లోకేష్‌కు ఢిల్లీ టూర్లో ఒరిగిందేంటి?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి, జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14వ తేదీన ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ . అక్టోబర్ 5 వరకు దేశ రాజధానిలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండటంపై లోకేష్ చెబుతున్న మాటలు రెండే రెండు. ‘‘ఒకటి బాబు అరెస్ట్‌పై జాతీయ నేతల మద్దతు కోరడం, రెండు న్యాయకోవిదులతో చర్చలు’’.
ఢిల్లీ మకాంపై విమర్శలు
అయితే లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో గడపడం రాజకీయంగా తప్పుడు వ్యూహమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అరెస్ట్ అయి జైలులో ఉంటే.. రాష్ట్రంలో ఉండి పార్టీని, పార్టీ కార్యకలాపాలను ముందుండి నడిపించాల్సిన నేత దేశ రాజధానిలో మకాం వేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీకి ఒక నాయకుడిగా, ప్రత్యామ్నాయ నేతగా ఎదగడానికి వచ్చిన అవకాశాన్ని కూడా లోకేష్ వదులుకుంటున్నాడనే చెబుతున్నారు. ఇక ఏపీకి వస్తే సీఐడీ అరెస్ట్ చేస్తుందనే భయంతో లోకేష్ ఢిల్లీకి పరారయ్యరనేది కూడా మరో విమర్శ. ఈ విషయంలో లోకేష్ వాదన మరోలా ఉంది. "ఢిల్లీకి వచ్చి కూడా CID అరెస్ట్ చేస్తుంది కదా అన్నది". సాంకేతికంగా ఇది తప్పుబట్టకపోయినప్పటికీ ఢిల్లీలో అరెస్టయితే దేశవ్యాప్తంగా కొంత మైలేజీ లభిస్తుందన్న ఆశ తెలుగుదేశంలో ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఢిల్లీలో అరెస్టయినా, అమెరికాల అరెస్టయినా.. లోకేష్‌కు కవరేజ్ ఇవ్వాల్సింది తెలుగు మీడియానే తప్ప మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు. ఆ కోణంలో ఆలోచిస్తే.. కీలక సమయంలో ఏపీలో ప్రజల మధ్య ఉంటే నాయకుడిగా లోకేష్‌కు మరింత పేరు వచ్చేదన్నది వీరి భావన.
రెంటికి చెడ్డ రేవడి టీడీపీ
తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ నేతలు స్పందించలేకపోవడం, లోకేష్ ఢిల్లీ పర్యటనపై ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏ జాతీయ నాయకులు కలిసి, బాబుకు అనుకూలంగా నిరసన తెలిపిన దాఖలాలు లేవని అన్నారు. ఎందుకంటే టీడీపీ ఏ కూటమిలో లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. అటు బీజేపీతోనూ, ఇటు ప్రతిపక్షాల ఇండియా కూటమిలోనూ లేదు. మమతాబెనర్జీ వంటి వారు స్పందించినా, పెద్ద ఎత్తున రాజకీయ స్పందన రావడానికి అవకాశమే లేదన్నారు. కారణం బాబు చేసుకున్న స్వయంకృతాపరధమేనని చెప్పారు.
ఒకప్పుడు మోదీని విమర్శించి.. ఇప్పుడు..
2019కు ముందు ఎన్డీయేను వదిలి బీజేపీయేతర పార్టీలతో కలిసి నానా హడావిడీ చేశారని,. 2019 తర్వాత పొరపాటున బీజేపిని ఏ మాటున విమర్శించకుండా, ఏ ప్రతిపక్ష మీటింగ్‌కు వెళ్లకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలిపారు. ఇక ఇటీవలి కాలంలో మోదీ విజనరీ అంటూ పొగడటం మెదలు పెట్టాడంతో.. ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు ప్రశంసించడంతో బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికీ బాబును విశ్వసించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
చదవండి: నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం
రాష్ట్రంలో ఉండి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు
మరోవైపు ఇప్పటికీ బీజేపీతో కలవడానికి ఆరాటపడుతున్న చంద్రబాబును కలుపుకోవడానికి ఇండియా కూటమి రెడీగా లేదని చెప్పారు దీంతో దేశ రాజధానిలో బాబు అరెస్ట్‌పై భారీ స్పందన రావడం లేదని తెలిపారు. జాతీయ మీడియాలో బాబు అరెస్ట్‌ను ఎక్స్పోస్ చేయడానికి లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్, విజయవాడలో కూర్చొని జాతీయ మీడియాతో ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని తెలిపారు. దీనివల్ల లోకేష్ ఢిల్లీలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ చేసే పరిస్థితి లేదన్నారు.
లోకేష్ సలహాలు ఇచ్చే అవసరం లేదు
లోకేష్ చెబుతున్న రెండో పాయింట్.. న్యాయ కోవిదులతో చర్చలు.. లాయర్లతో లోకేష్ చర్యలు జరిపే అవకాశమే లేదన్నారు. లేదు. ఎందుకంటే లీగల్‌గా బాబు తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లుథ్రా, హరీష్ సాల్వే ప్రముఖ లాయర్లని, వీరికి లోకేష్ సలహాలు ఇచ్చే అవసరం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీకి కమిటెడ్ లాయర్లు, లీగల్ సెల్ ఉండనే ఉందని.. వారే సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడుతుంటారని తెలిపారు. అంతేగాక చంద్రబాబు తన లాయర్లు కలిసి మాట్లాడేందుకు వీలు కూడా ఉండటంతో వీళ్లతో లోకేష్ చర్చించేది ఏం ఉండదని.. కావున రోజుల తరబడి ఢిల్లీలో ఉండాల్సిన పనిలేదని చెప్పారు.
అరెస్ట్‌కు భయపడి డిల్లీలో..
ఇక సీఐడీ అరెస్ట్‌కు భయపడి లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడనే విమర్శలపై నాగేశ్వరరావు స్పందిస్తూ.. ఏపీ పోలీసులు ఢిల్లీ వెళ్లి కూడా లోకేష్‌ను అరెస్ట్ చేయొచ్చని..కానీ లోకేష్ మాత్రం ఇప్పటి వరకు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నాడనే దానిపై సరైన సమాధానం లేదని అన్నారు. పొలిటికల్‌గా, లీగల్‌గా ఢిల్లీలో లోకేష్ చేసే పని లేదన్నారు. రాష్ట్రంలో లోకేష్ అవసరం పార్టీకి ఉందని, ఈ సమయంలో ఢిల్లీలో ఎందుకు ఉంటున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు,. అందుకే అరెస్ట్‌కు భయపడి ఢిల్లీలో ఉన్నడనే వాదనకు బలం చేకూరుతుందని తెలిపారు.
అరెస్ట్ అయితే నెగిటివిటీ ఏం రాదు
ఒకవేళ అరెస్ట్‌కు భయపకుండా ఎలాగైనా అరెస్ట్ చేస్తారని భావించిన లోకేష్.. ఒకవేళ ఢిల్లీలో అరెస్ట్ చేస్తే జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చనే ఆలోచన ఏమైనా ఉండవచ్చని పేర్కొన్నారు. అరెస్ట్ అయితే నెగిటివిటీ ఏం రాదని.. జయలలిత, లాలూ ప్రసాద్, అమిత్‌షా, వాజ్‌పేయ్ వంటి వారు అరెస్ట్ అయినా గొప్ప పదవులను చేపట్టారని ఉదాహరించారు. అలాగే అరెస్ట్‌కు భయపడితే ప్రధాన నాయకుడు ఎప్పుడూ కాలేరని విమర్శించారు.