‘లా’కు చక్కటి మార్గం లాసెట్..
ప్రస్తుతం సమున్నత వృత్తిగా లీగల్ ప్రొఫెషన్ వెలుగొందుతోంది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. బ్యాంకింగ్, బీమా, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే కొత్త కొలువులను అందుబాటులోకి తెస్తోంది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.
లాసెట్-2014
లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సు, ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్(10+2 విధానంలో). ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:
ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడేళ్ల కోర్సుకు, ఐదేళ్ల కోర్సుకు సిలబస్ ఒకటే అయినప్పటికీ, ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు
1.జనరల్ నాలెడ్డ్, మెంటల్ ఎబిలిటీ 30 30
2.కరెంట్ అఫైర్స్ 30 30
3.లా ఆప్టిట్యూడ్ 60 60
సిద్ధమవ్వండిలా:
కరెంట్ అఫైర్స్ తేలికైన విభాగం. తక్కువ శ్రమతోనే ఎక్కువ మార్కులు సాధించేందుకు వీలుకల్పిస్తుంది. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ ముఖ్య పరిణామాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, సదస్సులు, అవార్డులు, ఐరాస నివేదికలు, నియామకాలు, ముఖ్య వ్యక్తులు వంటి అంశాల నుంచి వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రామాణిక దినపత్రికలు చదవాలి.
జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే స్టాండర్డ్ జీకేను ప్రిపేర్ కావడం మంచిది. ఈ క్రమంలో అవార్డులు, ప్రథమ వ్యక్తులు, గ్రంథాలు-రచయితలు, సంస్థలు-ఏర్పాటు చేసిన సంవత్సరం, భారత రాజ్యాంగం వంటి అంశాలను చదవాలి.
మెంటల్ ఎబిలిటీలో ప్రశ్నల క్లిష్టత ఇతర పోటీ పరీక్షల స్థాయి కంటే కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగం కోసం అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్ వంటి అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
న్యాయ విద్య అభ్యసించేందుకు అవసరమయ్యే ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు వస్తాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగం తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
: ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) ఐదు
బి) మూడు
సి) ఏడు
డి) రెండు
పీజీ లాసెట్
పీజీ లాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎల్ఎల్ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ ఉత్తీర్ణులు.
పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వ్యవధి: 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జ్యూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బిలో మర్కెంటైల్ లా; లేబర్ లా; పబ్లిక్ ఇంటర్నేషనల్ లా; క్రైమ్స్ అండ్ టార్ట్స్; ఐపీఆర్, ఇతర లాలకు సంబంధించిన ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రం ఉంటుంది.
ఇంటర్వ్యూ - లాసెట్ కన్వీనర్
లాసెట్, పీజీ లాసెట్-2014 కన్వీనర్ వి.ఆర్.సి.కృష్ణయ్యతో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్రస్తుతం లా కోర్సులు పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి?
లా కోర్సులు పూర్తిచేసిన వారికి ఆకాశమే హద్దుగా అవకాశాలున్నాయి. దేశవ్యాప్త న్యాయస్థానాల్లో విసృ్తత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయవాదులుగా, నాయమూర్తులుగా అంచెలంచెలుగా ఉన్నతావకాశాలు అందుకోవచ్చు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో ప్రతి సంస్థకూ న్యాయ సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. అందువల్ల ఆ సంస్థలు లా కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో లా ఆఫీసర్లుగా, ప్రభుత్వ అడ్వొకేట్లుగా, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా కెరీర్‌ను ప్రారంభించడానికి అవకాశాలున్నాయి.
లాను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం?
లాను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే వారికి సమయస్ఫూర్తి, చురుకుదనం, భాషపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం.
ఈ ఏడాది లాసెట్, పీజీ లాసెట్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది?
గతేడాది మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 17,653 మంది, ఐదేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 4,596 మంది, పీజీ లాసెట్‌కు 1712 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వరుసగా బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 25 వేల మంది, పీజీకి రెండు వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
గతంలో ఓపెన్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏమైనా మార్పులున్నాయా?
లా కోర్సుల్లో చేరాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 10+2+3 విద్యార్హతలు తప్పనిసరి. ఓపెన్ యూనివర్సిటీ విధానంలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉంటేనే లాసెట్ రాయడానికి అర్హులు. పదో తరగతి, డిగ్రీ పూర్తయ్యాక ఇంటర్‌ను పూర్తిచేసిన లాసెట్ రాయడానికి అర్హులు కారు.
రాష్ట్రవ్యాప్త కళాశాలలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి?
మూడేళ్ల బీఎల్ కోర్సుకు ఏడు యూనివర్సిటీ కళాశాలలో 450 సీట్లు, 42 ప్రైవేటు కళాశాలలో 7,060 సీట్లు ఉన్నాయి. ఐదేళ్ల బీఎల్ కోర్సుకు ఆరు యూనివర్సిటీ కళాశాలలో 370 సీట్లు, 31 ప్రైవేటు కళాశాలలో 2,960 సీట్లు ఉన్నాయి. పీజీ (ఎల్ఎల్ఎం/ఎంఎల్) కోర్సుకు 9 యూనివర్సిటీ కళాశాలలో 475 సీట్లు, 14 ప్రైవేటు కళాశాలలో 480 సీట్లు అందుబాటులో ఉన్నాయ.
- బి.హరిమల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్.
ఎస్వీయూ, తిరుపతి.
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12, 2014.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014.
అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014.
వెబ్సైట్: www.aplawcet.org
ఇటీవల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ లాసెట్)- 2014 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సెట్లను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.