సమాజంలో ప్రశ్నించేతత్వం రావాలి
కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
సిరిసిల్ల: సమాజంలో ప్రశ్నించేతత్వం రావాలని, తెలియని విషయాలను అడిగే ధైర్యం చేయాలని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో ‘రంగినేని ఎల్లమ్మ’రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో జరిగే వివక్షపై, సామాజిక అంశాలపై ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు. ముందుగా అడుగడం నేర్చుకోవాలని, లేకుంటే అజ్ఞానిగానే జీవితాంతం ఉంటామని వివరించారు. సాహిత్యం సమాజ హితాన్ని కోరుకుంటుందని, ప్రజల్లో కొత్త ఆలోచనలను సాహిత్యం ద్వారా వస్తుందన్నారు.
అనాథ ఆశ్రమాలు, వృద్ధశ్రమాలు అనే పదాలు వాడవద్దని గౌరవ ప్రదమైన పేర్లను పెట్టాలని శ్రీధర్ అన్నారు. ‘రంగినేని ఎల్లమ్మ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం–2016’ను ఎ.ఎన్.జగన్నాథశర్మ రాసిన ‘కథా స్రవంతి’, ప్రొఫెసర్ ఎమ్.ఎమ్. వినోదిని రాసిన ‘బ్లాక్ ఇంక్’కథా సంపుటాలను శ్రీధర్‌కు అందించారు. మెమొంటో, శాలువ, అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ సంపాదకులు పత్తిపాక మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, సాహితీవేత్తలు జూకంటి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.