహెచ్.సాయిబాబు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జీఎస్ పండాదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణతా శాతాలు ఇలా..
ఇంజనీరింగ్‌లో బాలురు, అగ్రి–మెడికల్ విభాగంలో బాలికలు ఆధిక్యాన్ని కనబరిచారు. అలాగే, ఇంజనీరింగ్‌లో 74.39 శాతం మంది, అగ్రి–మెడికల్‌లో 83.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ టాప్ పది ర్యాంకుల్లో బాలురు ఉండగా.. అగ్రి–మెడికల్‌లో బాలురు, బాలికలు చెరో అయిదు స్థానాల్లో నిలిచారు. ఇంజనీరింగ్, అగ్రి–మెడికల్ రెండు విభాగాల్లోని 20 ర్యాంకర్లలో తొమ్మిది మంది తెలంగాణ, ఒకరు బీహార్‌కు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ఏపీ విద్యార్థులు. కాగా, ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఫలితాలను మే 1న విడుదల చేయాలని అధికారులు భావించినా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలలో గందరగోళం ఏర్పడడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది.
కనీస అర్హత మార్కులు 40
ఇదిలా ఉంటే.. 160 మార్కులకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా 40 మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కుల్లేవు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,719 మంది దరఖాస్తు చేయగా 1,85,711 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,38,160 (74.39 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రి, మెడికల్ విభాగంలో 86,986 మంది దరఖాస్తు చేయగా 81,916 మంది పరీక్ష రాశారు. వీరిలో 68,512 మంది (83.64 శాతం) అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు 82,088 మంది, బాలికలు 56,072 మంది అర్హత సాధించారు. అగ్రి–మెడికల్‌లో బాలురు 22,946 మంది, బాలికలు 45,566 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఇంజనీరింగ్ విభాగంలో 1,22,188 మందికి, అగ్రి, మెడికల్ విభాగంలో 63,206 మందికి ర్యాంకులు కేటాయించారు.
ఎంసెట్‌లో పాసైనా ఇంటర్లో ఫెయిల్
మరోవైపు.. ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అందులో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఫెయిల్ కావడంతో వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో 12,874 మంది ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేదు. అగ్రి–మెడికల్ విభాగంలో ఉత్తీర్ణులైన 3,152 మంది ఇంటర్లో పాస్ కాలేదు. అలాగే, ఇంటర్మీడియెట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరైన ఇంజనీరింగ్ విభాగంలోని 3,067 మంది, అగ్రి–మెడికల్ విభాగంలో 2,153 మంది విద్యార్థులు ఇంటర్ మార్కులు అందచేయకపోవడంవల్ల వారికి ర్యాంకులు కేటాయించలేదు.
సమాధానాల ఆప్షన్లలో మార్పులు
ఇంజనీరింగ్ విభాగంలో ఏడు సెషన్లలో నిర్వహించిన పరీక్షలలో ప్రాథమిక కీ కి సంబంధించి 139 ప్రశ్నలపై అభ్యంతరాలు రాగా నిపుణుల సలహా మేరకు 10 ప్రశ్నలకు ఆప్షన్లు మార్పుచేశారు. మరో 10 ప్రశ్నల మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు. అలాగే, మెడికల్ విభాగంలో మూడు సెషన్లలో జరిగిన పరీక్షలలో 41 ప్రశ్నలకుగాను నిపుణుల సలహా మేరకు మూడు ప్రశ్నలకు ఆప్షన్లను మార్పు చేయగా ఒక ప్రశ్న మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు.
10 నుంచి ర్యాంకు కార్డులు
ఇదిలా ఉంటే.. ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ పదో తేదీ నుంచి ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్‌లో అర్హత పొంది ర్యాంకు రాని వారు ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చిన డిక్లరేషన్ ఫారంను పూర్తిచేసి ఇంటర్ మార్కుల జాబితాను కన్వీనర్ ఆఫీస్ అడ్రస్‌కు పోస్టు ద్వారా, లేదా ఈమెయిల్ ఐడీ ‘హెల్ప్లైన్ఏపీఎంసెట్2కె19ఎట్దరేట్జీమెయిల్డాట్కామ్’కు పంపితే తదుపరి జాబితాల్లో వారికి ర్యాంకులు కేటాయిస్తారు. విద్యార్థులు తమ ప్రశ్నపత్రం, నిర్ధారించిన కీ తో సరిపోల్చుకునేందుకు వారి ఆన్లైన్ జవాబుపత్రాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు ఎంసెట్ అధికారులు పంపించారు. వాటిని ఎంసెట్ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు.
18లోగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
ఎంసెట్ ఫలితాల విడుదల దాదాపు నెలరోజుల పాటు ఆలస్యం కావడంతో విద్యార్థుల్లో అనేకమంది ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై పడనుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈనెల 18 లోగానే అడ్మిషన్లను చేపడతామని అధికారులు చెప్పారు.
ఇంజనీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు..
– కురిశేటి రవి శ్రీతేజ (పశ్చిమగోదావరి)
– పి. వేదప్రణవ్ (రంగారెడ్డి, తెలంగాణ)
– గొర్తి భానుదత్త (పశ్చిమగోదావరి)
– డి. చంద్రశేఖర్ ఎస్ఎస్ హేతహవ్య (రంగారెడ్డి, తెలంగాణ)
– బి. కార్తికేయ (రంగారెడ్డి, తెలంగాణ)
– రిషి షరాఫ్ (మాధేపూర్, బీహార్)
– జీవీకె సూర్య లిఖిత్ (పశ్చిమగోదావరి)
– ఎ. అభిజిత్‌రెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ)
– ఆర్యన్ లద్ధా (రంగారెడ్డి, తెలంగాణ)
– ఎ. హేమవెంకట అభినవ్ (కొత్తగూడెం, తెలంగాణ)
అగ్రి–మెడికల్‌లో టాప్ 10 ర్యాంకర్లు..
– సుంకర సాయిస్వాతి (చిత్తూరు)
– దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి (తూర్పుగోదావరి)
– అత్యం సాయిప్రవీణ్ గుప్తా (తూర్పుగోదావరి)
– తిప్పరాజు హాసిత (హైదరాబాద్)
– జి.మాధురిరెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ)
– గొంగటి కృష్ణవంశీ (నెల్లూరు)
– కేజే వైష్ణవీ వర్మ (కర్నూలు)
– డి. సుభిక్ష (తూర్పుగోదావరి)
– కొర్నెపాటి హరిప్రసాద్ (గుంటూరు)
– ఎంపటి కుష్వంత్ (భూపాలపల్లి, తెలంగాణ)
ఐఏఎస్ అవుతా
ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఫస్ట్ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముంబై ఐఐటీలో సీఎస్ఈ గ్రూపు చదవాలని ఉంది. తల్లిదండ్రులు గీతాకుమారి, నాగ వెంకట ఉమామహేశ్వర గుప్తాల సహకారంతో పాటు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగా. పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్ ఎంపీసీలో పదికి పది జీపీఏ, జేఈఈ మెయిన్స్‌లో 136వ ర్యాంకు వచ్చింది. బిట్ శాట్‌లో 450 మార్కులకు 450 మార్కులు వచ్చాయి. నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదల, క్రమశిక్షణతో రోజుకు 14 గంటలు చదివేవాడని శ్రీతేజ తల్లిదండ్రులు తెలిపారు.
– రవి శ్రీతేజ, తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా, ఎంసెట్ ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్
కార్డియాలిజిస్ట్ను అవుతా
మెడిసిన్‌లో కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. తల్లిదండ్రులు విజయశాంతి, సూర్యభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో ఎంసెట్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించగలిగా. టెన్త్, ఇంటర్లో పదికి పది జీపీఏ సాధించా. నీట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి మంచి కార్డియాలజిస్ట్‌గా గుర్తింపు పొందాలన్నది నా కోరిక.
– దాసరి కిరణ్‌కుమార్, ఎంసెట్ ఆగ్రికల్చర్ విభాగంలో 2వ ర్యాంకర్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా
పరిశోధనా రంగంలో రాణిస్తా
పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణలు చేసి దేశాన్ని సమాచార, సాంకేతిక రంగంలో ముందంజలో నిలపాలని ఉంది. అమ్మానాన్నలు నాగ వెంకట విశ్వనాథం, సూర్య సుందరలక్ష్మి. ఇద్దరూ టీచర్లు. పేద విద్యార్థుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వీరు తమ కుమారుడి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
– గొర్తి భానుదత్త, ఇంజనీరింగ్ 3వ ర్యాంకర్, భీమవరం, ప.గో. జిల్లా