‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ విడుదల
హైదరాబాద్: అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరుకు తెలంగాణ వచ్చాక న్యాయం జరుగుతుందని భావించామని, కాని పాలకులు నిరాశకు గురిచేశారని పాలమూరు అధ్యయన వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలి వంటి అంశాలతో పాలమూరు అధ్యయన వేదిక ‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ను రూపొందించింది. దీనిని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలమూరులో కృష్ణానది 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నా, తుంగభద్ర లాంటి రెండు జీవనదులు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ నీరు లేకపోవడమే కాకుండా, జోగినీ వ్యవస్థ, అనారోగ్య సమస్యలు, విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిశ్రమలు లేకపోవడం వంటి వాటి వల్ల వెనుకబడిన జిల్లాగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో పాలమూరు సమస్యను అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లేందుకు, ఓట్ల కోసం వచ్చేవారికి అక్కడి ప్రజలు ప్రశ్నించేందుకు ఈ ఎజెండాను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ రాఘవాచారి, మల్లయ్య, ప్రొఫెసర్ వనమాల, ఎ.రాజేంద్రబాబు, మోహన్‌సింగ్ పాల్గొన్నారు.