మనిషి చావును జయిస్తాడా ?
మనిషికి మరణం లేకపోతే.. దేవుడవుతాడు. అప్పుడు దేవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి వస్తుందా? వైద్య విజ్ఞాన రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న మానవుడు చావును జయంచగలడా? జయించవచ్చని అంటున్నారు జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యువల్ నోవా హరారి. జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని, జెనెటికల్ ఇంజనీరింగ్ లేదా సైబోర్గ్ టెక్నాలజీని ఉపయోగించి చావుకు చావును లిఖించవచ్చని ఆయన చెబుతున్నారు.
అప్పుడు చావు, పుట్టుకలు మానవుడి చేతిలోనే ఉంటాయి. అప్పుడు పురాణాలను తిరగ రాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా మెషిన్‌ను, మనిషిని కలగలిపి హాలీవుడ్ చిత్రం టెర్మినేటర్‌లోని ష్వాజ్నెగ్గర్ పాత్రలాగా సైబోర్గ్‌ను సృష్టించవచ్చని, ఇప్పటికే ప్రపంచంలోని అనేక సాంకేతిక దిగ్గజ సంస్థలు ఈ దిశగా ప్రయోగాలు ప్రారంభించాయని ప్రొఫెసర్ హరారి తెలిపారు. ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రయోగాలు ఫలించి ఓ 200 సంవత్సరాల్లో మానవుడు పూర్తి సైబోర్గ్గా మారుతాడని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. మానవుడు సైబోర్గ్గా మారితే బాడీలో ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకుంటా చావు దరిదాపుల్లోకి రాకుండా చూసుకోగలడని ఆయన అన్నారు. అయితే సైబోర్గ్గా మారడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో ధనవంతులకే అజరామరులయ్యే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.