న్యాయ విద్యలో 5,620 సీట్లు
అనుమతినిచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 49 న్యాయ విద్య కళాశాలల్లో 5,620 సీట్ల భర్తీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది. దీంతో ప్రవేశాల షెడ్యూలు జారీపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగే ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారు తేదీలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మూడేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు 22 కాలేజీల్లో 3,320, 15 కాలేజీల్లో ఐదేళ్ల కోర్సులో 1,740, 12 కాలేజీల్లో ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం 560 సీట్లను భర్తీ చేసేందుకు బార్ కౌన్సిల్ అనుబంధ గుర్తింపునిచ్చింది. మరోవైపు గత జూలైలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. వీరిలో మూడేళ్ల కోర్సుకు అర్హత సాధించిన వారు 9,887 మంది, ఐదేళ్ల కోర్సులో 2,811 మంది, ఎల్ఎల్ఎంలో 1,620 మంది ఉన్నారు.