ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సుబ్బారావు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాల గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆదివారం ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడి సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. డాక్టర్ సంధ్యారాణి ఈ విషయాన్ని తన డైరీలో రాసుకోవడంతోపాటు, కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫోన్‌లో వేధింపుల గురించి వివరించింది. డాక్టర్ సంధ్యారాణి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రొఫెసర్ లక్ష్మిపై కేసు నమోదు కావడంతో డీఎంఈ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్‌సుబ్బారావు వెల్లడించారు. ఆమెపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుందని, నివేదిక అందిన తరువాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.